తెలుగు

పశ్చాత్తాపపడవలసిన సమయం వచ్చింది!

జూలై 12, 2022
సామాన్యకాలం పదిహేనవ వారంలోని మంగళవారం
నేటి పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

తన మహత్కార్యాలలో అత్యధికం జరిగిన పట్టణాల ప్రజలు పశ్చాత్తాపపడలేదు కనుక యేసు వారిని మందలించడం ప్రారంభించాడు. “కొరాజీనా, నీకు శ్రమ! బేత్సయిదా, నీకు శ్రమ!”  మత్తయి 11:20-21a

యేసు చూపిన కారుణ్యం, ప్రేమ ఎంత గొప్పవి!  కొరాజీను, బెత్సయిదా పట్టణాల ప్రజలను ఆయన గద్దిస్తున్నారు. ఎందుకంటే ఆయన వారిని ప్రేమిస్తున్నారు; తాను వారికి సువార్తను అందించి, ఎన్నో మహత్కార్యాలు చేసినప్పటికీ వారు తమ పాపపు జీవితాలను అంటిపెట్టుకునే ఉండటాన్ని ఆయన చూస్తున్నారు.  వారు మొండితనంతో, పాపంలో చిక్కుకొని, అయోమయంలో ఉండిపోతున్నారు; పశ్చాత్తాపపడటానికీ, తమ జీవితాలను మార్చుకోవటానికీ ఇష్టపడటం లేదు.  ఈ సందర్భంలో యేసు అద్భుతమైన రీతిలో కారుణ్యాన్ని చూపుతున్నారు.  ఆయన వారిని మందలిస్తున్నారు!  పైన పేర్కొన్న వాక్యభాగం తరువాత ఆయన ఇంకా ఇలా అంటున్నారు: “నేను మీతో చెప్పేదేమిటంటే, తీర్పు దినాన మీకంటే తూరు, సీదోను పట్టణాలవారికి ఎక్కువ సహనీయంగా ఉంటుంది.”

ఇక్కడ ఒక అద్భుతమైన తేడా ఉంది. కొన్నిసార్లు దేవుడు మనతో ఏమి చెబుతున్నాడో వినడానికి, అలాగే అలవాటుగా పాపం చేస్తూ మన జీవితాల్లో లేదా ఇతరుల జీవితాల్లో బాధ కలిగించే మన చుట్టూ ఉన్నవారితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది.  కొరాజీనా, బేత్సయిదా ప్రజలను యేసు తీవ్రంగా మందలించడం వెనుక ఉన్న ప్రేరణకు సంబంధించినదే ఈ తేడా.  ఆయన అలా ఎందుకు చేశాడు?  ఆయన చర్యల వెనుక ఉన్న ప్రేరణ ఏమిటి?

యేసు వారిపట్ల ప్రేమతోనూ, వారు మారాలనే కోరికతోనూ వారిని తీవ్రంగా మందలిస్తున్నాడు.  ఆయన వారిని ఆహ్వానించి, తన అద్భుతాల ద్వారా శక్తివంతమైన సాక్ష్యాన్ని ఇచ్చినప్పుడు వారు వెంటనే తమ పాపానికి పశ్చాత్తాపపడలేదు. అందువల్ల ఆయన మరో స్థాయిలో స్పందించవలసి వచ్చింది.  ఈ కొత్త స్థాయి స్పందన ప్రేమతో కూడిన కఠినమైన, స్పష్టమైన మందలింపు.

యేసు చేసిన ఈ పనిని మొదట్లో కోపంతో భావోద్వేగాలు ఒక్కసారిగా ఉప్పొంగడంగా భావించవచ్చు.  కానీ ముఖ్యమైన తేడా అక్కడే ఉంది.  యేసు కోపంతో తనపై అదుపు కోల్పోయి వారిని తీవ్రంగా గద్దించలేదు.  వారు మారడానికి ఆ మందలింపు అవసరం కనుకనే ఆయన వారిని గద్దించాడు.  

