తెలుగు

కాపరి స్వరం 

మే 9, 2022
పాస్కా కాలం నాలుగవ వారంలోని సోమవారం
నేటి పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

గమనిక: A సంవత్సరంలో, ఈ సువార్తను ముందు ఆదివారం చదివినప్పుడు, ఈ రోజు యోహాను 10:11-18 ఉపయోగిస్తారు.

“…అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తుండగా, అవి అతని స్వరాన్ని వింటాయి. తన గొర్రెలన్నిటినీ బయటకు తోలిన తరువాత, అతడు వాటికి ముందుగా నడుస్తాడు. గొర్రెలు అతని స్వరాన్ని గుర్తుపడతాయి కాబట్టి అతణ్ణి అనుసరిస్తాయి. కానీ అవి అపరిచితుణ్ణి అనుసరించవు; అపరిచితుల స్వరాన్ని గుర్తుపట్టవు కాబట్టి అతని దగ్గరనుండి పారిపోతాయి.”  యోహాను 10:3–5

జీవితంలో మీకు అన్నిటికంటే బాగా పరిచయమైనది ఏమిటి?  ఎక్కువ సమయం మీ మనసులో ఏ స్వరం లేదా ఏయే స్వరాలు ప్రతిధ్వనిస్తుంటాయి?  మనం క్రమం తప్పకుండా అనేక ప్రభావాలకు లోనవుతుంటాము.  వాటిలో కొన్ని మంచివి, మరికొన్ని అంత మంచివి కావు.  ప్రతిరోజూ మనకు ఎదురయ్యే అనేక “స్వరాలు” లేదా ప్రభావాలు మనపై ఎలాంటి ప్రభావమూ చూపవని తరచూ మనకు మనమే నచ్చజెప్పుకుంటాము.  ప్రసార మాధ్యమాల స్వరం, జనాదరణ పొందిన సంస్కృతి, ధనంపై మమకారం, గుర్తింపు పొందాలనే కోరిక, ఇంకా మరెన్నో మనపై ఒత్తిడి తెస్తుంటాయి.  ఇవి బలమైన ప్రభావాలు; మనం నమ్మాలనుకున్నా లేకపోయినా, అవి మనపై ప్రభావం చూపుతాయి.

పైన ఇచ్చిన సువార్త కాపరి స్వరాన్ని అపరిచితుని స్వరంతో పోల్చి చూపిస్తూ, మనలో జరిగే ఈ అంతరంగ పోరాటాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. గొర్రెలకు సులభంగా నేర్పించవచ్చు, అలవాటు చేయవచ్చు. కాపరులు తమ గొర్రెలతో తరచుగా మాట్లాడటం సాధారణ ఆచారంగా ఉండేది కాబట్టి, గొర్రెలు తమ కాపరి స్వరాన్ని నేర్చుకుంటాయి. కాపరి స్వరానికి అలవాటు పడిన తరువాత, అతడు పిలిచినప్పుడు అవి అతని వైపు తిరిగి అతనిని అనుసరించేవి.

మన విషయంలోనూ ఇలాగే జరుగుతుంది.  మనకు అన్నిటికంటే బాగా పరిచయమైన దాని స్వరాన్నే మనం అనుసరిస్తాము.  మనం ప్రతిరోజూ దేనిలో మునిగిపోతామో, అది ఏదైనా సరే, క్రమంగా మనకు మరింత చేరువై, మనకు తెలియకుండానే దానిని అనుసరించేలా మనల్ని ఆకర్షిస్తుంది.  

ఇక్కడ “మీకు బాగా పరిచయమైనది ఏమిటి?” అనే ప్రశ్న తలెత్తుతుంది. మనం దేవుని భాషను, ఆయన మాట్లాడే తీరును, ఆయన స్వరాన్ని నేర్చుకుంటూ, దేవుని వాక్యంతో తగినంత సమయం గడపాలి. ప్రతిరోజూ మన దినచర్యలో కొంత సమయాన్ని దేవుని నిశ్శబ్ద ధ్యానానికి కేటాయించాలి. ఇలా చేస్తూ ఉంటే, ఆయన మాటలను వినే అలవాటును పెంపొందించుకుంటాము. ఆయన స్వరం మనకు సుపరిచితమై, ఆ స్వరంలో ఓదార్పు పొందుతాము.  

ఈ అలవాటు మనలో స్థిరపడిన తరువాత, మన తీరికలేని దినచర్యలోనూ దేవుడు మాట్లాడాలని ఎంచుకున్న ప్రతిసారీ ఆయన మాట వినడం ఎంతో సులభమవుతుంది. అది ఆయనేనని మనం వెంటనే గుర్తించి, ఆయనను అనుసరిస్తాము.

అన్నిటికన్నా బిగ్గరగా మిమ్మల్ని పిలుస్తున్నది ఏమిటో ఈ రోజు ధ్యానించండి. మన ప్రపంచంలోని ఎన్నో ఇతర స్వరాలు దేవుని స్వరాన్ని వినిపించకుండా చేయనివ్వకండి. బదులుగా, ఆయన మాట్లాడాలని ఎంచుకునే క్షణాల కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఆయన మాట్లాడినప్పుడు, మీరు ఆయనను అనుసరించగలిగేలా ఆ స్వరం మీ దృష్టిని ఆకర్షించనివ్వండి.

నాతో మాట్లాడే నా ప్రభువా, నా దైనందిన జీవితమంతటా నీ మృదువైన స్వరాన్ని గుర్తించి ప్రేమించడానికి నాకు సహాయం చేయి.  నా దృష్టిని ఆకర్షించడానికి పోటీపడే ఇతర స్వరాలన్నిటినీ నీ స్వరం అధిగమించుగాక.  ప్రియమైన ప్రభువా, నిన్నే నా ఏకైక కాపరిగా, మార్గదర్శిగా ఎంచుకుంటున్నాను.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

పాస్కా ప్రార్థనలు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన చూపిన విశేష చిత్రాలు: మంచి కాపరి ఈ చిత్రాన్ని వేసినవారిగా భావించబడుతున్నది జాన్ బాప్తిస్త్ దె షాంపెయిన్, వికీపీడియా ద్వారా