తెలుగు

రూపాంతరం చెందిన తిరస్కారం

మార్చి 13, 2020
తపస్సుకాలం రెండవ వారంలోని శుక్రవారం
నేటి పఠనాలు

ఆంగ్లంలో వినండి

కట్టడాన్ని నిర్మించేవారు తిరస్కరించిన రాయి మూలరాయి అయింది.  మత్తయి 21:42

యుగయుగాలుగా ఎదురైన తిరస్కారాలన్నిటిలో, మిగిలినవాటన్నిటికంటే ప్రత్యేకంగా నిలిచేది ఒకటి ఉంది.  అది దేవుని కుమారునికి ఎదురైన తిరస్కారం.  యేసు హృదయంలో స్వచ్ఛమైన, పరిపూర్ణమైన ప్రేమ తప్ప మరేదీ లేదు.  తాను కలిసిన ప్రతి ఒక్కరికీ అత్యుత్తమమైన మేలు జరగాలని ఆయన కోరుకున్నాడు.  తన జీవమనే వరాన్ని స్వీకరించేవారెవరికైనా దానిని సమర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.  అనేకులు దానిని స్వీకరించినప్పటికీ, అనేకులు దానిని తిరస్కరించారు కూడా.  

యేసు అనుభవించిన తిరస్కారం ఆయనలో తీవ్రమైన వేదనను, బాధను మిగిల్చిందని అర్థం చేసుకోవడం ముఖ్యం.  నిజంగా సిలువ వేయబడటం అసాధారణమైన బాధను కలిగించిందనడంలో సందేహం లేదు.  అయితే, అంతమంది తిరస్కరించడం వల్ల ఆయన హృదయానికి తగిలిన గాయమే ఆయనకు అత్యంత తీవ్రమైన వేదనను, అన్నిటికంటే గొప్ప బాధను కలిగించింది.

ఈ అర్థంలో బాధను అనుభవించడం ప్రేమతో చేసిన కార్యమే తప్ప బలహీనతతో చేసినది కాదు.  యేసు అహంకారం వల్లగానీ, తన గురించి తక్కువగా భావించడం వల్లగానీ అంతరంగంలో బాధపడలేదు.  ఆయన ఎంతో గాఢంగా ప్రేమించాడు కాబట్టే ఆయన హృదయం వేదన చెందింది.  ఆ ప్రేమ తిరస్కరించబడినప్పుడు, ధన్యవచనాలలో చెప్పబడిన పవిత్ర దుఃఖంతో ఆయన నిండిపోయాడు (“దుఃఖించేవారు ధన్యులు…” మత్తయి 5:4).  ఈ విధమైన దుఃఖం నిరాశకు ఒక రూపం కాదు; బదులుగా, మరొకరి ప్రేమను కోల్పోవడాన్ని గాఢంగా అనుభవించడం.  అది పవిత్రమైనది; అందరిపట్ల ఆయనకున్న జ్వలించే ప్రేమకు ఫలితం.

మనకు తిరస్కారం ఎదురైనప్పుడు, మనం అనుభవించే వేదనను అర్థం చేసుకోవడం కష్టం.  మనకు కలిగే గాయం, కోపం ఒక “పవిత్ర దుఃఖం”గా మారడానికి అనుమతించడం ఎంతో కష్టం.  ఆ పవిత్ర దుఃఖం, మనం ఎవరి విషయంలో దుఃఖిస్తున్నామో వారిని మరింత గాఢంగా ప్రేమించేలా మనల్ని ప్రేరేపిస్తుంది.  ఇలా చేయడం కష్టమైనా, మన ప్రభువు చేసింది ఇదే.  యేసు ఇలా చేయడం వల్ల కలిగిన ఫలితం లోక రక్షణ.  యేసు కేవలం ప్రయత్నాన్ని విరమించుకుని ఉంటే ఎలా ఉండేదో ఊహించండి.  తనను బంధించినప్పుడు, తనను రక్షించడానికి రమ్మని యేసు అసంఖ్యాకమైన దేవదూతలను పిలిచి ఉంటే ఏమయ్యేది?  “ఈ ప్రజల కోసం ఇంత చేయడం తగదు!” అని అనుకుంటూ ఆయన ఇలా చేసి ఉంటే ఏమయ్యేది?  అప్పుడు ఆయన మరణ పునరుత్థానాల ద్వారా మనకు లభించిన నిత్యరక్షణ వరాన్ని మనం ఎన్నడూ పొందేవారం కాదు.  బాధ ప్రేమగా రూపాంతరం చెంది ఉండేది కాదు.

చెడును ఎదిరించి పోరాడటానికి మనకున్న గొప్ప వరాలలో ఒకటిగా తిరస్కారం మారగలదనే గాఢమైన సత్యాన్ని ఈ రోజు ధ్యానించండి.  అది గొప్ప వరాలలో ఒకటిగా “మారగలదు” అని చెప్పడానికి కారణం, చివరికి మనం ఎలా స్పందిస్తామనే దానిపైనే అంతా ఆధారపడి ఉండటం.  “తండ్రీ, వీరిని క్షమించు, తాము ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు” అని మొరపెట్టుకున్నప్పుడు యేసు పరిపూర్ణ ప్రేమతో స్పందించాడు.  అత్యంత తీవ్రమైన తిరస్కారం మధ్యలో ఆయన చేసిన ఈ పరిపూర్ణ ప్రేమకార్యం, ఆయన సభకు “మూలరాయి”గా, తద్వారా నూతన జీవితానికి మూలరాయిగా కావడానికి వీలు కల్పించింది!  ఈ ప్రేమను అనుకరించడానికి, క్షమించడమే కాక కరుణతో కూడిన పవిత్ర ప్రేమను కూడా అందించే ఆయన సామర్థ్యంలో పాలుపంచుకోవడానికి మనం పిలువబడ్డాం.  మనం అలా చేసినప్పుడు, ప్రేమ, కృప అత్యంత అవసరమైనవారికి మనం కూడా వాటిని అందించే మూలరాయిగా మారతాం.

ప్రభువా, ఆ మూలరాయిగా ఉండటానికి నాకు సహాయం చేయుము.  నాకు బాధ కలిగిన ప్రతిసారీ క్షమించడమే కాక, ప్రతిగా ప్రేమను, కరుణను కూడా అందించడానికి నాకు సహాయం చేయుము.  ఈ ప్రేమకు నీవే దివ్యమైన, పరిపూర్ణమైన ఆదర్శం.  నీతో కలిసి, “తండ్రీ, వీరిని క్షమించు, తాము ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు” అని మొరపెడుతూ, ఇదే ప్రేమలో నేను పాలుపంచుకునేలా అనుగ్రహించుము.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

సిలువ పాదాల వద్ద 40 రోజులు – పదహారవ ధ్యానం – అద్భుతాలన్నిటిలో అత్యంత గొప్పది

తపస్సుకాలం కోసం వనరులు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు