తెలుగు

ప్రియ శిష్యుడు

మంగళవారం, డిసెంబర్ 27, 2022
పునీత యోహాను అపొస్తలుడు, సువార్తికుడు—పండుగ
క్రిస్మస్ అష్టదినోత్సవంలో మూడవ రోజు
నేటి పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

వారంలో మొదటి రోజున, మరియ మగ్దలేన పరుగెత్తుకుంటూ సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరొక శిష్యుని వద్దకు వెళ్లి, “ప్రభువును సమాధి నుండి తీసుకుపోయారు; ఆయనను ఎక్కడ ఉంచారో మాకు తెలియదు” అని వారితో చెప్పింది. అప్పుడు పేతురు, ఆ మరొక శిష్యుడు బయలుదేరి సమాధి వద్దకు వచ్చారు. యోహాను 20:1–3

పునీత యోహాను తనను తాను “యేసు ప్రేమించిన” శిష్యునిగా పేర్కొనడం ఆసక్తికరం. నిశ్చయంగా, యేసు ప్రజలందరినీ ప్రేమించాడు. శిష్యులందరినీ ప్రేమించాడు. అయితే, యోహాను సువార్తలో ప్రియ శిష్యుడు అనే ఈ ప్రత్యేక బిరుదు యోహానుకు ఇవ్వబడింది.

అనేక కారణాల వల్ల పునీత యోహాను అపొస్తలుణ్ణి ఈ ప్రియ శిష్యునిగా అర్థం చేసుకోవచ్చు. మొదటగా, చివరి భోజన సమయంలో యోహాను యేసు పక్కన ఆనుకొని కూర్చున్నప్పుడు ఆయన పట్ల చూపిన ప్రత్యేక సాన్నిహిత్యాన్ని, ఆప్యాయతను గుర్తుచేసుకోండి. అలాగే, సిలువ చెంత యేసు తల్లితో పాటు నిలిచింది యోహాను ఒక్కడేనని, యేసు తన తల్లిని యోహానుకు, యోహానును తన తల్లికి అప్పగించాడని గుర్తుచేసుకోండి. మరియ మగ్దలేన తాను కనుగొన్న విషయాన్ని తెలియజేసిన వెంటనే ఖాళీ సమాధి వద్దకు ముందుగా పరుగెత్తింది యోహానే అని పై వచనభాగంలో గమనించండి. అంతేకాక, శిష్యులలో యోహాను వయస్సులో అందరికంటే చిన్నవాడని అనేకమంది పండితులు నమ్ముతారు. చిన్నవాడైన శిష్యుడిగా, ఆయన మన ప్రభువు నుండి తండ్రి వంటి ప్రత్యేక ఆదరణను పొంది ఉండవచ్చు.

అయితే, మరొక కారణం వల్ల కూడా యోహానును ప్రియ శిష్యునిగా అర్థం చేసుకోవచ్చు. సరళంగా చెప్పాలంటే, తన సువార్త వృత్తాంతాన్ని రాసేటప్పుడు యోహాను తనను తాను ఇలాగే చూసుకున్నాడు. యేసు జీవిత కథను చెప్పడం యోహానుకు ఎంతో లోతైన వ్యక్తిగత విషయం కావడం వల్ల ఆయన అలా చేసి ఉండవచ్చు. తన ప్రభువు పట్ల ఆయనకున్న ప్రేమ, ఆప్యాయత ఆయన ఆత్మకు కేంద్రంగా నిలిచి, దానిని పూర్తిగా ఆవరించిన అత్యంత గాఢమైన అనురాగం. యోహాను యేసును గురించి, యేసుతో తన సొంత అనుభవాలను గురించి చెప్పేటప్పుడు, తన పట్ల యేసుకున్న పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రేమను ప్రార్థనాపూర్వకంగా ధ్యానించకుండా ఉండలేకపోయినట్లు కనిపిస్తుంది. అందువల్ల, తమను ఏకం చేసిన దివ్యప్రేమను కూడా ప్రస్తావించకుండా యోహాను మన ప్రభువుతో తన అనుభవాలను చెప్పలేకపోయినట్లు కనిపిస్తుంది. తన సువార్త కథనంలో యేసుతో తనకు కలిగిన అనుభవాన్ని తెలిపిన ప్రతిసారీ, దేవుని కుమారుడు, మెస్సీయ అయిన యేసు తనను వ్యక్తిగతంగా ఎరిగి, ప్రేమించాడనే సరళమైన సత్యం యోహానును పరవశింపజేసినట్లుంది. అందుకే ఆయన ఆ సత్యాన్ని మళ్లీ మళ్లీ చెప్పకుండా ఉండలేకపోయాడు.

