తెలుగు

యేసుతో కలిసి ఆత్మల కోసం వల వేయడం

ఏప్రిల్ 22, 2022
పాస్కా అష్టదినోత్సవంలోని శుక్రవారం
నేటి పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

“పడవ కుడివైపున వల వేయండి; మీకు కొన్ని చేపలు దొరుకుతాయి.” కాబట్టి వారు వల వేశారు. చేపలు చాలా ఎక్కువగా పడటంతో దానిని లాగలేకపోయారు.  యోహాను 21:6

పై వాక్యభాగంలో యేసు అపొస్తలులకు కలిగించిన అనుభవం తమకూ కలగాలని ప్రతి జాలరి కోరుకుంటారు.  అపొస్తలులు రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నించారు, కానీ ఏమీ దొరకలేదు.  ఉదయం యేసు ఒడ్డున కనిపించారు; అయితే వారు ఆయనను గుర్తించలేదు.  అప్పుడు పడవ కుడివైపున వల వేయమని ఆయన వారికి ఒక సరళమైన ఆజ్ఞ ఇచ్చారు.  వారు పట్టిన చేపలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే, వాటిని పడవలోకి లాగలేకపోయారు.  ఎంత ఉత్సాహాన్ని కలిగించే చేపల వేట!

ఇలా చేపలు చిక్కడం, వారి పనిలో సాయపడటానికి యేసు చేసిన ఒక మేలు మాత్రమే కాదు.  దానికి ఎంతో లోతైన సంకేతార్థం ఉంది.  దానిలోని ప్రధాన సంకేతార్థం ఏమిటంటే, యేసు అపొస్తలులకు ఒక కొత్త పిలుపును ఇస్తున్నారు.  ఇకపై వారు కేవలం చేపల కోసం మాత్రమే వల వేయరు; ఇప్పుడు వారు ఆత్మల కోసం వల వేయాలి.  ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే, తమ సొంత ప్రయత్నాలతోనే ఈ పని చేయాలని చూస్తే, వారు వట్టి చేతులతోనే తిరిగి వస్తారు.  అయితే, ప్రభువు ఆజ్ఞ ప్రకారం, ఆయన చూపిన విధంగా, ఆయన నిర్ణయించిన సమయంలో ఈ పని చేస్తే, వారి ప్రయత్నాలు సమృద్ధిగా మంచి ఫలాలను ఇస్తాయి.  వారు ఎన్నడూ ఊహించలేనంతగా ఫలిస్తాయి!

లోకానికి సువార్తను ప్రకటించాలనే ఆజ్ఞను యేసు చేసిన ఈ అద్భుతం అపొస్తలులకు (మనకు కూడా) వెల్లడించడం ప్రారంభిస్తుంది.  తన పునరుత్థానం తరువాత, తన రక్షణ కార్యాన్ని కొనసాగించడానికి యేసు అపొస్తలులకు చివరి సూచనలు ఇస్తున్నప్పుడు ఈ విషయం వెల్లడవుతుంది.  సువార్తను వ్యాప్తి చేయడానికి మనకున్న పిలుపును ఈ అద్భుతంలో మనం చూడాలి.  యేసు ఆజ్ఞ ప్రకారం మాత్రమే, ఆయన చూపిన విధంగా, ఆయన నిర్ణయించిన సమయంలో సువార్తను వ్యాప్తి చేయాలనే ఆజ్ఞను కూడా ఈ అద్భుతంలో మనం చూడాలి.

