తెలుగు

దేవదూతల పరిచర్య

ఫిబ్రవరి 18, 2024
తపస్సుకాలపు మొదటి ఆదివారం (బి సంవత్సరం)
నేటి పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

పవిత్రాత్మ యేసును ఎడారిలోకి నడిపించాడు. ఆయన నలభై రోజులు ఎడారిలో ఉండి, సాతానుచే శోధింపబడ్డాడు. ఆయన అడవి మృగాల మధ్య ఉన్నాడు; దేవదూతలు ఆయనకు సేవలు చేశారు.  మార్కు 1:12–13

ఈ రోజు మనం ఎంత అద్భుతమైన సంఘటనను ధ్యానిస్తున్నాం! పైన ఉటంకించిన వాక్యభాగంలో, దేవుని కుమారుడు, అతి పరిశుద్ధ త్రిత్వంలో రెండవ వ్యక్తి అయిన యేసు రెండు విధాలుగా తనను తాను తగ్గించుకున్నారు. మొదటిగా, సాతాను శోధనలను ఎదుర్కొనడానికి ఆయన అంగీకరించారు. రెండవదిగా, తాను సృష్టించిన మంచి దేవదూతలే మానవరూపంలో ఉన్న తనకు పరిచర్య చేయడానికి ఆయన అనుమతించారు.

మొదటిగా, సాతాను ఒక పతిత దేవదూత అని గుర్తుచేసుకోండి. దేవుడు అతనిని సృష్టించారు; మంచివానిగానే సృష్టించారు. అయితే సృష్టించబడిన దేవదూతలలో మూడవ వంతు మంది పరలోకం నుండి వెళ్లగొట్టబడి భూమిపై సంచరించడానికి విడువబడ్డారని ప్రకటన గ్రంథం (12:4) సూచిస్తుంది. ఈ దయ్యాలు పతిత దేవదూతలలో అత్యున్నతుడైన సాతాను ఆదేశాల ప్రకారం పనిచేస్తాయి. అందువల్ల, పైన పేర్కొన్న వాక్యభాగం ప్రకారం, ఎడారిలో యేసును శోధించింది సాతానే. అంతేకాక, తన మానవ స్వభావంలో తనకు పరిచర్య చేయడానికి యేసు మంచి దేవదూతలను అనుమతించారు. ఈ చర్యలు మన ప్రభువు మానవత్వంలో వినయమనే సద్గుణం ఎంత పరిపూర్ణంగా ఉందో వెల్లడిస్తున్నాయి.

విశుద్ధ తోమాస్ అక్వినాస్ ప్రకారం, దేవదూతలు మూడు ప్రధాన కారణాల కోసం సృష్టించబడ్డారు. మొదటిది ఆరాధన కోసం. దేవుని ఆరాధించడం దేవునితో ఐక్యతను కలిగిస్తుంది; దేవుని నుండి ప్రతి దేవదూతకు, ప్రతి దేవదూత నుండి దేవునికి పరిపూర్ణ ప్రేమ ప్రవహించేలా చేస్తుంది. రెండవదిగా, దేవదూతలు అన్ని విషయాలలో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. ప్రకృతి నియమాలను అమలుపరచడం, క్రీస్తు సిలువపై సంపాదించిన కృపను అందించడం ఇందులో భాగమే. మూడవదిగా, దేవుడు దేవదూతలను సందేశవాహకులుగా ఉపయోగిస్తారు. దేవదూతలు ప్రవక్తలతో, మన పునీత మాతతో, విశుద్ధ యోసేపుతో, ఇతరులతో మాట్లాడిన వివిధ విధానాలను పవిత్ర గ్రంథం నమోదు చేసింది. మనలో ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేక సంరక్షక దేవదూత ఇవ్వబడ్డారని కూడా విశుద్ధ తోమాస్ అక్వినాస్ విశ్వసించారు. ఆ దేవదూత పాత్ర మనలను రక్షించడం మాత్రమే కాకుండా దేవుని చిత్తాన్ని మనకు తెలియజేయడం కూడా.

దేవునిగా, యేసు తండ్రితోను పవిత్రాత్మతోను కలిసి దేవదూతలందరినీ సృష్టించారు. మానవునిగా, యేసు మంచి దేవదూతల పరిచర్యను స్వీకరించారు; పతిత దేవదూతల దాడులను కూడా ఎదుర్కొన్నారు. సృష్టించబడిన ఈ దేవదూతల సహజ శక్తులకు వినయంతో తనను తాను లోబరచుకోవడం ద్వారా, మనం కూడా అలాగే చేయాలని యేసు మనకు బోధించారు.

