తెలుగు

కరుణ

October 31, 2022
సామాన్య కాలం ముప్పై ఒకటవ వారంలోని సోమవారం
నేటి పఠనాలు

వీడియో

“…మీరు విందు చేసేటప్పుడు పేదలను, అవయవ వైకల్యం ఉన్నవారిని, కుంటివారిని, అంధులను ఆహ్వానించండి; వారు మీకు తిరిగి ప్రతిఫలం ఇవ్వలేరు కాబట్టి మీరు నిజంగా ధన్యులవుతారు.  ఎందుకంటే నీతిమంతుల పునరుత్థాన సమయంలో మీకు ప్రతిఫలం లభిస్తుంది.”  లూకా 14:13-14

జీవితంలో మనం చాలా తరచుగా తక్షణ ప్రతిఫలాల కోసం పనిచేసే ఉచ్చులో పడిపోతుంటాం.  మనం మంచి చేస్తే, దాన్ని ఇతరులు గుర్తించాలని, మనకు కృతజ్ఞతలు చెప్పాలని, ప్రతిఫలం ఇవ్వాలని కోరుకుంటాం.  కానీ యేసు ఇచ్చిన ఈ ప్రబోధం, ఇక్కడే ఇప్పుడే ఎలాంటి ప్రతిఫలాన్నీ ఆశించకుండా మనం సేవాజీవితాన్ని గడపాలని తెలియజేస్తుంది.  దానికి బదులుగా, పరలోకంలో మనకు లభించే ప్రతిఫలం కోసం ఎదురుచూడాలి.

మన ప్రభువు అప్పగించిన ఈ బాధ్యతను ఆచరణలో జీవించడం కష్టంగా ఉండవచ్చు.  దానికి గొప్ప నిస్వార్థత, తిరిగి ఏమీ ఆశించకుండా ఎదుటివారి పట్ల శ్రద్ధ అవసరం.  అయితే ఈ ఆధ్యాత్మిక సూత్రాన్ని అర్థం చేసుకున్నప్పుడు, “ప్రతిఫలం” పరలోకంలో మనకోసం ఎదురుచూస్తూ ఉండటమే కాక, ఇక్కడే ఇప్పుడే మన నిస్వార్థ కార్యం ద్వారా కూడా మనకు లభిస్తుందని గ్రహిస్తాం.

ఇతరులకు నిస్వార్థంగా సేవ చేయడం వల్ల మనం ఇక్కడే, ఇప్పుడే పొందే “ప్రతిఫలం” జీవన పవిత్రత.  ఇతరులపై కరుణ చూపడానికి ప్రయత్నించినప్పుడు మనం జీవన పవిత్రతను పొందుతాము.  ఎలాంటి స్వార్థ ఉద్దేశం లేకుండా అవసరంలో ఉన్నవారికి ప్రేమతో చేసే కార్యమే కరుణ.  ప్రతిగా ఏదైనా పొందాలనే షరతుతో చేసేది కాదది.  ఎదుటివారి మేలు కోసమే, వారిపట్ల ప్రేమతోనే కరుణ చూపుతాము; మరే ఇతర కారణంతోనూ కాదు.  అయితే శుభవార్త ఏమిటంటే, నిజమైన కరుణ దానిని చూపే వ్యక్తిపై గాఢమైన ప్రభావం చూపుతుంది.  ఇతరులపై నిస్వార్థమైన కరుణ చూపడం ద్వారా, మన కరుణామయుడైన దేవుణ్ణి అనుకరిస్తూ, మరింతగా ఆయనను పోలినవారమవుతాము.  ఇతరుల నుండి మనం ఎప్పుడైనా పొందగల ప్రతిఫలం కంటే ఇది ఎంతో గొప్పది.

అవసరంలో ఉన్న ఇతరులపై కరుణ చూపడానికి మీరు ఎంతగా సిద్ధంగా ఉన్నారో ఈ రోజు ధ్యానించండి.  వారి నుంచి తిరిగి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?  అలా అయితే, లోకంలో మీకు గుర్తింపు తెచ్చే మరే కార్యంలోనైనా పొందేదానికంటే ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని ఈ నిస్వార్థ కార్యంలో పొందుతారు.

అత్యంత కరుణామయుడవైన ప్రభువా, అవసరంలో ఉన్న వారందరిపట్ల కరుణతో, కనికరంతో నిండిన హృదయాన్ని నాకు దయచేయి.  ప్రతిఫలాన్ని ఏమాత్రం ఆశించకుండా ప్రతిరోజూ వారికి సేవ చేయడానికి నేను ప్రయత్నించేలా చేయి.  ఈ కరుణా కార్యాలే నాకు తగిన ప్రతిఫలమై, నా జీవన పవిత్రతకు మూలంగా, పునాదిగా నిలవుగాక.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ఆగమనకాలం, క్రిస్మస్ కోసం కొత్తగా!

ఆగమనకాలం మరియు క్రిస్మస్ ధ్యానాలు

పునీత మదర్ తెరేసాపై డాక్యుమెంటరీ చిత్రం—నవంబర్ 2&3!

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ప్రదర్శించిన చిత్రం: పరిసయ్యుడైన సీమోను వద్ద క్రీస్తు. చిత్రకారుడు: పీటర్ పాల్ రూబెన్స్, మూలం: వికీమీడియా కామన్స్