కొన్నిసార్లు క్రైస్తవులు సువార్తను వ్యాప్తి చేయడానికి ఎన్నో “మంచి” ఆలోచనలు చేస్తుంటారు.  కానీ ముఖ్యమైనది ఏమిటంటే, దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకొని, ప్రభువు ముందుండి నడిపిస్తూ దిశానిర్దేశం చేయకపోతే సువార్తలోని శుభవార్తను వ్యాప్తి చేయడం మనకు సాధ్యం కాదని గుర్తించడం.  మనం ఆయన కోసం వేచి ఉండి, ఆయనను మాట్లాడనివ్వాలని ఇది మనకు తెలియజేస్తుంది.  మనం ఆయన స్వరాన్ని ఆలకించాలి; ఆయన నడిపించినప్పుడు మాత్రమే స్పందించాలి.  సువార్త ప్రచారం అనేది మన సొంత ప్రయత్నంతో చేసే పని కంటే, యేసుకు మనం ఇచ్చే ప్రతిస్పందన.  ఈ అద్భుత సంఘటనలోని ప్రధాన సందేశం ఇదే.

మనం పాస్కా దినోత్సవాన్ని జరుపుకోవడం కొనసాగిస్తున్న ఈ సమయం, సువార్తను ప్రకటించడంలో మనకున్న బాధ్యతను మనలో ప్రతి ఒక్కరూ ధ్యానించడానికి తగిన సమయం.  యేసు చేసే ఈ పనిలో పాలుపంచుకోవడానికి మనందరికీ పిలుపు ఉంది.  మన పిలుపు, మనకు అప్పగించిన కార్యాన్ని బట్టి ఇది మనలో ప్రతి ఒక్కరి జీవితంలో వేర్వేరు రూపాలను సంతరించుకుంటుంది.  అయితే అసలైన ప్రశ్న ఇది: “యేసు నాకు చూపుతున్న విధంగా సువార్తను ప్రకటించమనే ఆయన పిలుపుకు నేను స్పందిస్తున్నానా?”  ఇది ముఖ్యమైన ప్రశ్న.  యేసు మనకు ఇచ్చే ప్రత్యేక కార్యం మరెవరికీ అప్పగించబడలేదని మనం తెలుసుకోవాలి.  ఆయన మనల్ని నిజంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు.  

మన ప్రభువు అపొస్తలులకు ఇచ్చిన ఈ ఆజ్ఞను గురించి ఈ రోజు ధ్యానించండి.  తన పవిత్ర చిత్తానికి అనుగుణంగా “ఆత్మల కోసం వల వేయమని” మిమ్మల్ని పిలుస్తూ, ఇదే ఆజ్ఞను ఆయన మీతో చెప్పడం ఆలకించండి.  ఈ వారం ప్రభువును మీతో మాట్లాడనివ్వండి; ఆయన దిశానిర్దేశాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి.  దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు; కాబట్టి అందుకు ఆయనకు తప్పక అవకాశం ఇవ్వండి!

ఆజ్ఞాపించే నా ప్రభువా, నీవు నన్ను ఉపయోగించుకోవాలని నేను నిజంగా కోరుకుంటున్నాను.  నీ చిత్తానికి అనుగుణంగా సువార్తను ప్రకటించాలని నేను నిజంగా కోరుకుంటున్నాను.  నీ పిలుపుకు ధైర్యంగా స్పందించడానికి నాకు సహాయం చేయుము; నీవిచ్చే నిర్దేశాన్ని చిత్తశుద్ధితో ఆలకించడానికి నాకు సహాయం చేయుము.  ప్రియ ప్రభువా, నీ రాజ్యం కోసం అనేక ఆత్మలను రక్షించడానికి నన్ను ఉపయోగించుకొనుము.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ఎనిమిదవ రోజు: దైవకారుణ్య ఆదివారానికి సిద్ధపడే నవదిన ప్రార్థన

పాస్కా పండుగకు మరిన్ని

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ప్రదర్శించిన చిత్రం: అద్భుత రీతిలో చేపలు పట్టడం — చిత్రకారుడు రఫాయేల్, వికీమీడియా కామన్స్ ద్వారా


ఈ-పుస్తకంగా, కాగితపు అట్టతో ముద్రిత పుస్తకంగా లభ్యం:

అమెజాన్ –  బార్న్స్ అండ్ నోబుల్ – గూగుల్ ప్లే – ఐట్యూన్స్

దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు:
పునీత ఫౌస్టీనాతో 365 రోజులు