నవంబరు 5, 2020
సామాన్య కాలంలోని ముప్పై ఒకటవ వారపు గురువారం
నేటి పఠనాలు

ఆంగ్లంలో వినండి
సుంకరులు, పాపులు అందరూ యేసు మాటలు వినడానికి ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. అయితే పరిసయ్యులు, ధర్మశాస్త్రులు, “ఈయన పాపులను ఆహ్వానించి, వారితో కలిసి భోజనం చేస్తున్నాడు” అని గొణగడం మొదలుపెట్టారు. లూకా 15:1-2
మీకు ఎదురయ్యే పాపులతో మీరు ఎలా వ్యవహరిస్తారు? వారిని దూరం పెడతారా, వారి గురించి మాట్లాడుకుంటారా, వారిని ఎగతాళి చేస్తారా, జాలితో చూస్తారా, లేక పట్టించుకోకుండా ఉంటారా? అలా చేయరనే ఆశిస్తున్నాము! పాపంలో ఉన్న వ్యక్తితో మీరు ఎలా వ్యవహరించాలి? యేసు వారిని తన దగ్గరకు రానిచ్చారు, వారిపట్ల శ్రద్ధ చూపారు. నిజానికి, ఆయన పాపులపట్ల ఎంత కరుణతో, దయతో వ్యవహరించారంటే, పరిసయ్యులు, ధర్మశాస్త్రులు ఆయనను తీవ్రంగా విమర్శించారు. మరి మీ సంగతేమిటి? విమర్శలకు గురికావలసి వచ్చినా పాపులతో మెలగడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
కఠినత్వానికి, విమర్శలకు “తగినవారు” అనిపించేవారిపట్ల అలా వ్యవహరించడం చాలా సులభం. ఎవరైనా స్పష్టంగా తప్పుదారి పడుతున్నప్పుడు, మనం వారికంటే మంచివారమైనట్లు లేదా వారు పనికిరానివారైనట్లు వారిని వేలెత్తి చూపుతూ, కించపరచడం సమంజసమేనని దాదాపు భావిస్తాము. అలా చేయడం ఎంత సులభమో, అంత పెద్ద పొరపాటు కూడా!
మనం యేసులా ఉండాలనుకుంటే, వారిపట్ల మన వైఖరి పూర్తిగా భిన్నంగా ఉండాలి. వారితో మనకు ఎలా వ్యవహరించాలనిపిస్తుందో అలా కాకుండా, భిన్నంగా వ్యవహరించాలి. పాపం వికృతమైనది, మలినమైనది. పాపపు వలయంలో చిక్కుకున్న వ్యక్తిని విమర్శించడం సులభం. అయితే మనం అలా చేస్తే, యేసు కాలంలోని పరిసయ్యులకు, ధర్మశాస్త్రులకు మనకు తేడా ఉండదు. మనలో కరుణ లేకపోవడం వల్ల, యేసు కూడా మనపట్ల అదే కఠినత్వంతో వ్యవహరించే అవకాశం ఎంతో ఉంది.
యేసు పదేపదే గద్దించే కొద్ది పాపాలలో, ఇతరులపై తీర్పు తీర్చడం, విమర్శించడం ఒకటి కావడం గమనించదగిన విషయం. ఈ పాపం మన జీవితాలలో దేవుని కరుణకు తలుపు మూసివేస్తున్నట్లే అనిపిస్తుంది.
పాపాలు కొంతవరకు బహిరంగంగా కనిపించే వారిని మీరు ఎలా చూస్తున్నారు, వారితో ఎలా వ్యవహరిస్తున్నారు అనే విషయాన్ని ఈ రోజు ధ్యానించండి. మీరు వారిపట్ల కరుణతో వ్యవహరిస్తున్నారా? లేక వారిని చులకనగా చూస్తూ, తీర్పు తీర్చే హృదయంతో వ్యవహరిస్తున్నారా? కరుణ చూపడానికి, ఇతరులపై అసలు తీర్పు తీర్చకుండా ఉండటానికి మిమ్మల్ని మీరు మళ్లీ అంకితం చేసుకోండి. తీర్పు తీర్చవలసింది క్రీస్తు, మీరు కాదు. కరుణ, కనికరం చూపడానికి మీరు పిలువబడ్డారు. మీరు అలా చేయగలిగితే, మన కరుణామయుడైన ప్రభువును మరింతగా పోలి ఉంటారు.
ప్రభువా, కఠినంగా ఉంటూ ఇతరులపై తీర్పు తీర్చాలనిపించినప్పుడు నాకు సహాయం చేయుము. పాపుల పాపకృత్యాలను చూడకముందే, వారి ఆత్మలలో నీవు ఉంచిన మంచితనాన్ని చూస్తూ, వారివైపు కనికరపు చూపు మళ్లించడానికి నాకు సహాయం చేయుము. తీర్పును నీకే వదిలిపెట్టి, దానికి బదులుగా కరుణను స్వీకరించడానికి నాకు సహాయం చేయుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
పైన ప్రదర్శించిన చిత్రం: హెన్రిక్ సీమిరాడ్జ్కి చిత్రించిన క్రీస్తు మరియు పాపి




