బుధవారం, డిసెంబరు 20, 2023
ఆగమనకాల వారదినం
నేటి పఠనాలు

ఆంగ్లంలో వినండి
అందుకు దూత ఆమెతో ఇలా అన్నాడు: “పవిత్రాత్మ నీ మీదికి దిగివస్తారు; సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. అందువల్ల జన్మించబోయే శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అని పిలువబడతాడు.” లూకా 1:35
యేసును గురించి మీకు తెలిసినదంతా కాసేపు పక్కనపెట్టి, మన ధన్యమాత మొట్టమొదటిసారి విన్నట్లుగా, ప్రధానదూత గబ్రియేలు పలికిన ఈ మాటలను మీరు వింటున్నట్లు భావించి ధ్యానించండి. పురుషునితో సంబంధం లేకపోయినా, ఆమెకు శిశువు జన్మిస్తాడని చెప్పబడింది. పవిత్రాత్మ ఆమెను ఆవరించడం ద్వారా ఈ గర్భధారణ జరుగుతుందని చెప్పబడింది. ఆమె శిశువు దేవుని కుమారుడవుతాడని కూడా చెప్పబడింది. మహిమాన్వితుడైన ఈ ప్రధానదూత తనకు వెల్లడించిన ఈ అద్భుత విషయాలను గురించి మరియ ఏమని ఆలోచించి ఉంటుంది?
ఇది ఏదో భ్రాంతి అని, తాము చూస్తున్నది, వింటున్నది ఏదో తాత్కాలిక మానసిక రుగ్మత వల్ల కలుగుతున్నదని ఒక సాధారణ వ్యక్తి బహుశా నిర్ధారించుకునేవారు. బహుశా ఆమె కల కంటోందా? లేక తెలియక తిన్నదో తాగినదో ఏదైనా ఆమెకు ఈ అనుభవాన్ని కలిగించిందా?
కానీ మన ధన్యమాత సాధారణ వ్యక్తి కాదు; ఆమె మనస్సు కూడా సాధారణమైనది కాదు. ఆమె నిష్కళంక స్వభావం వల్ల ఆమె మనస్సు సంపూర్ణమైన సూక్ష్మబుద్ధితో ఉండేది. గబ్రియేలు ఆమెకు శుభవందనం పలికినప్పుడు చెప్పినట్లుగా, ఆమె మనస్సు నిరంతరం “కృపతో నిండి” ఉండేది. ఆమెకు దేవుని స్వరం తెలుసు; ఈ ప్రధానదూత తనతో పరలోకం నుండి వచ్చిన సందేశాన్ని పలుకుతున్నాడని ఆమెకు తెలుసు. అందువల్ల ఆమె విని, స్వీకరించి, విశ్వసించి, సమ్మతించింది.
మరియ కేవలం సమ్మతించడం కంటే మరెంతో చేసిందని కూడా మనం నిర్ధారించుకోవచ్చు. దేవునిపట్ల, ఆయన చిత్తంపట్ల ఆమెకున్న ప్రేమ ఎంత బలంగా ఉండి ఉంటుందంటే, ప్రధానదూత ఇచ్చిన ఈ ఆదేశాన్ని నెరవేర్చాలనే తక్షణమైన, తీవ్రమైన ఆకాంక్షతో ఆమె నిండిపోయి ఉంటుంది. తనకు లభించిన ఈ అద్భుత పిలుపును నెరవేర్చడానికి తన శక్తిమేరకు అన్నీ చేయాలనే పవిత్రమైన కోరికతో ఆమె నిండిపోయి ఉంటుంది. ఈ పిలుపు వెంటనే ఆమె జీవితపు ప్రధాన లక్ష్యంగా మారి ఉంటుంది.
