తెలుగు

ఒక మనిషి మరణించాలి

ఏప్రిల్ 9, 2022
తపస్సు కాలం ఐదవ వారంలోని శనివారం
నేటి పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

అయితే వారిలో ఒకడైన కయఫా, ఆ సంవత్సరపు ప్రధాన యాజకుడు, వారితో ఇలా అన్నాడు: “మీకేమీ తెలియదు. జాతి అంతా నశించిపోకుండా ఉండేందుకు, ప్రజలందరికీ బదులుగా ఒక మనిషి మరణించడం మీకు మేలని కూడా మీరు ఆలోచించడం లేదు.” యోహాను 11:49–50

మునుపటి రోజు ధ్యానంలో చెప్పినట్లుగా, మనం యేసు శ్రమలపై, మరణంపై దృష్టి సారించడం ప్రారంభించాలి. ఈ ఆదివారం పవిత్ర వారం మొదలవుతుంది. కాబట్టి, తన సిలువను మనం శ్రద్ధగా తిలకించాలని దేవుడు కోరుకునే సమయం ఇది. ఆ సిలువను అన్ని కోణాలనుంచి చూడటం ముఖ్యం. ఏమి జరుగుతుండేదో, యేసు ఏమి అనుభవిస్తుండేవారో, శిష్యులు ఏమి అనుభవిస్తుండేవారో, చివరికి పరిసయ్యులు, ప్రధాన యాజకులు కూడా ఏమి అనుభవిస్తుండేవారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

పైన ఉటంకించిన నేటి సువార్తలో ప్రధాన యాజకుడైన కయఫా ఆలోచనా విధానాన్ని చూస్తాము. అతని మాటలు ఒకేసారి విచారకరంగానూ, ప్రవచనాత్మకంగానూ ఉండటం ఆసక్తికరం. అతడు ఇతర ప్రధాన యాజకులతోను, పరిసయ్యులతోను కలిసి యేసును చంపడానికి పథకాలు వేయడం, కుట్రలు పన్నడం మొదలుపెట్టాడు. అయితే కయఫాను, ఇతరులను ప్రేరేపించినట్లు కనిపించే ఉద్దేశం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంది.

యేసు ప్రజాదరణ పొందుతున్నారు. ఈ ప్రజాదరణ వల్ల రోమీయులతో సమస్యలు తలెత్తుతాయని వారు భయపడ్డారు. యేసు అంతమందిని ఆకర్షించినందుకు వారు ఈర్ష్యపడ్డారు కూడా. అందుకే ప్రజలందరూ మరణించడంకన్నా ఒక మనిషి మరణించడం మేలనే వక్రతర్కాన్ని కయఫా ముందుకు తెచ్చాడు. మరో మాటలో చెప్పాలంటే, యేసు ఎంతో ప్రజాదరణ పొందుతుండటం వల్ల, ప్రజలు ప్రధాన యాజకుల, పరిసయ్యుల మాటలకన్నా యేసు మాటలనే ఎక్కువగా వింటుండటం వల్ల, పరిస్థితులు మునుపటిలా మారాలంటే ఆ “సమస్య”ను తొలగించడమే మంచిదని అతడు భావించినట్లు కనిపిస్తుంది.

పరిసయ్యులు సత్యం కంటే తమ గురించీ, తమ హోదా గురించీ ఎక్కువగా ఆలోచించేవారనే విషయాన్ని ఇది వెల్లడిస్తుంది.  యేసు ఎన్నో సూచకక్రియలు, అద్భుతాలు చేస్తున్నారనేది ఆయనపై వారి విమర్శల్లో ఒకటి కావడం ఆశ్చర్యకరం.  ఎంత వింత!  ప్రధాన యాజకులకు, పరిసయ్యులకు సత్యం పట్ల ఆసక్తి ఉండి ఉంటే, వారు యేసు మహిమను, దైవిక అధికారాన్ని కూడా గుర్తించి, ఆయనను విశ్వసించి, ఆయనను అనుసరించి ఉండేవారు.  కానీ వారు తమ అహంకారాన్ని అణచుకొని, తమను కాక మరొకరిని అనుసరించాలనే పిలుపును అంగీకరించలేకపోయారు.  తమ అధికార స్థానాన్ని వదులుకోలేకపోయారు.