ఈ నేపథ్యంలో, యోహాను ఆత్మను గురించి ఆధ్యాత్మిక స్థాయిలో ధ్యానించడం ఎంతో సుందరమైన విషయం. యేసు వ్యక్తిత్వంలో దేవుని స్పర్శను లోతుగా అనుభవించిన వ్యక్తి ఆయన అని స్పష్టమవుతుంది. యేసు పరలోకానికి ఆరోహణమైన తరువాత, యేసు పట్ల యోహానుకున్న పవిత్ర ప్రేమ మరింతగా పెరిగినట్లు కనిపిస్తుంది. తన రక్షకుడు, ప్రియ మిత్రుడు అయిన యేసు ద్వారా లభించే రక్షణను గురించి బోధిస్తూ, అపొస్తలుడిగా ముందుకు సాగిన కొద్దీ, ఆయన రోజురోజుకూ మన ప్రభువుకు మరింత దగ్గరయ్యాడనేది స్పష్టం. తన జీవితాంతానికి సమీపంలో యోహాను తన సువార్తను రాసినప్పుడు, పరలోకంలో తన ప్రభువుతో సంపూర్ణంగా ఏకమయ్యేందుకు ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్న ఆయన హృదయం దివ్యప్రేమతో ప్రజ్వలిస్తోందనేది స్పష్టం.

ఈ విశిష్టమైన, పవిత్రమైన అపొస్తలుణ్ణి మనం గౌరవిస్తున్న ఈ రోజు, యేసు, పునీత యోహాను పంచుకున్న పవిత్రమైన సన్నిహిత ప్రేమలో పాలుపంచుకోవడానికి మీరు కూడా ఆహ్వానించబడ్డారనే సరళమైన సత్యాన్ని ధ్యానించండి. మన ప్రభువు మిమ్మల్ని కూడా పరిపూర్ణమైన ప్రేమతో, సాన్నిహిత్యంతో, సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడనే విషయాన్ని మననం చేసుకోండి. ఈ ప్రియ శిష్యుని హృదయంలోని ప్రేమను మీరు తిలకించగలిగితే, మీరు కూడా ఆ ప్రేమలో పాలుపంచుకొని, ప్రభువుకు ప్రియమైన శిష్యులలో ఒకరిగా మారగలరు.

నా ప్రియ ప్రభువా, యోహాను శిష్యునిపై నీవు కురిపించిన ప్రేమ అన్ని విధాలా పరిపూర్ణమైనది. నీ పరలోక ఆరోహణ తరువాత కూడా, అతనిని నీ దివ్యహృదయానికి మరింత దగ్గరగా ఆకర్షిస్తూ, అతనితో నీ అనుబంధాన్ని మరింత గాఢం చేస్తూనే ఉన్నావు. దయచేసి అదే ప్రేమను నాపై కుమ్మరించి, నన్ను నీ హృదయంలోనికి ఆకర్షించు. తద్వారా నేనూ నీకు ప్రియమైన శిష్యులలో ఒకరిగా మారుదును. పునీత యోహానూ, మా కొరకు ప్రార్థించు.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

సంవత్సరాంత విరాళం ఇవ్వడం గురించి మీరు ఆలోచిస్తారా?

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు


మరిన్ని క్రిస్మస్ ధ్యానాలు:

సంపూర్ణ సమర్పణ

ఆనందంతో గంతులేసిన క్షణాన్ని స్మరించుకోవడం

ప్రభువుకు వినమ్రంగా సేవచేసే వ్యక్తి

అన్ని విషయాలలో విశ్వసనీయత

లోకం స్వాగతించలేదు

దుఃఖమనే ఖడ్గం

ప్రవాసంలో జీవించడం

పంచుకున్న బాధ

ఒక తల్లి హృదయాలోచనలు

ప్రత్యేక చిత్రం: పునీత యోహాను సువార్తికుడు చిత్రకారుడు: డొమెనికీనో, వికీమీడియా కామన్స్ ద్వారా