ఏప్రిల్ 14, 2024
పాస్కా కాలపు మూడవ ఆదివారం (సంవత్సరం బి)
నేటి పఠనాలు

ఆంగ్లంలో వినండి
“మీరెందుకు కలవరపడుతున్నారు? మీ హృదయాల్లో ప్రశ్నలు ఎందుకు తలెత్తుతున్నాయి? నా చేతులను, నా పాదాలను చూడండి; నేనే స్వయంగా వచ్చాను. నన్ను తాకి చూడండి. నాకు ఉన్నట్లు మీరు చూస్తున్న మాంసం, ఎముకలు భూతానికి ఉండవు.” లూకా 24:38–39
యేసు మీకు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో ఊహించండి. ఆయన తన చేతుల్లోని, పాదాల్లోని గాయాలను మీకు చూపించి, మీరు నమ్మేలా తనను తాకమని ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? మీరు నమ్ముతారా? బహుశా కొంతవరకైనా నమ్ముతారు. ఆ శిష్యుల విషయంలో జరిగినట్లే, అది మీ జీవితాన్ని మార్చగల అనుభవానికి ఆరంభం అవుతుంది. మన ప్రభువు శిష్యులకు ప్రత్యక్షం కావడం వల్ల, అయోమయంతో, సందేహాలతో ఉన్న వారు ఆనందంతో, ఉత్సాహంతో నిండినవారిగా మారారు. చివరికి వారు యేసు మరణ పునరుత్థానాలకు సాక్షులుగా, ధైర్యంతో ఆయన గురించి బోధించడానికి బయలుదేరారు. తమ మాటలు వినే వారందరూ యేసును తమ రక్షకునిగా స్వీకరించి ఆయన వైపు తిరగాలన్నదే వారి ఆకాంక్ష.
నేటి దివ్యబలిపూజలోని మొదటి పఠనంలో, పునీత పేతురు సరిగ్గా ఇదే చేసినట్లు వ్రాయబడి ఉంది. దేవాలయ ద్వారం వద్ద కుంటితనం ఉన్న ఒక వ్యక్తిని స్వస్థపరచిన తరువాత, ఆశ్చర్యంతో ప్రజలు గుమిగూడారు. పేతురు వారికి యేసు గురించి బోధించారు. ఆయన తన ప్రసంగాన్ని ఈ మాటలతో ముగించారు: “తన క్రీస్తు బాధలు అనుభవించాలని ప్రవక్తలందరి నోటి ద్వారా ముందుగా తెలియజేసిన దానిని దేవుడు ఈ విధంగా నెరవేర్చాడు. కాబట్టి మీ పాపాలు తుడిచివేయబడేలా పశ్చాత్తాపపడి, మనసు మార్చుకోండి.”
మన ప్రభువు శిష్యులకు అప్పగించిన అదే దౌత్యం నేడు మనకూ అప్పగించబడింది. వారు బోధించిన అదే ఉత్సాహంతో, ధైర్యంతో, దృఢనిశ్చయంతో మనమూ బోధించాలి. ముందుగా, పాపం మీద, మరణం మీద యేసు సాధించిన విజయం గురించి వారికున్నంత నిశ్చయత మనకూ ఉండాలి. మనం సమస్త పాపాలను విడిచిపెట్టి, జీవిత పరిపూర్ణత క్రీస్తు యేసులో మాత్రమే లభిస్తుందని విశ్వసించాలి. ఆ తరువాత, మన సంపూర్ణ అస్తిత్వంతో ఈ విశ్వాసాన్ని ప్రకటించడానికి మనల్ని మనం అంకితం చేసుకోవాలి.
లోక రక్షకునిగా యేసును మీరు ఎంత గాఢంగా విశ్వసిస్తున్నారో పరిశీలించడంతో ప్రారంభించండి. యేసు స్వయంగా మీకు ప్రత్యక్షమైతే ఆయనపై మీ విశ్వాసం మరింత బలపడుతుందని అనిపించవచ్చు. కానీ వాస్తవానికి, తొలి శిష్యులకు దృఢనమ్మకం కలగడానికి ప్రధాన కారణం యేసు శరీరంతో ప్రత్యక్షం కావడం కాదు. బదులుగా, వారి మనసులను ఆధ్యాత్మికంగా స్పృశించడం ద్వారానే ప్రధానంగా ఈ వరం వారికి లభించింది. శిష్యులకు శరీరంతో ప్రత్యక్షమైన తరువాత, యేసు “లేఖనాలను అర్థం చేసుకునేలా వారి మనసులను తెరిచాడు” అని మనం చదువుతాం. అన్నిటికంటే ఎక్కువగా వారికి దృఢనమ్మకం కలిగించింది ఇదే—అవగాహన అనే ఆధ్యాత్మిక వరం. యేసు తొలి అనుచరులకు అందించినట్లే, నేడు ఆ వరం మీకూ అందించబడుతోంది.
అవగాహన అనే ఆధ్యాత్మిక వరం దేవుని సారస్వరూపాన్నే మనకు వెల్లడించే వరమని పునీత తోమా అక్వినాస్ వివరిస్తారు. మన పంచేంద్రియాల ద్వారా పొందే జ్ఞానం కంటే ఇది ఎంతో లోతైన జ్ఞానరూపమని ఆయన వివరిస్తారు. అందువల్ల, కేవలం కళ్లతో ఏదైనా చూడటం, దాన్ని తాకడం లేదా వినడం అనేవి, అవగాహన అనే ఆధ్యాత్మిక వరం ద్వారా పొందే జ్ఞానం కలిగించే దృఢనమ్మకానికి ఏమాత్రం సాటిరావు. అవగాహన వరం మనం “అంతరంగంలో చదవడానికి,” ఒక విషయపు సారస్వరూపాన్నే లోతుగా గ్రహించడానికి తోడ్పడుతుంది. అందుచేత, యేసు శరీరంతో ప్రత్యక్షం కావడం విశ్వసించడం వైపు తొలి అడుగు అయి ఉండవచ్చు. అయితే ఇదే శిష్యులు తమ ఆత్మల్లో మన ప్రభువును కలుసుకుని, ఆయన పునరుత్థానపు సారస్వరూపాన్ని అంతరంగంలో గ్రహించినప్పుడే వారు శాశ్వతంగా మారిపోయారు. ఈ విధమైన జ్ఞానం మాత్రమే, వారు బయలుదేరి రక్షణ సందేశాన్ని ప్రకటించేంత దృఢనమ్మకాన్ని వారికి కలిగించగలిగింది.
యేసు గురించి మీకున్న జ్ఞానాన్ని, మీ జీవితాన్ని మార్చే ఆయన పునరుత్థాన శక్తిని గురించి నేడు ధ్యానించండి. మీ ఆత్మ లోతుల్లో దేవుడు మీతో మాట్లాడారా? ఈ అంతరంగ జ్ఞానాన్ని మీరు గ్రహించారా? మీ మనసు తెరువబడిందా? మన ప్రభువు మాటలను శ్రద్ధగా వినండి—మీ చెవులతో మాత్రమే కాకుండా, ప్రధానంగా మీ ఆత్మతో వినండి. తొలి శిష్యులవలె మీరూ క్రీస్తు జీవితాన్ని, మరణాన్ని, పునరుత్థానాన్ని తెలుసుకుని విశ్వసించేది అక్కడే, మీ అంతరంగంలోనే. తద్వారా ఈ సత్యాలను ఇతరులకు ప్రకటించడానికి శక్తిని పొంది మీరు బయలుదేరగలుగుతారు.
నిన్ను నీవు వెల్లడించుకునే నా ప్రభువా, నీవు నీ శిష్యులకు శారీరకంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా నిన్ను నీవు చూపించుకొని, వారి అంతరంగంలో నీ సారస్వరూపాన్నే వెల్లడించావు. ప్రియ ప్రభువా, దయచేసి ఈ వరాన్ని నాకూ ప్రసాదించు. నిన్ను తెలుసుకొని, పూర్ణహృదయంతో నీలో విశ్వాసం ఉంచేలా నన్ను దీవించు. నేను అలా జీవిస్తుండగా, ఇతరులకు నీ కారుణ్యాన్ని అందించే సాధనంగా దయచేసి నన్ను ఉపయోగించుకో. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
పాస్కా కాలం కొరకు పవిత్ర గ్రంథ ధ్యానాలు




