తెలుగు

ప్రేమించేందుకు “ద్వేషించడం”

సెప్టెంబరు 7, 2025
సాధారణ కాలపు ఇరవై మూడవ ఆదివారం (సంవత్సరం C)
నేటి పఠనాలు

చిత్రం అందించినది అడోబీ స్టాక్

వీడియో

ఆంగ్లంలో వినండి

గొప్ప జనసమూహాలు యేసుతో కలిసి ప్రయాణిస్తున్నాయి. ఆయన వెనుదిరిగి వారితో ఇలా అన్నారు: “ఎవరైనా నా దగ్గరకు వచ్చి, తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్లను, చివరికి తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే, నా శిష్యుడు కాలేడు.” లూకా 14:25–26

తమ కుటుంబాలను ద్వేషించమని యేసు ఆ “గొప్ప జనసమూహాలను” ఎందుకు ఉద్బోధించారు? నిజానికి, యేసు అంతకంటే ముందుకు వెళ్లారు. వారు తమ ప్రాణాలను కూడా ద్వేషించాలని ఆయన అన్నారు. అలా చేయకపోతే వారు ఆయన శిష్యులు కాలేరు. దిగ్భ్రాంతిని కలిగించే ఈ బోధ ప్రజలను తమ నులివెచ్చని విశ్వాసం నుండి మేల్కొలిపింది. కొన్నిసార్లు మనం యేసును ఎల్లప్పుడూ ప్రజల దైనందిన జీవితాల్లో వెలుగును నింపే దయామయునిగా, సౌమ్యునిగా మాత్రమే భావిస్తాం. ప్రజలు తాము ఎల్లప్పుడూ ఆదరించబడుతున్నామని, ప్రేమించబడుతున్నామని భావించేలా చేసిన చిరునవ్వుల యేసు చిత్రాలను మనం చూస్తాం. ఈ చిత్రాల్లో సత్యం ఉన్నప్పటికీ, హృదయపరివర్తన చెందాలని వారి అంతరంగపు లోతుల వరకు వారిని సవాలు చేయడం ద్వారా కూడా ఆయన వారి జీవితాల్లో వెలుగును నింపారన్నది సత్యమే. నేటి సువార్తలో యేసు చేస్తున్నది ఇదే.

మీ తండ్రిని, తల్లిని, పిల్లలను, తోబుట్టువులను, చివరికి మిమ్మల్ని మీరు కూడా ద్వేషించాలనడం, కోపం నుండి ఉద్భవించే ద్వేషమనే పాపాన్ని స్పష్టంగా సూచించడం లేదు. ఇక్కడ “ద్వేషం” అనే పదం ఇతరులను, మిమ్మల్ని మీరు కూడా ప్రేమించడానికి అత్యుత్తమమైన మార్గాన్ని సూచిస్తుంది. ముందుగా, చివరగా చెప్పిన విషయాన్ని చూద్దాం. ఈ విధమైన ద్వేషం తన శిష్యులుగా ఉండటానికి అవసరమని యేసు అన్నారు. కీలకమైన విషయం ఇదే. మనం అన్నిటికంటే ముందుగా క్రీస్తు శిష్యులమై ఉండకపోతే, ఇతరులను ప్రేమించలేము; మనల్ని మనం కూడా సరైన రీతిలో ప్రేమించుకోలేము. ఈ సందర్భంలో “ద్వేషం” అనేది స్వార్థపూరిత మమకారాలకు సంబంధించినది. అంటే, వ్యక్తులు, వస్తువులు దేవునిపట్ల మనకున్న ప్రేమకు సులభంగా అడ్డురాగలవు. అలా జరిగినప్పుడు, దేవునిపట్ల ప్రేమకూ, ఇతరులపట్ల, మనపట్ల కూడా ఉండవలసిన నిజమైన ప్రేమకూ వాటిని అడ్డంకులుగా చూడాలి. ఉదాహరణకు, దేవునికంటే తమనే ఎక్కువగా ప్రేమించాలని కుటుంబసభ్యులు ఏ విధంగానైనా మిమ్మల్ని కోరితే, దానిని దృఢసంకల్పంతో తిరస్కరించాలి. దీనిని వ్యక్తిపట్ల కాకుండా శోధనపట్ల పవిత్రమైన ద్వేషం అని అనవచ్చు. మీరు దివ్యబలిపూజకు వెళ్తున్నందుకు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని విమర్శిస్తూ, అలా వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారని అనుకుందాం. మీరు వారి మాట వింటే, దేవునికంటే వారికే ప్రాధాన్యం ఇస్తున్నట్టవుతుంది. లేదా ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టినప్పుడు మీరు వారిని క్షమించాలని నిర్ణయించుకున్నారనుకుందాం. అయితే మీ కుటుంబంలోని ఒకరు మీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ, ఆ వ్యక్తిపట్ల మీలో కోపాన్ని రగిలించడానికి ప్రయత్నిస్తారు. మీరు వారి మాట వింటే, దేవుని మాట వినడం లేదన్నమాట. ఇలాంటి సందర్భాల్లో శోధనను తిరస్కరించాలనే అర్థంలో మనం “ద్వేషించాలి”.

