తెలుగు

ఎడారిలో క్రీస్తును కలుసుకోవడం

డిసెంబరు 17, 2023
ఆగమనకాల మూడవ ఆదివారం (సంవత్సరం B)
నేటి పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

“యెషయా ప్రవక్త చెప్పినట్లుగా, నేను ఎడారిలో, ‘ప్రభువు మార్గాన్ని సరళం చేయండి,’ అని ఎలుగెత్తి పలికే వ్యక్తి స్వరాన్ని.” యోహాను 1:23

పై వాక్యభాగంలో, పవిత్ర స్నాపక యోహాను యెషయా 40:3ను ఉటంకిస్తున్నారు: “ఒక స్వరం ప్రకటిస్తోంది: ఎడారిలో ప్రభువుకు మార్గాన్ని సిద్ధం చేయండి! బంజరుభూమిలో మన దేవుని కోసం ఒక రాజమార్గాన్ని సరళం చేయండి!” బబులోనుకు ప్రవాసులుగా తీసుకువెళ్లబడిన యూదులు తిరిగి యెరూషలేముకు రావడం గురించి యెషయా పలికిన ప్రవచనం ఇది. సాధారణంగా ప్రజలు మెసొపొటేమియా నుండి ఇశ్రాయేలుకు నీరు సమృద్ధిగా లభించే మార్గాల గుండా ప్రయాణించేవారు. ఆ మార్గాలు ఎడారికంటే సురక్షితంగా ఉండేవి; ప్రయాణానికి అవసరమైన ఆహారం, నీరు అక్కడ లభించేవి. అయితే యూద ప్రవాసులు అతి తక్కువ దూరమున్న మార్గంలో—నేరుగా ఎడారి గుండా—ప్రయాణిస్తారని, ఆ ప్రయాణంలో దేవుడు వారి అవసరాలను తీరుస్తారని యెషయా ప్రవచించారు. అలాంటి ప్రయాణానికి దేవుని పరిపాలనపై ఎంతో నమ్మకం అవసరం.

స్నాపక యోహాను యెషయాను ఉటంకిస్తూ, ఈ ప్రవచనాన్ని తనకు అన్వయించుకుంటున్నారు. ఎడారిలో ఎలుగెత్తి పిలవడానికి, ప్రజలకు నేరుగా మెస్సీయను చూపించడానికి ఆయన పిలువబడ్డారు. వారు తమ రక్షకుణ్ణి కనుగొనేది ఎడారిలోనే.

మొదటిగా, యోహాను “ఎడారిలో” ఎలుగెత్తి పిలుస్తున్నారు. పాపం కారణంగా జీవితంలో ఆధ్యాత్మిక శుష్కతను, దిక్కుతోచని దుస్థితిని, లేమిని, నష్టాన్ని అనుభవించేవారికి ఆయన సందేశం ఉద్దేశించబడింది. దేవుడు తన కృప ద్వారా వారికి ప్రసాదించాలని కోరుకునే ఆధ్యాత్మిక పోషణను పొందలేకపోతున్నవారికే ఆయన పశ్చాత్తాప సందేశం మొదటగా ఉద్దేశించబడింది. జీవితంలో తాము ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితిని వినయంతో గుర్తించి, లోక రక్షకుడు ప్రసాదించే జీవజలం తమకు అవసరమని అంగీకరించేవారిని యోహాను సందేశం ఉద్దేశిస్తోంది.

రెండవదిగా, ఈ కొత్త “సరళమైన” మార్గం, అనేకమంది క్రీస్తు వద్దకు నేరుగా నడిపించే బాటలో నడవడం లేదని సూచిస్తోంది. దానికి బదులుగా, వారు జీవితంలో అనవసరమైన చుట్టుదారులు పడుతున్నారు. క్రీస్తు యేసునందు విశ్వాసానికి చేరుకునేలా, తమ పాపాల గురించి పశ్చాత్తాపపడే సరళమైన, నేరైన మార్గంలోకి అందరినీ పిలిచేదే యోహాను సందేశం.

