తెలుగు

ద్వేషం మిగిల్చే విషాద ఫలం

జూలై 30, 2022
సామాన్య కాలంలో పదిహేడవ వారపు శనివారం
నేటి పఠనాలు

పునీత పేతురు క్రిసోలోగుస్, పీఠాధిపతి మరియు వేదపారంగతుడు—ఐచ్ఛిక స్మరణ

వీడియో

ఆంగ్లంలో వినండి

“బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ ఒక పళ్లెంలో నాకు ఇప్పించండి.”  మత్తయి 14:8

కనీసం చెప్పాలంటే, అదెంత దుర్దినం!  హెరోదియ కుమార్తె సలోమీ కోరిక మేరకు పునీత బాప్తిస్మ యోహాను శిరచ్ఛేదం చేయబడ్డారు.  హేరోదు వివాహం గురించి ఆయనకు సత్యం చెప్పినందుకు యోహాను చెరసాలలో ఉన్నారు; హెరోదియ హృదయం యోహాను పట్ల ద్వేషంతో నిండిపోయింది.  అందుకే హెరోదియ తన కుమార్తెతో హేరోదు, ఆయన అతిథుల సమక్షంలో నాట్యం చేయించింది.  హేరోదు ఎంతగానో ముగ్ధుడై, తన రాజ్యంలో సగం వరకైనా సలోమీకి ఇస్తానని వాగ్దానం చేశాడు.  అయితే, ఆమె కోరింది మాత్రం బాప్తిస్మ యోహాను తలనే.

పైకి చూసినా ఇది ఒక విచిత్రమైన కోరిక. సలోమేకి రాజ్యంలో సగం వరకైనా ఇస్తానని వాగ్దానం చేయబడింది. కానీ దానికి బదులుగా ఆమె ఒక సజ్జనుడూ పవిత్రుడూ అయిన వ్యక్తి మరణాన్ని కోరింది. నిజానికి, స్త్రీలకు పుట్టినవారిలో యోహాను కంటే గొప్పవారు ఎవరూ లేరని యేసు చెప్పారు. మరి హేరోదియాకు, ఆమె కుమార్తెకు ఇంత ద్వేషం ఎందుకు?

ఈ విషాద సంఘటన కోపం పరాకాష్ఠకు చేరినప్పుడు దాని శక్తి ఎలా ఉంటుందో చూపిస్తుంది. కోపం లోలోపల రగులుతూ పెరిగినప్పుడు తీవ్రమైన ఆవేశాన్ని కలిగిస్తుంది. ఎంతగా అంటే, అది వ్యక్తి ఆలోచనను, వివేచనను మసకబారుస్తుంది. ద్వేషం, ప్రతీకారం ఒక వ్యక్తిని పూర్తిగా ఆవహించి, సంపూర్ణ అవివేకానికి దారితీయవచ్చు. 

ఇక్కడ హేరోదు కూడా తీవ్రమైన అవివేకానికి ఒక ఉదాహరణగా నిలుస్తాడు. సరైన పని చేయడానికి భయపడటం వల్ల, తనకు ఇష్టం లేని పనిని చేయాలనే ఒత్తిడికి అతడు లోనవుతాడు. హేరోదియా హృదయంలోని ద్వేషానికి అతడు లొంగిపోతాడు. ఫలితంగా, నిజానికి తాను ఇష్టపడుతున్నట్లు కనిపించిన, ఎవరి మాటలు వినడానికి సంతోషించేవాడో ఆ యోహానునే చంపించడానికి ఒప్పుకుంటాడు.

సాధారణంగా మనం ఇతరుల మంచి ఆదర్శం నుంచి ప్రేరణ పొందాలని కోరుకుంటాం. కానీ ఈ సందర్భంలో, మనం వేరొక విధంగా “ప్రేరణ” పొందవచ్చని గ్రహిస్తాం. యోహాను వధ మనకు చూపించే దానిని, కోపం, మనస్తాపం, ముఖ్యంగా ద్వేషంతో మనం పడుతున్న పోరాటాలను పరిశీలించుకునే అవకాశంగా ఉపయోగించుకోవాలి. ద్వేషం ఒక వికృతమైన ఆవేశం. అది మనకు తెలియకుండానే చొరబడి, మన జీవితాల్లోనూ ఇతరుల జీవితాల్లోనూ ఎంతో విధ్వంసం కలిగించగలదు. ఈ అస్తవ్యస్తమైన ఆవేశపు తొలి ఛాయలను సైతం పాపసంకీర్తనలో ఒప్పుకొని అధిగమించాలి.

ఈ రోజు మీ హృదయంలో ఏదైనా ద్వేషం కనిపిస్తోందేమో ధ్యానించండి. తొలగిపోని పగను గానీ చేదు భావాన్ని గానీ మీరు పట్టుకొని ఉన్నారా? ఆ ఆవేశం పెరుగుతూ మీ జీవితానికీ ఇతరుల జీవితాలకూ హాని కలిగిస్తోందా? అలా అయితే, దానిని విడిచిపెట్టి క్షమించాలని నిశ్చయించుకోండి. చేయవలసిన సరైన పని అదే.

నాకు విముక్తిని ప్రసాదించే నా ప్రభువా, నా హృదయంలోకి తొంగిచూసి, అందులో కోపం, మనస్తాపం, ద్వేషం వంటి ధోరణులు ఏవైనా ఉంటే వాటిని గుర్తించడానికి కావలసిన కృపను నాకు దయచేయి.  దయచేసి వీటినుండి నన్ను శుద్ధిచేసి, నాకు విముక్తిని ప్రసాదించు.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

జూలై 31, ఆదివారం నుండి ప్రారంభం:

సామాన్యకాలం: 18-34 వారాలు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

నేటి పునీతుడు: పునీత పేతురు క్రిసోలోగస్

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

ప్రధాన చిత్రం: కారవాజ్యో, సార్వజనిక స్వామ్యంలోనిది, వికీమీడియా కామన్స్ ద్వారా