తెలుగు

అందరికీ కృపాపరిపూర్ణతను కోరుకోవడం

సెప్టెంబర్ 24, 2023
సామాన్య కాలపు ఇరవై ఐదవ ఆదివారం (సంవత్సరం ఎ)
నేటి పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

“సాయంకాలమైనప్పుడు ద్రాక్షతోట యజమాని తన పర్యవేక్షకునితో, ‘కూలివారిని పిలిచి, చివరిగా వచ్చినవారితో మొదలుపెట్టి మొదట వచ్చినవారి వరకు వారికి కూలి చెల్లించు’ అని చెప్పాడు. సాయంత్రం సుమారు ఐదు గంటలకు పని మొదలుపెట్టినవారు వచ్చినప్పుడు, ఒక్కొక్కరికి సాధారణంగా ఇచ్చే ఒక రోజు కూలి లభించింది. మొదట వచ్చినవారు తమకు ఎక్కువ వస్తుందని అనుకున్నారు; కాని వారిలో ఒక్కొక్కరికి కూడా సాధారణ కూలియే లభించింది.” మత్తయి 20:8–10

జీవితంలో ఎల్లప్పుడూ న్యాయమే జరుగుతుందా? అలా జరగదనే అనిపిస్తుంది. మనకు మోసం జరిగిందని అనిపించిన పరిస్థితులను జీవితంలో మనమందరం ఎదుర్కొన్నాము. ఈ విషయంలో పిల్లలు మరింత సున్నితంగా ఉంటారు; తమకు అన్యాయం జరిగిందని అనిపించినప్పుడు తరచూ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తారు. లౌకిక దృక్కోణం నుంచి చూస్తే, జీవితంలో ఎల్లప్పుడూ న్యాయం జరగదనేది నిజమే. కాని మనం లౌకిక దృక్కోణాన్ని అనుసరించి జీవించకూడదు. దైవిక దృక్కోణానికి అనుగుణంగా జీవించడానికి మనం పిలువబడ్డాము. ఆ దృక్కోణం నుంచి చూస్తే, చివరికి అంతా న్యాయంగానే జరుగుతుంది; ప్రతి ఒక్కరికీ నిజమైన న్యాయం చేకూరుతుంది.

జీవితంలో న్యాయం జరుగుతుందా లేదా అనే ప్రశ్నను పరిశీలించేటప్పుడు, మనం ఎల్లప్పుడూ దేవుని కుమారునితోనే ప్రారంభించాలి. యేసు పట్ల ఖచ్చితంగా న్యాయంగా ప్రవర్తించలేదు. నిజానికి, కనీసం లౌకిక దృక్కోణం నుంచి చూస్తే, ఇప్పటివరకు జీవించిన వారిలో యేసుకన్నా ఎక్కువ అన్యాయానికి గురైనవారు ఎవరైనా ఉన్నారని నిర్ధారించడం కష్టం. ఆయన అన్ని విధాలా పరిపూర్ణుడు. తన జీవితమంతటా ప్రతి ఒక్కరి పట్ల పరిపూర్ణ సద్గుణంతో ప్రవర్తించాడు. ఆయన ఎన్నడూ అబద్ధం చెప్పలేదు, మోసం చేయలేదు, దొంగతనం చేయలేదు; ఇలాంటి చెడు పనులేవీ చేయలేదు. అయినా ఆయనకు ఏమి జరిగిందో మనందరికీ తెలుసు. ఆయనపై తప్పుడు ఆరోపణలు మోపారు, నిజాయితీ లేకుండా తీర్పు తీర్చారు, క్రూరంగా హింసించారు, సిలువపై హత్య చేశారు. లౌకిక దృక్కోణం నుంచి చూస్తే, ఇది న్యాయం కాదని స్పష్టమవుతుంది.

మన జీవితాన్ని గానీ, యేసు జీవితాన్ని గానీ లౌకిక న్యాయ దృక్కోణం నుంచి అంచనా వేయకూడదు. ఇతరుల పట్ల అన్యాయంగా ప్రవర్తించడానికి దేవుని చిత్తం అనుమతిస్తుందని దీని అర్థం కాదు. న్యాయంగా ప్రవర్తించడం మనలో ప్రతి ఒక్కరి కనీస నైతిక బాధ్యత. అయితే, లౌకిక న్యాయాన్ని మించి, అలౌకిక కృప అనే నూతన ప్రమాణం ప్రకారం జీవించడానికి కూడా మనం పిలువబడ్డాము. ఆ దృక్కోణం నుంచి చూస్తే, యేసు శ్రమలు, మరణం విషాదకరం కాదు; అవి మహిమాన్వితమైనవి. ఆయన సిలువ అన్యాయానికి సాధనం కాదు; అది ఆయన తన నూతన రాజ్యాన్ని స్థాపించిన సింహాసనం. కృపను పరిగణనలోకి తీసుకున్నప్పుడు, అన్యాయంగా కనిపించేదంతా పూర్తిగా తారుమారవుతుంది; దానిని భిన్నమైన దృక్కోణం నుంచి చూడవలసి ఉంటుంది.

