తెలుగు

ఇతరుల దుర్బుద్ధిని ఎదుర్కోవడం

July 16, 2022
సామాన్య కాలంలో పదిహేనవ వారంలోని శనివారం
నేటి పఠనాలు

కార్మెల్ మాత—ఐచ్ఛిక స్మరణ

వీడియో

ఆంగ్లంలో వినండి

పరిసయ్యులు బయటకు వెళ్లి, యేసును చంపడానికి ఆయనకు వ్యతిరేకంగా సమాలోచన చేశారు.  మత్తయి 12:14

మీరు నిజంగా కాస్త ఆగి దీని గురించి ఆలోచిస్తే, ఇది దిగ్భ్రాంతిని, విచారాన్ని కలిగించడమే కాక, విశ్వాసానికి అభ్యంతరకరంగా కూడా అనిపిస్తుంది.  ఇక్కడ, ఆనాటి మతనాయకులు లోక రక్షకుణ్ణి చంపడానికి ఉద్దేశపూర్వకంగా, పకడ్బందీగా పన్నాగాలు పన్నుతూ, చురుకుగా వ్యవహరిస్తున్నారు.  ఎవరి రాకకోసం వారు సిద్ధపడుతూ, ఆశతో ఎదురుచూస్తూ ఉండవలసిందో, ఆయనపైనే వారు దుర్బుద్ధిని, ద్వేషాన్ని పెంచుకొని, చివరికి ఆయనను హింసించారు.

ఇది దిగ్భ్రాంతికరమైన విషయం. కాబట్టి వారి చర్యలను చూసి మనం లోతుగా దుఃఖించాలి. అయితే వారి చర్యల పట్ల దుఃఖించడం అంటే మనం విచక్షణలేని కోపంలోనో, నిరాశలోనో, ప్రతీకార భావంలోనో పడిపోవాలని కాదు. పరిసయ్యుల దురుద్దేశపూర్వక చర్యల పట్ల దుఃఖించడం నిజానికి వారిపట్ల ప్రేమకు ఒక రూపం. ఎందుకంటే వారి చర్యలను చూసి లోతుగా దుఃఖించడం, వారిని పశ్చాత్తాపానికి పిలిచే ఒక మార్గం.

నిజమే, ఇది ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది. ఇలా పథకం ప్రకారం దుర్బుద్ధితో ప్రవర్తించిన ఆ పరిసయ్యులు ఇప్పుడు మన మధ్య లేరు. అయినప్పటికీ, యేసు అనేక విధాలుగా ఇంకా హింసకు గురవుతూనే ఉన్నారు. కొన్నిసార్లు క్రైస్తవులమని చెప్పుకునేవారి మధ్య కూడా, మన కతోలిక సభలోనూ ప్రపంచంలోనూ నాయకత్వం వహించేవారి మధ్య కూడా ఈ హింస కనిపిస్తుంది.

ఆచరణాత్మకంగా చూస్తే, యేసును హింసించడానికి జరిగిన కుట్రలు, పన్నాగాలను మనమందరం ఏదో ఒక విధంగా మన అనుభవాలతో పోల్చుకోగలమేమో. యేసు ఎదుర్కొన్నంత స్థాయిలో ఈ దుర్బుద్ధిని మనం ఎదుర్కోవడం చాలా అరుదు. అయినా, మనమందరం ఏదో ఒక స్థాయిలో దానిని అనుభవించే ఉంటాం.

విచారకరంగా, మనల్ని మనం క్రీస్తుకూ ఆయన కార్యానికీ సంపూర్ణంగా అంకితం చేసుకున్నప్పుడు, మనం తరచూ దుష్టునికి లక్ష్యంగా మారుతాం. అంతేకాక, మనకు అత్యంత అండగా ఉండవలసిన వారి నుండే చాలా తరచుగా దుష్టుని బాణాలను ఎదుర్కొంటాం. కాబట్టి మీకు ఏదో ఒక విధంగా ఇలాంటి అనుభవం ఎదురైతే, విశ్వాసంలో తడబడకండి, అతిగా కలవరపడకండి. దానివల్ల విచారించడం సముచితమే. కానీ దాని కారణంగా విచక్షణ కోల్పోకండి. హింసను ఎదుర్కోవడం క్రీస్తును అనుసరించడంలో ఒక భాగం. యేసుకు అది ఎదురైంది. కాబట్టి మనకూ అది ఎదురవుతుందని ఆశించాలి.

ఇతరులు మిమ్మల్ని బాధపెట్టినప్పుడు, మీ పట్ల దుర్బుద్ధితో ప్రవర్తించినప్పుడు మీరు ఎలా స్పందిస్తారో ఈ రోజు ధ్యానించండి.  తీర్పు తీర్చడానికిగానీ, ఖండించడానికిగానీ మీకు అధికారం ఇవ్వబడలేదు.  అయితే, యేసు అనుభవించిన దుఃఖాన్నే అనుభవించడానికి మీరు పిలువబడ్డారు.  ఇది అష్టభాగ్యాలలో చెప్పబడిన పవిత్రమైన దుఃఖం.  మీకు ఎదురయ్యే తప్పులను తిరస్కరించి, సహనంలోనూ ఓర్పులోనూ ఎదగడానికి ఈ దుఃఖం మీకు తోడ్పడుతుంది.  

దుఃఖభరితుడవైన నా ప్రభువా, ఇతరులు నన్ను ఎగతాళి చేస్తున్నారని లేదా హింసిస్తున్నారని నాకు అనిపించినప్పుడు, నా విశ్వాసంలోనూ, ముఖ్యంగా నా ప్రేమలోనూ దృఢంగా నిలవడానికి నాకు సహాయం చేయుము.  పవిత్రమైన దుఃఖం నన్ను బలపరచి, నేను ఆశ కలిగి ఉండేలా, నీవు నాకు అప్పగించిన కార్యంలో ముందుకు సాగేలా దానికి నా హృదయంలో చోటివ్వడానికి నాకు సహాయం చేయుము.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

నేటి పునీతులు: కార్మెలు పర్వత మాత

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

ప్రత్యేక చిత్రం: జేమ్స్ టిస్సో, ప్రజా వినియోగానికి ఉచితం, వికీమీడియా కామన్స్ ద్వారా