తెలుగు

పవిత్ర త్రిత్వాన్ని ప్రేమించడం

మే 25, 2025
పాస్కా ఆరవ ఆదివారం (సంవత్సరం C)
నేటి పఠనాలు

చిత్రం అడోబీ స్టాక్ ద్వారా

వీడియో

ఆంగ్లంలో వినండి

యేసు తన శిష్యులతో ఇలా అన్నారు: “నన్ను ప్రేమించేవారు నా మాటను పాటిస్తారు. నా తండ్రి వారిని ప్రేమిస్తారు. మేము వారివద్దకు వచ్చి వారితో నివాసం ఏర్పరచుకుంటాము. నన్ను ప్రేమించనివారు నా మాటలను పాటించరు. అయితే మీరు వింటున్న మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిది.” యోహాను 14:23–24

పిత, పుత్రుడు ఒక్కటే. వారి ఐక్యత అన్ని విధాలా పరిపూర్ణమైనది. వారిది ఒకే దైవ స్వభావం. అయినప్పటికీ వారు వేర్వేరు దైవవ్యక్తులు. వారు ఒకే దేవునిగా పరిపూర్ణంగా ఐక్యమై ఉండటమే కాదు, ఒకరితో ఒకరు ప్రేమపూర్వక ఐక్య సహవాసంలో కూడా ఉండగలరు. పిత, పుత్ర, పవిత్రాత్మల త్రిత్వ రహస్యం ఎంత గంభీరమైనదంటే, మనం వారిని ఎన్నటికీ పూర్తిగా అర్థం చేసుకోలేము. మనం తెలుసుకోవాలని వెదికే “పూర్తిగా తెలుసుకోలేని దేవుడు” వారే. కాబట్టి, దేవునితో మన సంబంధం నిరంతర ప్రయాణం. ఈ ప్రయాణంలో ప్రతిరోజూ, నిత్యత్వమంతటా ఈ రహస్యంలో మనం మరింత లోతుగా మునిగిపోతాము.

నేటి సువార్త దేవుని మహిమగల ఐక్యతను మనకు కొంతవరకు చూపిస్తుంది. అయితే అది అంతటితో ఆగదు. మనలోకి వచ్చి నివసించాలనే దేవుని హృదయ వాంఛను కూడా వెల్లడిస్తుంది. మనం దేవుణ్ణి ప్రేమించి, ఆయన వాక్యాన్ని పాటిస్తే, పవిత్ర త్రిత్వం మనవద్దకు వచ్చి మనలో నివసిస్తుంది. “నన్ను ప్రేమించేవారు నా మాటను పాటిస్తారు. నా తండ్రి వారిని ప్రేమిస్తారు. మేము వారివద్దకు వచ్చి వారితో నివాసం ఏర్పరచుకుంటాము.” దేవుని ఐక్యతలో పాలుపంచుకోవడానికి మనకు ఇచ్చిన ఈ ఆహ్వానం కూడా మాటలకు అందనంత గంభీరమైన రహస్యం.

మీ చిన్నతనంలో, మూడు ఆకుల క్లోవర్‌ను చూపించి పవిత్ర త్రిత్వ రహస్యం గురించి మీకు బోధించి ఉండవచ్చు. ప్రతి రేకు ఒక దైవవ్యక్తిని సూచిస్తుంది; ఆకు మొత్తమేమో వారి ఐక్యతను సూచిస్తుంది. దేవుడు ఎవరో అర్థం చేసుకోవడం ప్రారంభించడానికి ఈ సరళమైన పోలిక మనకు ఉపయోగపడుతుంది. కానీ వాస్తవానికి, దేవుడు తనను తాను మనకు పూర్తిగా వెల్లడించుకోవడానికి తోడ్పడేది ఒక్కటే ఉంది. అదేమిటి? యేసు చెప్పింది సరిగ్గా అదే: దేవుని వాక్యానికి ప్రేమపూర్వక విధేయత.

దేవుని వాక్యానికి విధేయత చూపడమే మనం దేవునికి అర్పించగల ప్రేమకు అత్యుత్తమ వ్యక్తీకరణ. ఎందుకంటే దేవుని వాక్యం పరిపూర్ణ సత్యం. మనం ఈ సత్యాన్ని అర్థం చేసుకొని, దాని ప్రకారం జీవించినప్పుడు, అదే ప్రేమ అవుతుంది. అంతేకాక, ఇటువంటి ప్రేమపూర్వక విధేయత ఊహకు అందని ఫలితాన్ని ఇస్తుంది. దాని ఫలితంగా పరమ పవిత్ర త్రిత్వం మన ఆత్మలలో నివసిస్తుంది: “…మేము వారివద్దకు వచ్చి వారితో నివాసం ఏర్పరచుకుంటాము.”

