తెలుగు

కరుణ కోసం వేడుకోవడం

సెప్టెంబర్ 17, 2020
సామాన్య కాలంలోని ఇరవై నాలుగవ వారపు గురువారం
నేటి పఠనాలు

పవిత్ర రాబర్ట్ బెల్లార్మిన్, పీఠాధిపతి మరియు వేదపండితుడు—ఐచ్ఛిక స్మరణ

ఆంగ్లంలో వినండి

ఒక పరిసయ్యుడు యేసును తనతో భోజనం చేయడానికి ఆహ్వానించాడు. యేసు ఆ పరిసయ్యుని ఇంట్లోకి వెళ్లి భోజనానికి కూర్చున్నాడు. ఆ పట్టణంలో పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉండేది. ఆయన ఆ పరిసయ్యుని ఇంట్లో భోజనానికి కూర్చున్నాడని ఆమె తెలుసుకుంది. సుగంధ తైలంతో నిండిన చలువరాతి భరిణెను తీసుకువచ్చి, ఆయన వెనుక పాదాల దగ్గర నిలబడి ఏడుస్తూ, తన కన్నీళ్లతో ఆయన పాదాలను తడపసాగింది. తరువాత తన వెంట్రుకలతో వాటిని తుడిచి, ముద్దుపెట్టుకొని, ఆ తైలంతో అభిషేకించింది.  లూకా 7:36-38

ఈ సువార్తలో కొంతభాగం పరిసయ్యుని గురించినది.  ఈ భాగాన్ని ఇంకా ముందుకు చదివితే, ఆ పరిసయ్యుడు ఈ స్త్రీని, యేసును తీవ్రంగా తప్పుపట్టి ఖండించడం చూస్తాము.  ఇంతకుముందు పరిసయ్యులను ఎన్నోసార్లు గద్దించినట్లే యేసు అతనిని గద్దించాడు.  అయితే ఈ భాగం పరిసయ్యులను గద్దించడం కంటే ఎంతో ఎక్కువైన విషయాన్ని తెలియజేస్తుంది.  దీని అంతరార్థం ప్రేమ కథ.

ఆ ప్రేమ ఈ పాపాత్మురాలైన స్త్రీ హృదయంలో ఉన్న ప్రేమే.  అది పాపం పట్ల పశ్చాత్తాపంలోనూ, గాఢమైన వినయంలోనూ వ్యక్తమైన ప్రేమ.  ఆమె పాపం గొప్పది; దాని ఫలితంగా ఆమె వినయమూ ప్రేమా కూడా అంత గొప్పవిగా ఉన్నాయి.  ముందుగా ఆ వినయాన్ని చూద్దాం.  ఆమె యేసు దగ్గరకు వచ్చినప్పుడు చేసిన పనులలో అది కనిపిస్తుంది.

మొదట, “ఆమె ఆయన వెనుక నిలబడింది…”
రెండవది, ఆమె “ఆయన పాదాల దగ్గర…” పడిపోయింది.
మూడవది, ఆమె “ఏడుస్తూ ఉంది…”
నాలుగవది, ఆమె “తన కన్నీళ్లతో…” ఆయన పాదాలను కడిగింది.
ఐదవది, ఆమె “తన వెంట్రుకలతో…” ఆయన పాదాలను తుడిచింది.
ఆరవది, ఆమె ఆయన పాదాలను “ముద్దుపెట్టుకుంది.”
ఏడవది, ఆమె తన ఖరీదైన సుగంధ తైలంతో ఆయన పాదాలను “అభిషేకించింది.”

ఒక్క క్షణం ఆగి, ఈ దృశ్యాన్ని ఊహించుకోవడానికి ప్రయత్నించండి.  ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు ముందు ప్రేమతో తనను తాను తగ్గించుకోవడాన్ని చూడటానికి ప్రయత్నించండి.  ఈ చర్య అంతా గాఢమైన పాపదుఃఖాన్ని, పశ్చాత్తాపాన్ని, వినయాన్ని వ్యక్తపరిచేది కాకపోతే, మరి అది ఏమిటో చెప్పడం కష్టం.  ఇది ముందుగా పథకం వేసుకొని చేసిన పని కాదు, లెక్కలు వేసుకొని చేసినది కాదు, తనకు అనుకూలంగా మలచుకోవడానికి చేసినది కాదు.  బదులుగా, ఇది ఎంతో వినయంతో, నిజాయితీతో, సంపూర్ణంగా చేసిన పని.  ఈ చర్య ద్వారా ఆమె యేసు కరుణను, కనికరాన్ని ఆర్తిగా వేడుకుంటోంది; అందుకోసం ఆమె ఒక్క మాట కూడా పలకనవసరం లేదు.  

ఈ రోజు మీ సొంత పాపం గురించి ధ్యానించండి.  మీ పాపాన్ని మీరు గుర్తిస్తే తప్ప, ఈ విధమైన వినయపూర్వక పాపదుఃఖాన్ని వ్యక్తపరచలేరు.  మీ పాపాన్ని మీరు గుర్తిస్తున్నారా?  అలా గుర్తించిన తరువాత, యేసు ముందు నేలపై మోకరిల్లి, మీ తలను నేలకు వంచి, ఆయన కనికరాన్ని, కరుణను హృదయపూర్వకంగా వేడుకోవడాన్ని గురించి ఆలోచించండి.  నిజంగానే అలా చేయడానికి ప్రయత్నించండి.  దానిని నిజమైనదిగా, సంపూర్ణమైనదిగా చేయండి.  ఫలితంగా, యేసు ఈ పాపాత్మురాలైన స్త్రీ పట్ల చూపిన కరుణనే మీ పట్ల కూడా చూపుతాడు.

ప్రభువా, నీ కరుణ కోసం వేడుకుంటున్నాను.  పాపం చేసిన నాకు నరకశిక్షే తగినది.  నా పాపాన్ని అంగీకరిస్తున్నాను.  నీ కరుణతో నా పాపాన్ని క్షమించి, నీ అనంతమైన కనికరాన్ని నాపై కుమ్మరించమని వేడుకుంటున్నాను.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

నేటి పవిత్రులు – పవిత్ర రాబర్ట్ బెల్లార్మిన్, పీఠాధిపతి మరియు వేదపండితుడు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ప్రదర్శించిన చిత్రం: మరియా ఫెలీచే టిబాల్డి చిత్రించిన ‘పరిసయ్యుని ఇంట్లో విందు’