ఇలాంటి అనుభవాన్నే మన దైనందిన జీవితాల్లో తరచూ చూస్తుంటాము. అందరి దృష్టి మనపైనే ఉండాలని కోరుకుంటాము. అందువల్ల మరొకరు రాణించడం లేదా ప్రశంసలు పొందడం చూసినప్పుడు మనకు తరచూ ఈర్ష్య కలుగుతుంది. ఆ ఈర్ష్య తరచూ అసూయగా మారవచ్చు. అసూయ అంటే మరొకరిలోని మంచిని చూసి మనకు కోపం, బాధ కలగడం. దాని గురించే మనసులో మథనపడుతూ, వారు విఫలమవ్వాలని కోరుకోవచ్చు.

యేసుకు నమ్మకంగా ఉండే అనుచరులలో మనమూ ఉండటమే ఆదర్శం. రాబోయే వారంలో మన ప్రభువుపట్ల శత్రుత్వం పెరగడాన్ని మీరు చూస్తున్నప్పుడు, దీనిని ధ్యానించడం ఎంతో ముఖ్యం. మీరు అక్కడ ఉండి ఉంటే ఏమి చేసేవారు? ఇతరులు దాడులు చేస్తున్నా యేసుకు అండగా నిలబడేవారా? యేసుపట్ల శత్రుత్వం పెరిగేకొద్దీ, మీరు ఆయననుంచి వెనక్కి తగ్గేవారా, లేక ప్రేమతో, నిబద్ధతతో ఆయనకు మరింత దగ్గరయ్యేవారా?

మన ప్రభువు అనుభవించిన హింసలను స్మరించుకునే రోజులు సమీపిస్తున్నాయి. ఈ రోజు వాటి గురించి ధ్యానించండి. ఆ మొదటి పవిత్ర వారంలో ప్రజలు ఎన్నో విధాలుగా స్పందించారు, ఎన్నో అనుభవాలను పొందారు. వాటిని మీ మనసులో ధ్యానించడం ప్రారంభించండి. వారి స్థానంలో మిమ్మల్ని మీరు ఉంచుకొని, యేసుతో కలిసి ఆ అనుభవంలో జీవించడానికి ప్రయత్నించండి. శుభ శుక్రవారం నాడు ప్రేమతోను, ధైర్యంతోను ఆయనతో కలిసి సిలువ పాదాల చెంత ఉండటం, ప్రతి అడుగులోనూ ఆయనకు అండగా నిలుస్తూ ఆయనను ప్రేమించడం—ఇదే మన లక్ష్యం.

హింసలకు గురైన నా ప్రభువా, రాబోయే ఈ పవిత్ర వారంలో నేను నిన్ను అనుసరించుదును గాక.  నీవు తిరస్కారానికీ వేదనకూ గురైనప్పుడు కూడా నిన్ను ప్రేమించడానికి అవసరమైన ప్రేమ నాకు ఉండును గాక.  అసూయనూ స్వార్థాన్నీ పూర్తిగా విడిచిపెట్టి, ముఖ్యంగా ఇతరుల బాధల్లోనూ వారి మంచితనంలోనూ నిన్ను చూడటానికి నాకు సహాయం చేయి.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మన ధన్యమాత హృదయం నుండి ప్రేమపూర్వక దృష్టి

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

తపస్సుకాలం కోసం వనరులు

తపస్సు కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన చూపిన ప్రత్యేక చిత్రం:  ముళ్ల కిరీటం ధరించిన క్రీస్తు — చిత్రకారుడు మథియాస్ స్టోమ్, వికీమీడియా కామన్స్ ద్వారా