మూడవదిగా, క్రీస్తును కనుగొనడానికి ఎడారి గుండా నడవాలంటే దేవుని పరిపాలనపై నమ్మకం అవసరం. అలాంటి ప్రయాణానికి ధైర్యం కావాలి. మన అవసరాలన్నింటినీ తీరుస్తానని వాగ్దానం చేసే దేవుని నిరంతర పరిపాలనపై నమ్మకమే కీలకం. తమకు దారి చూపే వ్యక్తిపై నమ్మకం లేకపోతే ఎవరూ నేరుగా ఎడారి గుండా నడవరు.

మీరు పయనిస్తున్న మార్గాన్ని తిరిగి పరిశీలించుకునే సమయమే ఆగమనకాలం. సంతోషాన్ని పొందడానికి మీ సొంత మార్గాన్ని కనుగొనాలని ప్రయత్నిస్తున్నారా? మీ సొంత సామర్థ్యాలపై, మీ సొంత తెలివితేటలపై, భవిష్యత్తు కోసం మీరే వేసుకున్న ప్రణాళికపై నమ్మకం ఉంచుతున్నారా? అలా అయితే, “ఎడారిలో ఎలుగెత్తి పలికే వ్యక్తి స్వరాన్ని” వినండి. ఎడారిలోని నిరాడంబరత వైపు, సమస్త విషయాల పట్ల మరింత అనాసక్తత వైపు, దేవునికి చెందని వాటన్నిటినీ విడిచిపెట్టడం వైపు, మిమ్మల్ని నడిపించే దేవుని పరిపాలనపై మరింత మనఃపూర్వకంగా నమ్మకం ఉంచడం వైపు మిమ్మల్ని పిలుస్తున్న పవిత్ర యోహాను మాటలను వినండి.

ఎడారి నుండి వస్తున్న ఈ పిలుపు గురించి ఈ రోజు ధ్యానించండి; దేవుడు వ్యక్తిగతంగా మీతో పలుకుతున్న సందేశాన్ని వినండి. ఈ ఆగమనకాలంలో మన ప్రభువునందు మరింత లోతైన విశ్వాసానికి ఇంకా త్వరగా, ఇంకా సులభంగా చేరుకునేలా, లోకసంబంధమైన చింతలన్నిటినీ విడిచిపెట్టండి, పాపం గురించి పశ్చాత్తాపపడండి, ఆయనపై నమ్మకం ఉంచండి, ఆయనను కలుసుకోవడానికి బయలుదేరండి.

నా ప్రేమగల ప్రభువా, నా పాపపు చీకటిలోను శుష్కతలోను నీవు నా కోసం వేచి ఉన్నావు. జీవితంలో నేను ఎదుర్కొనే అనేక సవాళ్ల గుండా నన్ను నడిపించడానికి, నాకు దారి చూపడానికి నీవు నా కోసం వేచి ఉన్నావు. నీవు ఎక్కడికి నడిపించినా నిన్ను అనుసరించగలిగేంతగా నీపై నమ్మకం ఉంచడానికి నాకు అవసరమైన ధైర్యాన్ని, జ్ఞానాన్ని దయచేసి ప్రసాదించు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

2024 కోసం కొత్తగా!
ఒక గొప్ప క్రిస్మస్ కానుక…

ఆగమనకాలపు ఓ అంతిఫోనాలు
డిసెంబరు 17–23

పునీత ఆండ్రూ క్రిస్మస్ నవదిన ప్రార్థన
సాంప్రదాయంగా నవంబర్ 30 నుండి క్రిస్మస్ ముందు రోజు వరకు రోజుకు 15 సార్లు ప్రార్థిస్తారు.

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

మా ఆగమనకాల వనరులను చూడండి!

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ప్రదర్శించిన చిత్రం: అలెస్సాండ్రో అల్లోరి చిత్రించిన పవిత్ర స్నాపక యోహాను బోధన, picryl ద్వారా