మరి మీ సంగతి ఏమిటి? మిమ్మల్ని మీరు ఎలా ద్వేషించుకుంటారు? అస్తవ్యస్తమైన మన వాంఛలు అనేక విధాలుగా పాపం వైపు ఆకర్షితమవడాన్ని ఇది సూచిస్తుంది. మనం ఆ అస్తవ్యస్త కోరికలకు లొంగిపోయినా, లేదా అంతకంటే ఘోరంగా, ఆ అస్తవ్యస్త కోరికలు సహజమైనవనీ, మనకు మంచివనీ భావించినా, దేవునికంటే ఆ అస్తవ్యస్త కోరికకే ప్రాధాన్యం ఇచ్చినట్టవుతుంది. అలాంటప్పుడు, దేవుణ్ణీ, ఆయన చిత్తాన్నీ మాత్రమే ఎంచుకుంటూ, ఆ స్వార్థపూరితమైన, అస్తవ్యస్తమైన కోరికను ద్వేషించి తిరస్కరించడం నేర్చుకోవాలి.

ఇతరుల ద్వారా వచ్చే శోధనలను, మన అస్తవ్యస్త కోరికల్లో ఉద్భవించే శోధనలను కూడా తిరస్కరిస్తూ, మన జీవితాల్లో దేవునిపట్ల ప్రేమకే అన్నిటికంటే మొదటి స్థానం ఇవ్వగలిగినప్పుడే, కేవలం అప్పుడే, ఇతరులను, మనల్ని మనం సరైన రీతిలో ప్రేమించగల స్థితిలో ఉంటాం. మనం ఇతరులను, మనల్ని మనం ప్రేమించాలని యేసు కోరుకుంటున్నారన్నది స్పష్టమే. అయితే మన ప్రేమ స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండి, దేవునిపట్ల ప్రేమ నుండి ప్రవహించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. మరే ఇతర రకమైన “ప్రేమ” అయినా అసలు ప్రేమే కాదు. అది స్వార్థపూరిత మమకారం. దేవుణ్ణి ప్రేమించేవారిగా, ఆ ప్రేమను ఇతరులకు అందించే సాధనాలుగా ఉండాలనే మన నిజమైన ధ్యేయానికి అది అడ్డుపడుతుంది.

అన్ని రకాల పాపాలను తిరస్కరించడానికి మీలో ఉండవలసిన తపన గురించి ఈ రోజు ధ్యానించండి. మీ కుటుంబసభ్యులు, స్నేహితుల ద్వారా మిమ్మల్ని ఆకర్షించే పాపం కూడా ఇందులో చేరుతుంది. అస్తవ్యస్తమైన మీ మానవ స్వభావం కారణంగా మీలో తలెత్తే ప్రతి రకమైన శోధన కూడా ఇందులో చేరుతుంది. నిజమైన ప్రేమకు మిమ్మల్ని దూరం చేసే ప్రతిదానినీ తొలగించాలని కోరుకుంటుంది కాబట్టి, ఈ పవిత్రమైన ద్వేషం ఒక ప్రేమకార్యం. ఈ రోజు యేసుకు నమ్మకమైన శిష్యులుగా ఉండాలని ఎంచుకోండి. ఈ నిర్ణయానికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నించే ప్రతిదానినీ తిరస్కరించడానికి కట్టుబడండి. అలా చేయడం వల్ల దేవునిపట్ల మీ ప్రేమ పెరగడమే కాకుండా, ఇతరులపట్ల మీ ప్రేమ, మీ సొంత ఆత్మపట్ల మీ ప్రేమ కూడా పెరుగుతాయి.

ప్రేమతపనగల నా ప్రభువా, నీ పట్ల తమకున్న ప్రేమకు అడ్డుపడే ప్రతి విధమైన ప్రలోభాన్ని తిరస్కరించమని నీవు జనసమూహాలను ప్రబోధించావు. పాపాన్ని, అన్ని ప్రలోభాలను నేను తీవ్రంగా తిరస్కరించగలిగేలా, వాటి పట్ల పవిత్రమైన ద్వేషంతో నా ఆత్మను నింపు. అన్నిటికంటే మిన్నగా నిన్ను ప్రేమించేందుకు, ఆ ప్రేమతో ఇతరులను, నా సొంత ఆత్మను కూడా నీ పవిత్ర హృదయంతో ప్రేమించేందుకు నాకు అనుగ్రహించు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

వ్యాకుల మాతకు నవదిన ప్రార్థన
సాంప్రదాయంగా సెప్టెంబరు 7–15 తేదీలలో ప్రార్థిస్తారు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు