తెలుగు

పాపిపై ప్రేమ

నవంబర్ 15, 2022
సామాన్య కాలపు ముప్పై మూడవ వారంలోని మంగళవారం
నేటి పఠనాలు

పీఠాధిపతి, సభ పండితుడైన మహనీయ పునీత ఆల్బర్ట్—ఐచ్ఛిక స్మరణ

వీడియో

ఆంగ్లంలో వినండి

“జక్కయ్యా, త్వరగా దిగిరా, ఈ రోజు నేను నీ ఇంట్లో ఉండాలి.”  లూకా 19:5b

మన ప్రభువు నుండి ఈ ఆహ్వానం అందుకున్నప్పుడు జక్కయ్య ఎంతగా ఆనందించాడో!  ఈ కలయికలో గమనించవలసిన విషయాలు మూడు ఉన్నాయి.

మొదటిగా, చాలామంది జక్కయ్యను పాపిగా చూశారు.  అతడు పన్ను వసూలు చేసేవాడు కాబట్టి ప్రజలు అతడిని గౌరవించేవారు కాదు.  ఇది జక్కయ్యపై ప్రభావం చూపి, యేసు కనికరానికి తాను అనర్హుడనని భావించే శోధనకు అతడిని గురిచేసి ఉంటుందనడంలో సందేహం లేదు.  అయితే యేసు వచ్చింది పాపి కోసమే.  కాబట్టి, నిజం చెప్పాలంటే, యేసు కరుణను, కనికరాన్ని పొందడానికి జక్కయ్యే తగిన “అభ్యర్థి”.

రెండవదిగా, యేసు తన దగ్గరకు వచ్చి, అక్కడున్న వారందరిలో తనతో సమయం గడపడానికి తననే ఎంచుకున్నాడని జక్కయ్య గ్రహించినప్పుడు, అతడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు!  మన విషయంలోనూ ఇలాగే జరగాలి.  యేసు మనలను నిజంగానే ఎంచుకుంటాడు; మనతో ఉండాలని నిజంగానే కోరుకుంటాడు.  ఈ విషయాన్ని గ్రహించడానికి మనం మనసు తెరిస్తే, సహజంగా కలిగే ఫలితం ఆనందమే.  ఈ విషయం తెలిసినందుకు మీకు ఆనందం కలుగుతోందా?

మూడవదిగా, యేసు కనికరం ఫలితంగా జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్నాడు.  తన ఆస్తిలో సగం పేదలకు ఇవ్వడానికి, అంతకుముందు తాను ఎవరినైనా మోసం చేసి ఉంటే వారికి నాలుగింతలు తిరిగి చెల్లించడానికి అతడు నిశ్చయించుకున్నాడు.  జక్కయ్య నిజమైన సంపదను కనుగొనడం ప్రారంభించాడనడానికి ఇది ఒక సూచన.  యేసు తనపట్ల చూపిన దయను, కనికరాన్ని అతడు వెంటనే ఇతరులపట్ల చూపడం ప్రారంభించాడు.

ఈ రోజు జక్కయ్య గురించి ధ్యానించండి; అతనిలో మిమ్మల్ని మీరు చూసుకోండి.  మీరు కూడా పాపులే.  అయితే దేవుని కనికరం ఏ పాపంకన్నా ఎంతో శక్తిమంతమైనది.  మిమ్మల్ని ప్రేమతో క్షమించి, స్వీకరించే ఆయన ప్రేమ, మీలో కలిగే ఎటువంటి అపరాధ భావాన్నైనా మించిపోనివ్వండి.  ఆయన కరుణ అనే వరం మీ జీవితంలో కూడా ఇతరులపట్ల కరుణను, కనికరాన్ని పుట్టించనివ్వండి.

అత్యంత ప్రేమమయుడవైన ప్రభువా, నా పాపస్థితిలో నీ వైపు తిరిగి, నీ కారుణ్యాన్ని, కనికరాన్ని వేడుకుంటున్నాను.  నాపై నీ కారుణ్యాన్ని వర్షింపజేస్తున్నందుకు ముందుగానే నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  ఆ కారుణ్యాన్ని ఎంతో ఆనందంతో స్వీకరించి, నేనూ ఇతరులపై నీ కారుణ్యాన్ని వర్షింపజేయుదును గాక.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మా మొబైల్ యాప్‌ను ప్రయత్నించండి!

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

నేటి పునీతులు – పీఠాధిపతి, సభ పండితుడైన మహనీయ పునీత ఆల్బర్ట్

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ప్రదర్శించిన చిత్రం: జేమ్స్ టిస్సోట్ చిత్రించిన ‘యేసు ఆ దారిన రావడం కోసం మేడి చెట్టుపై వేచి ఉన్న జక్కయ్య’