తెలుగు

పవిత్రాత్మా, రమ్ము!

మే 24, 2022
పాస్కా కాలపు ఆరవ వారంలోని మంగళవారం
నేటి పఠనాలు

వీడియో

“అయితే నేను మీతో నిజం చెబుతున్నాను, నేను వెళ్లిపోవడం మీకు మేలు. ఎందుకంటే నేను వెళ్లకపోతే ఆదరణకర్త మీ వద్దకు రారు. కానీ నేను వెళితే, ఆయనను మీ వద్దకు పంపుతాను.”  యోహాను 16:7

అపొస్తలుల హృదయాల్లో పరస్పర విరుద్ధమైన భావాలు తలెత్తాయి.  వారు దుఃఖంతో నిండిపోయారు, అయినా యేసు తమతో చెప్పిన మాటలపై నమ్మకం ఉంచడానికి కూడా ప్రయత్నిస్తున్నారు.  తాను తన తండ్రి వద్దకు ఆరోహణం చేస్తున్నాననీ, తాను వెళ్లిపోవడం వారికి మేలనీ యేసు వారితో చెప్పారు.  ఎందుకు?  ఎందుకంటే ఆయన వెళితే, పవిత్రాత్మను వారి వద్దకు పంపుతారు.  

మానవ దృష్టితో చూస్తే, యేసుతో ప్రతిరోజూ తమకు ఉన్న సాంగత్యాన్ని వదులుకోవడం అపొస్తలులకు ఎంతో కష్టంగా ఉండి ఉంటుంది.  ఆయనను తమ కళ్లతో చూడలేకపోవడం, ఆయనను తాకలేకపోవడం, ఆయన మాటలు వినలేకపోవడం వారికి తప్పకుండా వెలితిగా అనిపించి ఉంటుంది.  అయితే తాను వెళ్లిపోతున్నప్పటికీ ఎల్లప్పుడూ వారితోనే ఉంటానని యేసు స్పష్టం చేశారు.  వారిని నడిపించడానికి, వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి, సమస్త సత్యాన్ని వారికి బోధించడానికి ఆయన పవిత్రాత్మను కూడా వారిపైకి పంపుతారు.  ఇక పవిత్రాత్మ శక్తి ద్వారా వారు లోకంలో ఆయన సాన్నిధ్యంగా ఉంటారు.

అపొస్తలులు చూసినట్లుగా యేసును చూసే భాగ్యం మనకు ఎప్పుడూ కలగలేదు.  అయినా ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండే అదే భాగ్యం మనకూ ఉంది.  పవిత్రాత్మను పరిపూర్ణంగా స్వీకరించే అదే భాగ్యం కూడా మనకు ఉంది.  ఇది మేలైనది.  ఎంతో మేలైనది.  కానీ మనం తరచుగా కోల్పోయే మేలు ఇది.  మనం దృఢీకరణ సంస్కారాన్ని స్వీకరించి ఉండవచ్చు, అయినా పవిత్రాత్మ మనలోకి ప్రవేశించి మన జీవితాలను రూపాంతరం చెందించడానికి అనుమతించడంలో ఇప్పటికీ విఫలమవుతుండవచ్చు.  

రెండు వారాలు కూడా గడవకముందే మనం పెంతెకోస్తు మహోత్సవాన్ని జరుపుకుంటాం.  యేసు చేసిన ఈ వాగ్దానం నెరవేరినందుకు ఏటా జరుపుకునే ఉత్సవం ఇది.  ఆ రోజున పవిత్రాత్మ విచ్చేశారని, మనం ఇప్పుడు పవిత్రాత్మ కాలంలో ఉన్నామని స్మరించుకుంటాం.  

ఈ రోజు, అలాగే రాబోయే రెండు వారాలపాటు పవిత్రాత్మ గురించి ధ్యానించండి.  మీ జీవితంలో పవిత్రాత్మ మరింత సజీవంగా పనిచేయడానికి మీరు అవకాశం ఇవ్వాల్సి ఉంటే, ఆ అవసరాన్ని వినయంగా అంగీకరించండి.  మీరు పవిత్రాత్మను పరిపూర్ణంగా స్వీకరించాలని యేసు కోరుకుంటున్నారని నమ్మకం ఉంచండి.  ఈ ఐక్యం ఏర్పడటానికి అనుమతించేందుకు భయపడకండి.

పవిత్రాత్మా, దయచేసి నా వద్దకు రమ్ము.  నా జీవితంలో నీ సాన్నిధ్యాన్ని జ్వాలగా రగిలించడానికి నాకు సహాయం చేయుము.  యేసు వాగ్దానం చేసిన నిన్ను నీ పరిపూర్ణతలో నేను స్వీకరించెదను గాక.  పవిత్రాత్మా, దివ్య యేసూ, కరుణామయుడవైన తండ్రీ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

పాస్కా ప్రార్థనలు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ప్రదర్శించిన చిత్రాలు: క్రీస్తు మోక్షారోహణం — చిత్రకారుడు గెబ్‌హార్డ్ ఫూగెల్, వికీమీడియా కామన్స్ ద్వారా