తెలుగు

సత్యం వల్ల “అయోమయంలో పడటం”

ఫిబ్రవరి 3, 2023
సామాన్య కాలం నాలుగవ వారంలోని శుక్రవారం
నేటి పఠనాలు

పునీత బ్లేస్, బిషప్పు, వేదసాక్షి—ఐచ్ఛిక స్మరణ

పునీత అన్స్‌గార్, బిషప్పు—ఐచ్ఛిక స్మరణ

వీడియో

ఆంగ్లంలో వినండి

యోహాను నీతిమంతుడూ పవిత్రుడూ అని తెలిసినందున హేరోదు అతనికి భయపడి, అతనిని నిర్బంధంలో ఉంచాడు. అతని మాటలు విన్నప్పుడు హేరోదు ఎంతో అయోమయంలో పడేవాడు; అయినా అతని మాటలు వినడానికి ఇష్టపడేవాడు. మార్కు 6:20

ఆదర్శంగా చెప్పాలంటే, సువార్త ప్రకటించబడి, మరొకరు దానిని స్వీకరించినప్పుడు, దానిని స్వీకరించిన వారి హృదయం ఆనందంతో, ఓదార్పుతో, మారాలనే కోరికతో నిండుతుంది. నిజంగా విని, ఉదారంగా స్పందించేవారిని సువార్త రూపాంతరం చేస్తుంది. అయితే ఉదారంగా స్పందించనివారి సంగతేమిటి? సువార్త వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? నేటి సువార్త మనకు ఆ జవాబును ఇస్తుంది.

పైన ఉన్న వాక్యం పునీత బప్తిస్మ యోహాను శిరచ్ఛేదం గురించిన వృత్తాంతంలోనిది. ఈ వృత్తాంతంలో దుష్టంగా ప్రవర్తించినవారు హేరోదు, అతడు అక్రమంగా భార్యగా చేసుకున్న హేరోదియసు, హేరోదియసు కుమార్తె (సంప్రదాయం ప్రకారం ఆమె పేరు సలోమే). “నీ సోదరుని భార్యను నీవు భార్యగా ఉంచుకోవడం ధర్మసమ్మతం కాదు” అని యోహాను హేరోదుతో చెప్పినందుకు, హేరోదు అతనిని చెరసాలలో వేయించాడు. అయితే ఈ వృత్తాంతంలో ఎంతో ఆసక్తికరమైన విషయమేమిటంటే, యోహాను చెరసాలలో ఉన్నప్పుడు కూడా హేరోదు అతని బోధనను వినేవాడు. కానీ యోహాను బోధించిన విషయాలు హేరోదును హృదయపరివర్తన వైపు నడిపించడానికి బదులుగా, అతనిని “అయోమయంలో” పడవేశాయి.

యోహాను బోధనకు వచ్చిన ప్రతిస్పందన “అయోమయంలో పడటం” ఒక్కటే కాదు. హేరోదియసు ప్రతిస్పందన ద్వేషం. హేరోదుతో ఆమె చేసుకున్న “వివాహాన్ని” యోహాను ఖండించడం ఆమె హృదయాన్ని తీవ్రంగా గాయపరచినట్లు కనిపించింది. ఆ తరువాత యోహాను శిరచ్ఛేదానికి పథకం వేసింది ఆమెయే.

అందువల్ల, పవిత్ర సువార్తలోని సత్యం ప్రకటించబడినప్పుడు సాధారణంగా కనిపించే మరో రెండు ప్రతిస్పందనల గురించి ఈ సువార్త మనకు బోధిస్తుంది. ఒకటి ద్వేషం; మరొకటి అయోమయం (ఏమి తోచని స్థితిలో పడటం). కేవలం అయోమయంలో పడటం కంటే ద్వేషం ఎంతో చెడ్డదని స్పష్టమే. కానీ ఈ రెండింటిలో ఏదీ సత్యవాక్యాలకు తగిన ప్రతిస్పందన కాదు.

సువార్త సంపూర్ణంగా ప్రకటించబడినప్పుడు మీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? సువార్తలో మీకు అసౌకర్యం కలిగించే అంశాలు ఉన్నాయా? మన ప్రభువు బోధనలలో మిమ్మల్ని అయోమయానికి గురిచేసేవి లేదా కోపానికి దారితీసేవి ఉన్నాయా? హేరోదు, హేరోదియసుల మాదిరిగానే స్పందించే ప్రవృత్తితో మీరు కూడా పోరాడుతున్నారేమో తెలుసుకోవడానికి ముందుగా మీ హృదయంలోకి చూసుకోండి. ఆ తరువాత లోకం సువార్త సత్యానికి ఎలా స్పందిస్తుందో ఆలోచించండి. నేడు కూడా హేరోదు, హేరోదియసుల వంటి అనేకులు మన మధ్య ఉండటం చూసి మనం ఏమాత్రం ఆశ్చర్యపడనవసరం లేదు.

ఏదో ఒక స్థాయిలో సువార్త తిరస్కరించబడుతున్నట్లు మీకు కనిపించే విధానాల గురించి ఈ రోజు ధ్యానించండి. మీ సొంత హృదయంలోనే ఇది ఉన్నట్లు మీకు అనిపిస్తే, మీ శక్తినంతటినీ కూడగట్టుకొని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగండి. మరెక్కడైనా ఇది కనిపిస్తే, ఆ విరోధభావం మిమ్మల్ని కదిలించడానికిగానీ ఆందోళనకు గురిచేయడానికిగానీ అనుమతించకండి. మీ మనస్సును, హృదయాన్ని సత్యంపైనే నిలిపి, ఎలాంటి ప్రతిస్పందన ఎదురైనా స్థిరంగా ఉండండి.

సమస్త సత్యానికి ప్రభువైన నా ప్రభువా, నీ వాక్కు, కేవలం నీ వాక్కు మాత్రమే అనుగ్రహాన్ని, రక్షణను ప్రసాదిస్తుంది. ఎల్లప్పుడూ నీ వాక్కును ఆలకించి, పూర్ణహృదయంతో ఉదారంగా స్పందించడానికి నాకు అవసరమైన అనుగ్రహాన్ని దయచేసి ప్రసాదించు. నీ వాక్కు నా దోషాన్ని నాకు తెలియజేసినప్పుడు నేను పశ్చాత్తాపపడి, హృదయపూర్వకంగా నీవైపు తిరిగి వచ్చెదనుగాక. ఇతరులు నీ సత్యాన్ని తిరస్కరించినప్పుడు నాకు ధైర్యాన్ని, ఆ వాక్కును ప్రేమతో ఎలా పంచుకోవాలో తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదించు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

నేటి పునీతులు –

పునీత బ్లేస్, బిషప్పు, వేదసాక్షి—ఐచ్ఛిక స్మరణ

పునీత అన్స్‌గార్, బిషప్పు—ఐచ్ఛిక స్మరణ

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ప్రదర్శించిన చిత్రం: హేరోదు అంతిపా సమక్షంలో బోధిస్తున్న పునీత బప్తిస్మ యోహాను పీటర్ డె గ్రెబ్బర్ చిత్రకృతి, వికీమీడియా కామన్స్ ద్వారా