ఇదే సత్యాన్ని మన జీవితాలకూ అన్వయించుకోవచ్చు.  కొన్నిసార్లు కృపను స్వీకరించమని యేసు ఇచ్చే మృదువైన ఆహ్వానం వల్ల మనం మన జీవితాలను మార్చుకొని పాపాన్ని అధిగమిస్తాము.  కానీ మరికొన్నిసార్లు, పాపం లోతుగా పాతుకుపోయినప్పుడు, మనకు పవిత్రమైన మందలింపు అవసరం.  అలాంటప్పుడు యేసు పలికిన ఈ మాటలు నేరుగా మనతోనే చెప్పినట్లుగా మనం వినాలి.  మన జీవితాల్లో మనకు అవసరమైన ప్రత్యేక కరుణాకార్యం ఇదే కావచ్చు.

ఇతరులతో మనం ఎలా వ్యవహరించాలో కూడా ఇది మనకు లోతైన అవగాహనను ఇస్తుంది.  ఉదాహరణకు, తల్లిదండ్రులు దీని నుండి ఎంతో నేర్చుకోవచ్చు.  పిల్లలు తరచూ రకరకాలుగా దారితప్పుతుంటారు; వారిని సరిదిద్దవలసి ఉంటుంది.  సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వారికి సహాయపడే ఉద్దేశంతో మృదువైన ఆహ్వానాలతో, సంభాషణలతో ప్రారంభించడం తప్పకుండా సముచితమే.  అయితే కొన్నిసార్లు ఇది పనిచేయదు; మరింత కఠినమైన చర్యలు తీసుకోవలసి ఉంటుంది.  ఆ “మరింత కఠినమైన చర్యలు” ఏమిటి?  అదుపులేని కోపం, ప్రతీకారంతో కేకలు వేయడం సమాధానం కాదు.  కరుణ, ప్రేమల నుండి వచ్చే పవిత్రమైన ఆగ్రహమే దీనికి కీలకం కావచ్చు.  ఇది తీవ్రమైన మందలింపు లేదా శిక్ష రూపంలో ఉండవచ్చు.  లేదా, సత్యాన్ని దృఢంగా తెలియజేసి, కొన్ని చర్యల పర్యవసానాలను స్పష్టంగా వివరించే రూపంలో ఉండవచ్చు.  ఇది కూడా ప్రేమేననీ, యేసు చర్యలను అనుసరించడమేననీ గుర్తుంచుకోండి.  దీనినే మనం సాధారణంగా “కఠినమైన ప్రేమ” అని పిలుస్తాము.

యేసు మందలింపు మీకు అవసరమా కాదా అని ఈ రోజు ధ్యానించండి.  అవసరమైతే, ప్రేమతో కూడిన ఈ సువార్తను మీ హృదయంలో లోతుగా నాటుకోనివ్వండి.  ఇతరుల తప్పులను సరిదిద్దడంలో మీకున్న బాధ్యత గురించి కూడా ధ్యానించండి.  స్పష్టమైన మందలింపు రూపంలో వచ్చే దైవప్రేమ కార్యాన్ని చేయడానికి భయపడకండి.  మీరు ప్రేమించేవారు దేవుణ్ణి మరింతగా ప్రేమించడానికి సహాయపడే కీలకమైన మార్గం ఇదే కావచ్చు.

ప్రగాఢమైన ప్రేమగల నా ప్రభువా, నా పాపానికి ప్రతిరోజూ పశ్చాత్తాపపడేందుకు నాకు సహాయం చేయుము.  ఇతరులు పశ్చాత్తాపపడేందుకు ఒక సాధనంగా ఉండటానికి నాకు సహాయం చేయుము.  నేను ఎల్లప్పుడూ నీ మాటలను ప్రేమతో స్వీకరించి, అత్యంత ఫలవంతమైన ప్రేమరూపంలో వాటిని ఇతరులకు అందించుదును గాక.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

ప్రత్యేక చిత్రం: జేమ్స్ టిస్సో, ప్రజా వినియోగానికి ఉచితం, వికీమీడియా కామన్స్ ద్వారా