మన ధన్యమాతకు ఇవ్వబడిన విశిష్టమైన, మహిమాన్వితమైన పిలుపు మనలో ఎవరికీ ఇవ్వబడకపోయినా, దేవుడు మనందరికీ ఒక కార్యబాధ్యతను తప్పక ఇచ్చాడు. కొన్నిసార్లు మనం దానిని విని, ఆలోచిస్తాం. కొన్నిసార్లు దానిని స్వీకరించాలని నిర్ణయించుకుంటాం. అయితే మన ధన్యమాతను అనుసరించి, ఆ పిలుపును నెరవేర్చడానికి పరుగెత్తడమే ఆదర్శం. మనం కేవలం సంసిద్ధంగా ఉండటంతో సరిపెట్టుకోకూడదు. కేవలం లోబడటంతో సరిపెట్టుకోకూడదు. మన ఆత్మలోని ప్రతి కోరికను, మనలోని ప్రతి తపనను, ప్రతి ఆకాంక్షను కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే దిశగా పనిచేయనివ్వాలి.
జీవితంలో ఏమి చేయమని దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు? మీ జీవిత లక్ష్యం ఏమిటి? మీకు అప్పగించబడిన కార్యబాధ్యత ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పడం మీకు కష్టంగా ఉంటే, దేవుడు మీకోసం ఎంచుకున్నదానిని నెరవేర్చాలనే గాఢమైన, మీ అంతరంగమంతటినీ నింపే పవిత్రమైన కోరిక కోసం ప్రార్థించడంతో ప్రారంభించండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే మీ ఏకైక కోరిక అయితే, దేవుడు తన చిత్తాన్ని మీకు వెల్లడించినప్పుడు, మీరు దానిని మరింత సులభంగా, మరింత త్వరగా నెరవేర్చగలుగుతారు.
దేవుడు మీకు అప్పగించిన విశిష్టమైన కార్యబాధ్యతను గురించి ఈ రోజు ధ్యానించండి. మీ జీవితంలో మీరు ఏమి చేయాలని ఆయన పిలిచినా, అది మీకు మాత్రమే ఇచ్చిన పిలుపు. దాని నుండి పారిపోకండి. దానిని అయిష్టంగా అంగీకరించకండి. బదులుగా, మీ సర్వస్వంతో దానిని నెరవేర్చడానికి పరుగెత్తండి; మీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి దేవుణ్ణి అనుమతించండి.
అత్యంత పరిశుద్ధుడవైన ప్రభువా, నా జీవితం కోసం నీకు ఒక పరిపూర్ణమైన ప్రణాళిక ఉందని నాకు తెలుసు. మరెవరికీ ఇవ్వని కార్యబాధ్యతను నీవు నాకు ఇచ్చావని నాకు తెలుసు. నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలనే పవిత్రమైన కోరికతో నా ఆత్మను నింపుము; అత్యంత ఉత్సాహభరితమైన నిబద్ధతతో, శక్తితో దానిని నెరవేర్చేలా చేయుము. ఓ ప్రభువా, నేనూ నీ సేవకై ఉన్నాను; నీ చిత్తం ప్రకారం నాకు జరుగును గాక. మరియమాతా, మా కొరకు ప్రార్థించుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
2024 కోసం కొత్తగా!
ఒక గొప్ప క్రిస్మస్ కానుక…
పునీత అంద్రెయ క్రిస్మస్ నవదిన ప్రార్థన
సంప్రదాయంగా నవంబరు 30 నుండి క్రిస్మస్ ముందురోజు వరకు రోజుకు 15 సార్లు ఈ ప్రార్థన చేస్తారు.
ఆగమనకాలపు ఓ ప్రతిగీతాలు
డిసెంబర్ 17–23
ఆగమనకాలం కోసం పవిత్ర గ్రంథ ధ్యానాలు
పైన చూపిన ప్రత్యేక చిత్రం:దేవదూత శుభవార్త — చిత్రకారుడు ఫిలిప్ దె షాంపేన్, వికీమీడియా కామన్స్ ద్వారా