మంచి దేవదూతలకూ చెడు దేవదూతలకూ ఉన్న ప్రధాన సహజ శక్తులలో ఒకటి ప్రభావితం చేసే శక్తి, ఆలోచనలను సూచించే శక్తి. మిమ్మల్ని మంచి వైపు ప్రభావితం చేయడానికి (మంచి దేవదూతలు) లేదా మిమ్మల్ని మోసగించి పాపంలోకి నడిపించడానికి (చెడు దేవదూతలు) ఉద్దేశించిన భావనలను మీ ఊహలో ఉంచే సామర్థ్యం దేవదూతలకు ఉంది. ఈ సందేశాలు వాస్తవమైనవి; వాటి గురించి మనకు అవగాహన ఉండాలి. లోయోలాకు చెందిన విశుద్ధ ఇగ్నేషియస్ తన ఆధ్యాత్మిక సాధనలు అనే గ్రంథంలో దేవదూతల పరిచర్యకు ఎంతో సమయాన్ని, శ్రమను అంకితం చేశారు. పతిత దేవదూతల అబద్ధాలను, మోసాలను, మంచి దేవదూతలు అందించే ఓదార్పుతో కూడిన మార్గదర్శకత్వం నుండి ఎలా వేరు చేసి గుర్తించాలో ఆయన బోధిస్తారు. యేసు తనను తాను దేవదూతల శోధనలకూ పరిచర్యకూ లోబరచుకున్నారని తెలిపే నేటి సువార్త వాక్యభాగం, సృష్టించబడిన ఈ దేవదూతలు మనలను ఎలా ప్రభావితం చేస్తారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఎంత ముఖ్యమో అనేక విధాలుగా బలపరుస్తుంది. దీని గురించి మరింత తెలుసుకోవడానికి లోతులను అన్వేషించడం: ప్రార్థనా సంవత్సర క్రమంలో అమర్చిన ఇగ్నేషియన్ పాఠాలు మరియు ధ్యానాలు అనే గ్రంథాన్ని చూడండి.

దేవదూతలూ దయ్యాలూ మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తూ మీ జీవితంలో నిరంతరం క్రియాశీలంగా ఉంటారనే ఆశ్చర్యకరమైన సత్యాన్ని ఈ రోజు ధ్యానించండి. మీ జీవితంలో వారి ఆధ్యాత్మిక పాత్రను గురించి ఆలోచించేటప్పుడు, వారి గురించి మరింత తెలుసుకోగల వివిధ మార్గాలను పరిశీలించండి. మీ సంరక్షక దేవదూతతో మాట్లాడండి. దేవదూతలలో అత్యున్నతుల మధ్యస్థ ప్రార్థనను కోరండి. వారు చేసే దైవారాధనలో వారితో కలిసి పాల్గొనడానికి ప్రయత్నించండి. వారి రక్షణ కోసం ప్రార్థించండి. దేవుని నుండి వచ్చే అత్యున్నత సత్యాలను మీకు తెలియజేయమని వారిని అడగండి. ఈ పవిత్ర దేవదూతల పట్ల శ్రద్ధగా ఉండడానికి ప్రయత్నించండి. అప్పుడు, వారి స్వరాలను వివేచించడం నేర్చుకుంటూ, దేవుని నుండి వారు మీకు అందించే మార్గదర్శకత్వాన్ని అనుసరించడానికి మీరు సిద్ధంగా ఉంటారు.

నా ప్రభువా, సమస్తానికీ సృష్టికర్తా, ప్రేమించడం, ఆరాధించడం అనే మహిమాన్వితమైన ఉద్దేశంతో నీవు దేవదూతల గణాన్ని సృష్టించావు. నీ పరిశుద్ధ చిత్తాన్ని నెరవేర్చే కార్యాన్ని, భూమిపై ఉన్న మాకు నీ సందేశాలను తెలియజేసే కార్యాన్ని కూడా వారికి అప్పగించావు. పతిత దేవదూతల మోసాలనూ, మంచి దేవదూతల మార్గదర్శకత్వాన్నీ మరింత స్పష్టంగా గుర్తించడానికి దయచేసి నాకు సహాయం చేయి. దేవుని దూతలారా, నా కోసం ప్రార్థించండి, నన్ను రక్షించండి, దేవుని పరిపూర్ణ చిత్తంలోకి నన్ను నడిపించండి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

తపస్సుకాలపు మొదటి ఆదివారం కోసం ధ్యానం:
ఎడారిలో 40 రోజులు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

తపస్సుకాలం కోసం వనరులు

తపస్సు కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ప్రదర్శించిన చిత్రం: క్రీస్తు శోధన, వికీమీడియా కామన్స్ ద్వారా