ఆగస్టు 10, 2021
ఉపయాజకుడు, వేదసాక్షి అయిన పునీత లారెన్స్ పండుగ

ఆంగ్లంలో వినండి
తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దానిని కోల్పోతాడు; ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు దానిని నిత్యజీవం కొరకు కాపాడుకుంటాడు. యోహాను 12:25
యేసు పలికిన శక్తిమంతమైన, దిగ్భ్రాంతి కలిగించే అనేక వాక్యాలలో ఇది ఒకటి. యేసు పలికిన ఇలాంటి వాక్యం నాలుగు సువార్తలలోనూ కనిపిస్తుంది. యోహాను అందించిన ఈ వాక్యంలో “ప్రేమించడం”, “ద్వేషించడం” అనే మాటలు ఉపయోగించబడ్డాయి. మన ప్రాణాలను ప్రేమించడం ద్వారా వాటిని కోల్పోతాము; కానీ మన ప్రాణాలను ద్వేషించడం ద్వారా వాటిని కాపాడుకుంటాము. మొదటిసారి చదివినప్పుడు, “ప్రేమించడం”, “ద్వేషించడం” అనే మాటలు పొరపాటున తారుమారయ్యాయని అనిపించవచ్చు. యేసు చెప్పదలచుకున్నది, “తన ప్రాణాన్ని ద్వేషించేవాడు దానిని కోల్పోతాడు”, “తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దానిని కాపాడుకుంటాడు” అని ఎవరైనా భావించవచ్చు. కానీ ఆయన చెప్పింది అది కాదు. నిజానికి ఆయన దానికి విరుద్ధంగానే చెప్పారు.
ఇక్కడ “ప్రేమించడం”, “ద్వేషించడం” అనే మాటలు మనం సాధారణంగా ఉపయోగించే అర్థంలో వాడబడలేదని గ్రహించాలి. ఈ వాక్యంలో యేసు “ప్రేమించడం” అనే మాటను స్వార్థాన్ని లేదా తన గురించే ఆలోచించడాన్ని సూచించడానికి ఉపయోగిస్తున్నారు. “ద్వేషించడం” అనే మాటను నిస్వార్థతను లేదా త్యాగపూర్వక ఆత్మార్పణను సూచించడానికి ఉపయోగిస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే, జీవితంలో స్వార్థంతో ప్రవర్తించేవారు చివరికి సమస్తాన్ని కోల్పోతారు; కానీ నిజంగా నిస్వార్థంగా, తమను తాము అర్పించుకుంటూ జీవించేవారు అంతిమంగా సమస్తాన్ని పొందుతారు.
మన ప్రభువు ఇచ్చిన ఈ గంభీరమైన బోధను ఆయన కృపావరం లేకుండా అర్థం చేసుకోవడం కష్టం. నిస్వార్థంగా జీవించడం మంచిదనే భావనను మన మానవ హేతుబుద్ధి మాత్రమే అంగీకరించడానికి కష్టపడవచ్చు. అందరికంటే మనల్ని మనం ఉన్నత స్థానంలో నిలుపుకోవడమే ఎంతో మేలని తార్కికంగా నిర్ధారించుకోవడం సులభం. సంపదలు, హోదా, అధికారం, అందరి గౌరవం పొందడంలోనే సంతోషం, “మంచి జీవితం” ఉన్నాయని హేతుబుద్ధి నిర్ధారించవచ్చు. కానీ ఈ విధమైన స్వార్థపూరితమైన, తన చుట్టూనే తిరిగే జీవనం, కేవలం మానవ దృష్టిలో ఆకర్షణీయంగా కనిపించినా, నిజంగా మేలైనదంతా కోల్పోయే మార్గమే. దీనికి విరుద్ధంగా, దేవుని కృప మన మానవ హేతుబుద్ధికి దిశానిర్దేశం చేయడానికి మనం అనుమతించినప్పుడే, స్వార్థంతో కాక నిస్వార్థంగా ఉండటమే అత్యుత్తమమనే నిర్ణయానికి వస్తాము. నిస్వార్థంగా ఉండటమంటే మన దృష్టి ఎల్లప్పుడూ ఇతరుల మేలు వైపు ఉండటమే. మన గురించే ఆలోచిస్తూ కూర్చోకపోవడమే. మనం ఎంత త్యాగం చేయవలసి వచ్చినా, దేవుని సేవకు, మన పొరుగువారి సేవకు సంపూర్ణంగా అంకితమై ఉండటమే. దేవుని సేవలోను ప్రేమలోను మనం సమస్తాన్ని అర్పించాలి; మనం ఎన్నడూ ఆశించగలిగినదానికంటే ఎక్కువగా దేవుడు మనకు తిరిగి ఇచ్చే ఏకైక మార్గం అదే.
ఈ రోజు మనం గౌరవించే పునీత లారెన్స్ మూడవ శతాబ్దంలో జీవించిన ఉపయాజకుడు, వేదసాక్షి. దేవునికి “అవును” అని చెప్పడానికి ఈ గొప్ప పునీతుడు తన ప్రాణంతో సహా నిజంగానే సర్వస్వాన్నీ త్యజించారు. రోములోని ప్రధాన దేవాలయంలో ఉపయాజకునిగా ఉన్న ఆయనకు, అవసరంలో ఉన్న నిరుపేదలకు దానధర్మాలు పంచే బాధ్యత అప్పగించబడింది. 258వ సంవత్సరం ఆగస్టులో, మతగురువులందరికీ మరణశిక్ష విధించాలని చక్రవర్తి ఒక శాసనం జారీ చేశాడు. పాపుగారిని చంపిన తరువాత, వారు లారెన్స్ కోసం వచ్చారు. ఆయనను చంపడానికి ముందు, సభ సంపదలన్నిటినీ తమకు అప్పగించమని కోరారు. ఆ సంపదలను సమకూర్చడానికి మూడు రోజుల గడువు ఇవ్వమని ఆయన అడిగారు. ఆ మూడు రోజులలో ఆయన పేదలకు పంచగలిగినదంతా పంచిపెట్టారు. తరువాత, మూడవ రోజున ఆయన ప్రిఫెక్టు ఎదుట హాజరయ్యారు. తనతోపాటు సభ భౌతిక సంపదను కాక, నిజమైన సంపదను తీసుకువచ్చారు. పేదలను, అంగవైకల్యం గలవారిని, అంధులను, బాధపడుతున్నవారిని తీసుకువచ్చి, సభ నిజంగా సంపన్నమైనదని, తనతో ఉన్న ఈ ప్రజలే సభ నిజమైన సంపదలని ప్రకటించారు. కోపోద్రిక్తుడైన ప్రిఫెక్టు, లారెన్స్‌ను అగ్నితో కాల్చి చంపాలని శిక్ష విధించాడు. లారెన్స్ ఆ శిక్షకు స్వచ్ఛందంగా లోనయ్యారు.
అన్ని విధాలా సంపూర్ణంగా నిస్వార్థమైన, ఆత్మార్పణతో కూడిన జీవితాన్ని గడపడానికి మీకు లభించిన ఉన్నతమైన క్రైస్తవ పిలుపును గురించి ఈ రోజు ధ్యానించండి. మీరు ఎక్కువగా మీ గురించే ఆలోచిస్తున్నట్లు గమనిస్తే, ఆ అలవాటును మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీ దృష్టిని దేవుని వైపు, ఇతరుల సేవ వైపు తిప్పండి. మీ సొంత విషయాలకంటే మీ చుట్టూ ఉన్నవారి అవసరాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపడానికి ప్రయత్నించండి. యేసు మనల్ని చేయమని పిలిచేది ఇదే కాబట్టి అలా చేయండి. ఆయన మనల్ని ఇంత నిస్వార్థమైన జీవితానికి పిలుస్తున్నట్లయితే, చివరికి అలా జీవించడం సార్థకమవుతుందని మనం తెలుసుకొని విశ్వసించాలి.
త్యాగమయుడవైన నా ప్రభువా, నీవు ప్రేమతో నీ అమూల్యమైన ప్రాణాన్ని అందరికీ అర్పించావు. నీ జీవితాన్ని సంపూర్ణంగా అర్పించడం ద్వారా, ఈ మహిమాన్వితమైన వరాన్ని అంగీకరించేవారికి రక్షణ లభించింది. నీవు ఉచితంగా ఇచ్చిన ఈ వరాన్ని స్వీకరించడానికి నా హృదయాన్ని తెరవడమే కాక, నీ సేవలోను ఇతరుల సేవలోను నన్ను నేను అర్పించుకోవడం ద్వారా నీ నిస్వార్థ జీవితాన్ని అనుసరించడానికి కూడా నాకు సహాయం చేయి. ఉపయాజకుడు, వేదసాక్షి అయిన పునీత లారెన్స్, మా కొరకు ప్రార్థించండి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు
నేటి పునీతుడు – ఉపయాజకుడు, వేదసాక్షి అయిన పునీత లారెన్స్




