తెలుగు

మహిమపరచబడటం

మే 26, 2020
పాస్కా కాలపు ఏడవ వారంలోని మంగళవారం
నేటి పఠనాలు

పునీత ఫిలిప్ నేరి, యాజకుడు—జ్ఞాపకార్థ దినం

ఆంగ్లంలో వినండి

యేసు పరలోకం వైపు కన్నులెత్తి ఇలా అన్నారు: “తండ్రీ, ఆ గడియ వచ్చింది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారునికి మహిమను ప్రసాదించు.”  యోహాను 17:1

కుమారునికి మహిమను ప్రసాదించడం తండ్రి చేసే కార్యం. అయితే, మనమందరం కూడా శ్రద్ధ వహించవలసిన కార్యం అది!

మొదటగా, యేసు చెప్పే “గడియ” ఆయన సిలువ వేయబడే గడియ అని మనం గుర్తించాలి.  మొదట ఇది దుఃఖకరమైన క్షణంగా అనిపించవచ్చు.  కానీ దైవిక దృక్కోణంలో, యేసు దానిని తన మహిమ గడియగా చూస్తారు.  తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చినందుకు పరలోక తండ్రి ఆయనను మహిమపరచే గడియ అది.  లోక రక్షణ కోసం ఆయన తన మరణాన్ని సంపూర్ణంగా స్వీకరించారు.  

దీనిని మన మానవ దృక్కోణం నుండి కూడా చూడాలి.  మన దైనందిన జీవితాల దృష్ట్యా, ఈ “గడియ”ను మనం నిరంతరం స్వీకరించి, ఫలవంతం చేయగలమని గ్రహించాలి.  యేసు యొక్క ఈ “గడియ”ను మనం నిరంతరం జీవించాలి.  ఎలా?  మన జీవితాలలోని సిలువను నిరంతరం స్వీకరించడం ద్వారా; అప్పుడు ఈ సిలువ కూడా మహిమపరచబడే క్షణమవుతుంది.  ఇలా చేసినప్పుడు, మన సిలువలు దైవిక దృక్కోణాన్ని సంతరించుకుంటాయి; అవి దైవత్వాన్ని పొంది, దేవుని కృపకు మూలంగా మారతాయి.

మనం భరించే ప్రతి బాధ, మనం మోసే ప్రతి సిలువ, క్రీస్తు సిలువను వెల్లడించే అవకాశంగా ఉండటమే సువార్తలోని సౌందర్యం.  ఆయన శ్రమలను, మరణాన్ని మన జీవితాలలో జీవించడం ద్వారా ఆయనను నిరంతరం మహిమపరచాలని ఆయనే మనలను పిలుస్తున్నారు.

ఈ రోజు, మీరు భరిస్తున్న కష్టాల గురించి ధ్యానించండి.  మీరు ఆయనకు అవకాశమిస్తే, క్రీస్తులో ఆ కష్టాలు ఆయన విమోచనాత్మక ప్రేమలో పాలుపంచుకోగలవని తెలుసుకోండి. 

యేసూ, నా సిలువను, నా కష్టాలను నీకు సమర్పిస్తున్నాను.  నీవు దేవుడవు; సమస్తాన్ని మహిమగా మార్చగలవు.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

పవిత్రాత్మకు నవదిన ప్రార్థన
పెంతెకోస్తు పండుగకు సన్నాహంగా చేసే ప్రార్థన
ఐదవ రోజు – మంగళవారం, మే 26

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

నేటి పునీతులు – పునీత ఫిలిప్ నేరి, యాజకుడు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

చిత్రం: ఫ్లికర్