తెలుగు

సూచక చిహ్నాలను వెదకడం

అక్టోబర్ 10, 2022
సామాన్య కాలం ఇరవై ఎనిమిదవ వారంలోని సోమవారం
నేటి పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

ఇంకా ఎక్కువమంది ప్రజలు గుమికూడుతుండగా, యేసు వారితో ఇలా అన్నారు: “ఈ తరం దుష్ట తరం; ఇది ఒక సూచక చిహ్నాన్ని కోరుతోంది. కానీ యోనా సూచక చిహ్నం తప్ప మరే సూచక చిహ్నమూ దీనికి ఇవ్వబడదు.”  లూకా 11:29

జీవితంలో మీకు స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని లేదా దిశను ఇవ్వడానికి దేవుడు పరలోకం నుండి ఒక సూచక చిహ్నాన్ని ఇస్తే బాగుంటుందని మీరు ఎప్పుడైనా కోరుకుంటారా?  మీరు దేవుని నుండి సూచక చిహ్నాలను వెదుకుతూ, వాటిపై ఆధారపడుతున్నారా?  

దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తూ మన జీవితంలో ఒక స్పష్టమైన సూచక చిహ్నాన్ని ఇస్తే, దానిని ఒక వరంగా స్వీకరించి, అందుకు కృతజ్ఞులమై ఉండాలి.  అయితే దేవుని నుండి ఒక సూచక చిహ్నాన్ని పొందడం వేరు, దేవుని నుండి ఒక సూచక చిహ్నాన్ని కోరడం వేరు.  పై వచనంలో, తన వద్దకు వచ్చి సూచక చిహ్నాలను కోరేవారిని యేసు తీవ్రంగా ఖండిస్తున్నారు.  ఎందుకలా?  సూచక చిహ్నాలను కోరడాన్ని యేసు ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు?  దీనికి ప్రధాన కారణం, విశ్వాసమనే వరం ద్వారా మనం తనను వెదకాలని ఆయన కోరుకోవడమే.

యోనా సూచక చిహ్నం తప్ప మరే సూచక చిహ్నమూ ఇవ్వబడదని యేసు చెబుతున్నారు.  “యోనా సూచక చిహ్నం” అనేది యేసు సిలువవేయబడటం, మరణం, సమాధిలో మూడు రోజులు ఉండటం, పునరుత్థానం చెందడం వంటివాటిని సూచిస్తుంది.  యోనా మూడు రోజులు తిమింగలం కడుపులో ఉన్నారు.  తాను సమాధిలో మూడు రోజులు ఉంటానని యేసు వారికి చెబుతున్నారు.  

అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే, యేసు మరణ పునరుత్థానాలే ఇవ్వబడే సూచక చిహ్నం.  మన విశ్వాసానికి కేంద్రమైన ఈ పరమరహస్యం తప్ప మరేదీ మనం వెదకకూడదు.  క్రీస్తు జీవితంలోను, మరణంలోను, పునరుత్థానంలోను పాలుపంచుకోవడం ద్వారా మన విమోచనకు సంబంధించిన గొప్ప పరమరహస్యంలోకి ప్రవేశిస్తే చాలు, ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది; ప్రతి సమస్యను, ఆందోళనను, అయోమయాన్ని, ఇతర ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.  ఇది కాకుండా మరొక సూచక చిహ్నాన్ని వెదకడం తప్పు అవుతుంది. ఎందుకంటే అది యేసు మరణ పునరుత్థానాలు సరిపోవని చెప్పినట్లే అవుతుంది.

దేవుడు ఇప్పటివరకు ఇచ్చిన అత్యంత గొప్ప “సూచక చిహ్నం” గురించి ఈ రోజు ధ్యానించండి.  జీవితంలోని ప్రశ్నలతో మీరు సతమతమవుతున్నట్లయితే, నిశ్చయమైన ఈ ఒక్క సూచక చిహ్నం వైపు మీ దృష్టిని మరల్చండి.  మన విశ్వాసానికి కేంద్రమైన పరమరహస్యం వైపు, అంటే క్రీస్తు జీవితం, మరణం, పునరుత్థానం వైపు మీ దృష్టిని మరల్చండి.  అక్కడే ప్రతి ప్రశ్నకూ సమాధానం లభిస్తుంది, ప్రతి కృపా అనుగ్రహించబడుతుంది.  ఇంతకుమించి మనకు మరేమీ అవసరం లేదు.

ప్రభువా, జీవితంలో నేను తెలుసుకోవలసినదంతా నీ జీవితం, మరణం, పునరుత్థానమే.  నీ పరిపూర్ణ బలియాగం నాకు ప్రతి ప్రశ్నకూ సమాధానమిస్తుంది, సమస్త కృపలను కుమ్మరిస్తుంది.  ప్రతిరోజూ నాకు అవసరమైన సూచకచిహ్నంగా ఎల్లప్పుడూ నీ వైపు తిరిగేలా చేయి.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

కొత్తది!


దేవుని వైపు అంతరంగ ప్రయాణం:
అవిలా పునీత తెరేసా ధ్యానాలు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

ప్రధాన చిత్రం: పీటర్ లాస్ట్‌మన్ చిత్రించిన యోనా మరియు తిమింగలం, వికీమీడియా కామన్స్ ద్వారా