నేడు మనం చదివే ఉపమానం, తనవైపు తిరిగే వారందరికీ తన కృపను, కరుణను సమృద్ధిగా ప్రసాదించాలని దేవుడు ఎంచుకున్న తీరును మన ముందుంచుతుంది. ఆయన కరుణను పొందే హక్కును మనం ఎన్నటికీ సంపాదించుకోలేము. మనం ఏమి చేసినా, నిత్యరక్షణ అనే వరాన్ని పొందే హక్కు మనకు కలగదు. అందువల్ల, పరలోకాన్ని, ఈ భూమిపై కృపాజీవితాన్ని “వరం” అనే దృక్కోణం నుంచి చూడాలని ఈ ఉపమానం మనకు ప్రత్యేకంగా సవాలు చేస్తుంది. సమస్తమూ దేవుని వరమే. పాపజీవితం గడిపి, జీవితాంతంలో మనం పరివర్తన చెందినా, లేదా జీవితమంతా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే అంకితం చేసినా, చివరికి అంతా వరమే, అంతా కృపే. 

దేవుని మంచితనాన్ని, అనంతమైన ఔదార్యాన్ని గ్రహించినప్పుడే అసూయ, స్వార్థం వైపు లాగే శోధనలను మనం అధిగమించగలుగుతాము. తమ జీవితమంతటినీ దేవుని ప్రేమకు అంకితం చేసినవారు, వారిది దేవునిపట్ల నిజమైన ప్రేమ, సేవ అయితే, వాటి ఫలితంగా దేవుని మనస్సు, హృదయాల దృక్కోణాన్ని అలవరచుకుంటారు. తనవైపు తిరిగే ప్రతి ఒక్కరికీ దేవుని అనంత కృపను, కరుణను ఉదారంగా ప్రసాదించాలనే తపన ఆ దృక్కోణంలో ఒక భాగం. జీవితంలో ఎంతో బాధకు కారణమైన, పాపంలో పూర్తిగా మొండిబారిపోయిన వ్యక్తి సైతం పశ్చాత్తాపపడి దేవునివైపు తిరిగితే, దేవుని కృపాపరిపూర్ణతను పొందగలరు. ఇదే మన కోరిక కావాలి. చివరి గంటలో కూలివారు వచ్చినప్పుడు సంతోషించి, వారికి ఉదారంగా ఒక రోజంతటి కూలిని ఇచ్చే ఈ ఉపమానంలోని తోట యజమానిలా మనం ఉండాలి. ఇది దైవిక దృక్కోణం నుంచి న్యాయమైనది మాత్రమే కాదు; జీవితంలో మనం శ్రమిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు మన వ్యక్తిగత కోరికగా కూడా మారాలి.

ఇంకా తమ జీవితాలను దేవునికి అర్పించనివారు ఆయన వద్దకు వచ్చి కృపాపరిపూర్ణతను పొందాలని మీరు ఎంత గాఢంగా కోరుకుంటున్నారో నేడు ధ్యానించండి. ఈ ఉపమానం నేపథ్యంలో వారిని చూడండి. దేవుని సేవను ఇంకా ప్రారంభించని ఆ కూలివారి గురించి మీకు ఎలా అనిపిస్తుందో పరిశీలించుకోండి. అలాగే, దేవుని కృపాపరిపూర్ణతకు అనర్హులుగా కనిపించేవారి పట్ల మీ భావాలను కూడా పరిశీలించుకోండి. మీలో అసూయ ఉన్నట్లు గానీ, లౌకిక న్యాయ దృక్కోణంతో ఇతరులకు తీర్పు తీరుస్తున్నట్లు గానీ మీరు గుర్తిస్తే, ఆ దృక్కోణాన్ని తొలగించుకోవడానికి కృషి చేయండి. అప్పుడు ఈ లోకంలోని ప్రతి ఒక్కరూ పశ్చాత్తాప హృదయంతో దేవునివైపు తిరిగినప్పుడు, ఆయన వారికి కరుణాపరిపూర్ణతను ప్రసాదించడాన్ని చూడటమే మీ హృదయపు అత్యంత గాఢమైన కోరిక అవుతుంది.

అత్యంత కరుణామయుడవైన ప్రభువా, నీ ఔదార్యం అవగాహనకు అందనిది. తమ పాపాన్ని విడిచి నీ వైపు తిరిగి, నీ పవిత్ర చిత్తాన్ని నెరవేర్చడానికి కృషిచేసేవారిపై నీవు కరుణను కురిపిస్తావు. నీ ద్రాక్షతోటలో శ్రమించేవారిలో నేనూ ఉండేలా చేయి. నీ కృపా పరిపూర్ణతను పొందాలనే ఆహ్వానాన్ని అందరూ స్వీకరించాలని కోరుకునేవారిలో కూడా నేనూ ఉండేలా చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

లిసియెకు చెందిన పునీత తెరేస్‌కు నవదిన ప్రార్థన: సెప్టెంబర్ 22-30
మూడవ రోజు- సెప్టెంబర్ 24

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన చూపిన చిత్రాలు: ద్రాక్షతోటలోని కూలీల ఉపమానం — రెంబ్రాంట్ చిత్రణ, వికీమీడియా కామన్స్ ద్వారా