ఆదివారం, ఆగస్టు 11, 2019
సామాన్య కాలపు పంతొమ్మిదవ ఆదివారం, సి సంవత్సరము

ఆంగ్లంలో వినండి
యేసు తన శిష్యులతో ఇలా అన్నారు: “చిన్న మందా, ఇక భయపడకండి. ఎందుకంటే మీకు రాజ్యాన్ని ఇవ్వడం మీ తండ్రికి ఇష్టం.” లూకా 12:32
యేసు పలికిన ఈ చిన్న వాక్యం మనకు మూడు విషయాలను వెల్లడిస్తుంది.
మొదటిగా, భయం మన జీవితాలను తన గుప్పిట్లోకి తీసుకోనివ్వకూడదని యేసు మనకు సుపరిచితమైన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. జీవితంలో భయాన్ని, చింతను, ఆందోళనను, ఇలాంటివాటిని కలిగించే విషయాలు ఎన్నో ఉన్నాయి. భయాన్ని అధిగమించడానికి వినయం అవసరం. ఎందుకంటే వినయం మన దృష్టిని మన మీద నుంచి, మనం ఎదుర్కొనే సమస్యల మీద నుంచి మరల్చి, మన ప్రభువుపై నిలపడానికి తోడ్పడుతుంది. మన దృష్టిని ఆయనపై నిలిపినప్పుడు, భయం తొలగిపోయి, దాని స్థానంలో నమ్మకం ఏర్పడుతుంది.
రెండవదిగా, యేసు తన శిష్యులను, మనందరినీ తన “చిన్న మంద” అని పిలుస్తున్నారు కాబట్టి, ఇది ఆయన ఎంతో ఆప్యాయంగా పలికిన మాట కూడా. ఈ ఆప్యాయమైన పిలుపు మన ప్రభువు హృదయపు మృదుత్వాన్ని, కరుణను వెల్లడిస్తుంది. ఈ పిలుపు మనం యేసుకు చెందినవారమని మాత్రమే కాకుండా, మనపట్ల ఆయన ప్రేమ ఎంత ఆత్మీయమైనదో, ఎంత హృదయపూర్వకమైనదో కూడా తెలియజేస్తుంది. ఆయన ఈ ప్రేమను మనం అర్థం చేసుకుంటే, మనమూ అంతే గాఢమైన ఆత్మీయతతో ఆయనను ప్రేమించకుండా ఉండలేము.
చివరిగా, ఈ వాక్యం పరలోకంలోని మన తండ్రి రాజ్యం వైపు మన దృష్టిని మళ్లిస్తుంది. మనం నమ్మకం ఉంచవలసిన, సన్నిహిత సంబంధం కలిగి ఉండవలసిన తండ్రి, తన అత్యంత మహిమగల రాజ్యంలో పాలుపంచుకోమని మనలను ఆహ్వానిస్తున్నారు. ఆయన రాజ్యం మనదవుతుంది. ఈ పిలుపు ఎంత మహిమాన్వితమైనదో మనం చూసి అర్థం చేసుకోగలిగినప్పుడు, ఆ రాజ్యాన్ని పొందేందుకు కృషి చేస్తూ ఆశతోనూ ఉత్సాహంతోనూ నిండిపోతాము.
తన రాజ్యంపై మీ దృష్టిని నిలపమంటూ మన కరుణామయ ప్రభువైన యేసు హృదయపూర్వకంగా ఇస్తున్న ఆహ్వానాన్ని గురించి ఈ రోజు ధ్యానించండి. అలా చేస్తూ, ఈ ప్రకటన మీ జీవితం నుంచి భయాన్ని పారద్రోలి, ఆ భారాన్ని అధిగమించేందుకు మిమ్మల్ని బలపరచనివ్వండి. దేవునిపై మీ నమ్మకాన్ని ఉంచండి; మిమ్మల్ని రూపాంతరం చెందించడానికి ఆయనకు అవకాశమివ్వండి.
ప్రభువా, నీపై నమ్మకం ఉంచమనే నీ ఆహ్వానాన్ని నేను అంగీకరిస్తున్నాను. జీవితంలో నేను లోనయ్యే అనేక భయాల నుండి దయచేసి నాకు విముక్తి కలిగించు. నీ రాజ్య మహిమపై నా దృష్టిని నిలిపేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, నీపైనా నీ కృపపైనా భరోసా ఉంచడానికి నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
నేటి పునీతులు – పునీత క్లారా




