తెలుగు

నిజమైన గొప్పతనం

ఫిబ్రవరి 27, 2024
తపస్సుకాల రెండవ వారంలోని మంగళవారం
నేటి పఠనాలు

నారెక్‌కు చెందిన పునీత గ్రెగోరి, మఠాధిపతి మరియు సభ పండితుడు—ఐచ్ఛిక స్మరణ

వీడియో

ఆంగ్లంలో వినండి

“మీలో అందరికంటే గొప్పవారు మీకు సేవకులుగా ఉండాలి. తమను తాము హెచ్చించుకునేవారు తగ్గించబడతారు; కానీ తమను తాము తగ్గించుకునేవారు హెచ్చించబడతారు.” మత్తయి 23:11–12

మీరు నిజంగా గొప్పవారిగా ఉండాలని కోరుకుంటున్నారా? మీ జీవితం ఇతరుల జీవితాల్లో నిజంగా మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నారా? గొప్పతనం కోసం ఈ కోరికను మన ప్రభువే మన అంతరంగంలో ఉంచారు; అది ఎన్నటికీ తొలగిపోదు. నరకంలో నిత్యమూ జీవించేవారు సైతం ఈ సహజమైన కోరికను అంటిపెట్టుకునే ఉంటారు. ఆ కోరిక ఎన్నటికీ నెరవేరదు కనుక అది వారికి నిత్యవేదనకు కారణమవుతుంది. అలాంటి గతిని మనం పొందకుండా చూసుకునేందుకు ప్రేరణగా, కొన్నిసార్లు ఈ వాస్తవాన్ని ధ్యానించడం ఉపయోగకరం.

నేటి సువార్తలో యేసు గొప్పతనాన్ని పొందడానికి అవసరమైన ముఖ్యమైన మార్గాల్లో ఒకదాన్ని మనకు బోధిస్తున్నారు. “మీలో అందరికంటే గొప్పవారు మీకు సేవకులుగా ఉండాలి.” సేవకులుగా ఉండటమంటే మీకంటే ఇతరులకు ప్రాధాన్యం ఇవ్వడం. మీ అవసరాలపై వారు శ్రద్ధ చూపేలా ప్రయత్నించడానికి బదులు, వారి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం. ఇలా చేయడం కష్టమే.

జీవితంలో ముందుగా మన గురించే ఆలోచించడం చాలా సులభం. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆచరణలో మనకంటే ఇతరులకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే, ఒక విధంగా మనకు మనం “మొదటి” స్థానం ఇచ్చుకుంటాం. ఎందుకంటే ఇతరులకు మొదటి స్థానం ఇవ్వాలనే నిర్ణయం వారికి మేలు చేయడమే కాక, మనకు కూడా అత్యుత్తమమైన మేలును చేకూరుస్తుంది. ప్రేమించడానికే మనం సృష్టించబడ్డాం. ఇతరులకు సేవ చేయడానికే మనం సృష్టించబడ్డాం. ఎంత త్యాగం చేయాల్సి వస్తుందో లెక్కించకుండా, మనల్ని మనం ఇతరులకు అర్పించుకునే ఉద్దేశంతోనే మనం సృష్టించబడ్డాం. అయితే ఇలా చేసినప్పుడు మనల్ని మనం కోల్పోము. అందుకు విరుద్ధంగా, మనల్ని మనం అర్పించుకుంటూ, ఇతరులకు మొదటి స్థానం ఇచ్చే కార్యంలోనే మనం నిజంగా ఎవరమో తెలుసుకుంటాం; మనం ఏ విధంగా ఉండాలని సృష్టించబడ్డామో ఆ విధంగా రూపుదిద్దుకుంటాం. మనమే ప్రేమస్వరూపులమవుతాం. ప్రేమించే వ్యక్తే గొప్ప వ్యక్తి… గొప్ప వ్యక్తినే దేవుడు హెచ్చిస్తారు.

ఈ రోజు, వినయం అనే గొప్ప రహస్యాన్ని, వినయంతో జీవించాలనే పిలుపును ధ్యానించండి. ఇతరులకు మొదటి స్థానం ఇవ్వడం, వారికి సేవకులుగా ఉండటం మీకు కష్టంగా అనిపించినా, అలా చేయండి. అందరి ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలని నిర్ణయించుకోండి. వారి ఆందోళనలకు ప్రాధాన్యం ఇవ్వండి. వారి అవసరాల పట్ల శ్రద్ధ వహించండి. వారు చెప్పేది వినండి. వారి పట్ల కనికరం చూపండి; దానిని సాధ్యమైనంత సంపూర్ణంగా చూపడానికి సిద్ధంగా, సుముఖంగా ఉండండి. మీరు ఇలా చేస్తే, మీ హృదయాంతరాళంలో ఉన్న గొప్పతనం పట్ల కోరిక నెరవేరుతుంది.

వినయమూర్తివైన నా ప్రభువా, నీ వినయం ద్వారా నీవిచ్చిన సాక్ష్యానికి నీకు కృతజ్ఞతలు. మా పాపాల పర్యవసానమైన బాధలను, మరణాన్ని కూడా అనుభవించడానికి నిన్ను నీవు అప్పగించుకునేంతగా, ప్రజలందరికీ మొదటి స్థానం ఇవ్వాలని నీవు నిర్ణయించుకున్నావు. ప్రియమైన ప్రభువా, నీ పరిపూర్ణ ప్రేమను ఇతరులతో పంచుకోవడానికి నన్ను ఉపయోగించుకునేలా, నాకు వినయపూర్వకమైన హృదయాన్ని దయచేయి.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

పన్నెండవ రోజు ధ్యానాలు:
ఎడారిలో 40 రోజులు & సిలువ చెంత 40 రోజులు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

తపస్సుకాలం కోసం వనరులు

తపస్సు కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

నేటి పునీతులు – నారెక్‌కు చెందిన పునీత గ్రెగోరి, మఠాధిపతి మరియు సభ పండితుడు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ఉన్న ప్రధాన చిత్రం: పేతురు పాదాలను కడుగుతున్న యేసు. చిత్రకారుడు: ఫోర్డ్ మాడాక్స్ బ్రౌన్, వికీమీడియా కామన్స్ ద్వారా