తెలుగు

సిమెయోను ప్రవచనం

శనివారం, డిసెంబర్ 29, 2018

క్రిస్మస్ అష్టదినోత్సవంలో ఐదవ రోజు

నేటి పఠనాలు

పునీత తోమస్ బెకెట్, పీఠాధిపతి మరియు వేదసాక్షి – ఐచ్ఛిక స్మరణ

ఆంగ్లంలో వినండి

“ప్రభువా, ఇప్పుడు నీ సేవలో ఉన్న నన్ను శాంతితో వెళ్లనిమ్ము; నీ వాక్కు నెరవేరింది: సమస్త ప్రజల సమక్షంలో నీవు సిద్ధపరచిన రక్షణను నా కన్నులారా చూశాను. అది అన్యజనులకు నిన్ను వెల్లడించే వెలుగు, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమ.”  లూకా 2:29-32

క్రిస్మస్ అష్టదినోత్సవంలోని ఈ ఐదవ రోజున, ప్రవక్త సిమెయోను సాక్ష్యాన్ని మనకు అందిస్తున్నారు. లోక రక్షకుణ్ణి తన కళ్లారా చూస్తారని ఈ పవిత్రునికి దేవుడు వ్యక్తిగత ప్రత్యక్షీకరణ ద్వారా వాగ్దానం చేశారు. జీవితమంతా ఆయన ఈ క్షణం కోసం ఎదురుచూసి ఉంటారు. దానికోసం తపించి, ఆశతో నిరీక్షించి ఉంటారు. చివరికి ఒక రోజు ఆ క్షణం రానే వచ్చింది. ఆ రోజు కూడా సిమెయోను నిద్రలేచి, మిగతా రోజుల్లాగే తన రోజువారీ పనులు చేసుకుంటూ ఉండి ఉంటారు. అయితే, మరియమ్మ, యోసేపు తమకు అప్పుడే జన్మించిన శిశువును దేవాలయంలోకి తీసుకువచ్చిన క్షణంలో, ఈ శిశువే వాగ్దానం చేయబడిన రక్షకుడని సిమెయోను తన హృదయంలో గ్రహించారు.

ఆయన మాటలు శక్తిమంతమైనవి. ఆయన ఇలా అంటారు: “ప్రభూ, ఇప్పుడు నీ సేవకుణ్ణి శాంతితో వెళ్లనివ్వవచ్చు…ఎందుకంటే నీవు సిద్ధపరచిన రక్షణను నా కన్నులు చూశాయి…” మరో మాటలో చెప్పాలంటే, తన జీవితం ఇప్పుడు పరిపూర్ణమైందని సిమెయోను గ్రహించారు. క్రీస్తును నిజంగా చూసే భాగ్యం ఇప్పుడు లభించింది కాబట్టి ఆయన మరణించడానికి సిద్ధంగా ఉన్నారు. యేసును తన చేతుల్లో ఎత్తుకొని, ఈ క్షణాన్ని బట్టి తండ్రికి మహిమ చెల్లించారు.

పవిత్రుడైన సిమెయోను నుండి నేర్చుకోవడానికి మనం కృషి చేయాలి. నిజమే, మనం దాదాపు 2,000 సంవత్సరాల క్రితం దేవాలయంలో ఉన్న ప్రవక్తలం కాదు. అయినప్పటికీ, ప్రతిరోజూ ఎన్నో విధాలుగా క్రీస్తును చూసే భాగ్యం మనకు ఉంది. సిమెయోను ఎత్తుకున్న శిశువు నిజంగా దేవుడే. అయితే ఆయన ఒక చిన్న శిశువు మానవ శరీరపు ముసుగులో ఉన్న దేవుడు. అయినప్పటికీ, సిమెయోను ఆయన నిజంగా ఎవరో గుర్తించి ఆనందించారు.

మన చుట్టూ ఉన్న రక్షకుని సాన్నిధ్యాన్ని గుర్తించడానికి మనం కృషి చేయాలి, సిమెయోను పొందిన ఆనందంతో సంతోషించాలి.  దేవునికి అర్పించుకున్న ప్రతి హృదయంలోనూ, కతోలిక సభలోని ప్రతి దివ్యసంస్కారంలోనూ, పవిత్ర గ్రంథాన్ని చదివే ప్రతిసారీ క్రీస్తు సన్నిహితంగా ఉంటారు; ముఖ్యంగా మన హృదయాలలో ఆయన మనకు సన్నిహితంగా ఉంటారు.  బాల క్రీస్తు సాన్నిధ్యాన్ని మనం కనుగొనే దేవాలయంగా మన హృదయాలు ఉండాలి. ఆయన మనకు ఎంత దగ్గరగా ఉన్నారో తలచుకొని సంతోషిస్తూ, ఆయనను మన జీవితాలలోకి స్వీకరించాలి. 

ఈ రోజు, సిమెయోను ఆ శిశువును తన చేతుల్లోకి తీసుకొని, ఆ పసిబిడ్డ మాంసాస్థుల ముసుగులో రక్షకుణ్ణి దర్శిస్తున్న దృశ్యాన్ని ధ్యానించండి. సిమెయోను చేసినట్లే మీరు కూడా క్రీస్తును వెదకండి; ఆయన మీకు ఎన్నో విధాలుగా సన్నిహితంగా ఉన్న తీరును మననం చేయండి. ఆయన సమీపంలోనే ఉన్నారని, మీ జీవితాన్ని తన శాంతితో నింపాలని కోరుకుంటున్నారని తెలుసుకోండి.

ప్రభువా, సిమెయోను ప్రవక్త ఇచ్చిన గొప్ప సాక్ష్యానికి నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  చిన్న శిశువుగా నిన్ను చూడటానికి సిమెయోనుకు అనుగ్రహించి, ఆయనపట్ల నీవు చూపిన విశ్వసనీయతకు కృతజ్ఞతలు.  నేను ఎల్లప్పుడూ ఆయన గొప్ప విశ్వాసాన్ని అనుసరిస్తూ, నా జీవితమంతా నిన్ను వెదుకుతూ ఉండేలా దయచేయుము. నా హృదయం నీ సాన్నిధ్యంలో ఆనందించేలా, నీవు మరుగైన రీతులలో నా వద్దకు వస్తావని ఎదురుచూస్తూ ఉండేలా అనుగ్రహించుము.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

ఇది కూడా చూడండి: దుఃఖ ఖడ్గం

క్రీస్తు, నిరీక్షణ దీపం

క్రిస్మస్ ప్రార్థన