ఈ మాటలు అస్పష్టంగా, నిగూఢంగా ఉన్నప్పటికీ, పరమ పవిత్ర త్రిత్వం ఒక వ్యక్తిలో నివసించడానికి వచ్చినప్పుడు, ఆ అస్పష్టత తొలగిపోవడం మొదలవుతుంది; ఆ రహస్యం తెలియరావడం ప్రారంభమవుతుంది. కాబట్టి, పరమ పవిత్ర త్రిత్వ జీవనానికి సంబంధించిన ఈ అగమ్యమైన రహస్యాన్ని కనుగొనడం ప్రారంభించడానికి ఏకైక మార్గం, పవిత్ర త్రిత్వం మీలో నివసించడానికి అనుమతించడమే. అలా నివసించమని దేవుణ్ణి ఆహ్వానించడానికి ఏకైక మార్గం ఆయనను ప్రేమించడమే. ఆయనను ప్రేమించడానికి ఏకైక మార్గం దేవుని వాక్యానికి విధేయత చూపడమే. యేసే దేవుని వాక్యం. ముఖ్యంగా పవిత్ర గ్రంథాన్ని చదవడం ద్వారా, అది ప్రకటించే సందేశం ప్రకారం జీవించడం ద్వారా మనం ఆయనను దేవుని వాక్యంగా తెలుసుకుంటాము. 

మీకు ఇవ్వబడిన అత్యంత ప్రధానమైన పిలుపును గురించి నేడు ధ్యానించండి. దేవునికి నివాసస్థలంగా మారడమే ఆ కర్తవ్యం. ఆయన వాక్యానికి విధేయత ద్వారా వ్యక్తమయ్యే మీ దైవప్రేమతో మాత్రమే అది నెరవేరుతుంది. విధేయతను గురించి లోతుగా ఆలోచించండి. దేవుని ప్రేమపూర్వక ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపుతామని ఆయనతో చెప్పండి. మీ చేతలను పరిశీలించండి; మన ప్రభువు ఆజ్ఞాపించిన వాటన్నిటికీ విధేయత చూపడంలో మీరు ఏయే విధాలుగా విఫలమవుతున్నారో ఆలోచించండి. ఎక్కడైనా దారి తప్పినట్లు మీకు కనిపిస్తే, దానిని సరిచేసుకోవడం మరింత గాఢమైన ప్రేమకు మాత్రమే కాకుండా, మీ అంతరంగంలో తనను మీతో ఐక్యం చేసుకోవాలని కోరుకునే త్రిత్వైక దేవునితో మరింత సంపూర్ణ ఐక్యతకు కూడా మార్గమని తెలుసుకోండి.

పిత, పుత్ర, పవిత్రాత్మల ఐక్యమైన పరమ పవిత్ర త్రిత్వమా, నాలోకి వచ్చి నివసించు. నీ పవిత్ర వాక్యం ద్వారా వెల్లడయ్యే నీ ప్రతి ఆజ్ఞకు నా విధేయత ద్వారా వ్యక్తమయ్యేలా, నిన్ను ప్రేమించే వరం కోసం ప్రార్థిస్తున్నాను. విధేయత చూపడంలో నేను ఏయే విధాలుగా ఆలస్యం చేస్తున్నానో మరింత పూర్తిగా గ్రహించేలా చేయి. తద్వారా నా ప్రవర్తనను మార్చుకొని, నీకు నా అంతరంగాన్ని మరింత పూర్తిగా తెరవగలను. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

పాస్కా ప్రార్థనలు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

నేటి పునీతులు – ఈ సంవత్సరం ఆదివారం నాడు వస్తున్నందున ఆరాధనాక్రమంలో స్మరణదినంగా జరుపుకోరు

పూజనీయ పునీత బీడ్, యాజకులు మరియు సభాపండితులు

పునీత గ్రెగొరీ VII, పాపుగారు, సన్యాసులు

పునీత మరియ మగ్దలేన దె పాజ్జి, కన్య

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు