ఏప్రిల్ 1, 2026
పవిత్ర వారంలోని బుధవారం
నేటి పఠనాలు
బెర్నార్డ్ వాన్ ఓర్లే, CC0, వికీమీడియా కామన్స్ ద్వారా
వీడియో ఆంగ్లంలో వినండి
“నేను మీతో నిశ్చయంగా చెబుతున్నాను, మీలో ఒకరు నాకు ద్రోహం చేస్తారు.” ఈ మాటకు వారు ఎంతో కలతచెంది, ఒకరి తరువాత ఒకరు, “ప్రభూ, అది నేను కాదు కదా?” అని ఆయనను అడగసాగారు. అందుకు ఆయన, “నాతోపాటు పాత్రలో చేయి ముంచినవాడే నాకు ద్రోహం చేస్తాడు” అని జవాబిచ్చారు. మత్తయి 26:21–23
చివరి భోజనం మహిమాన్వితమైన కృపాక్షణమూ, ద్రోహంతో నిండిన బాధాకరమైన క్షణమూ అయింది. ఆ భోజన సమయంలో యేసు దివ్యసత్ప్రసాదాన్ని స్థాపించారు. అది కాలాంతం వరకు ఆయన రక్షణ బలిని కొనసాగించే ఆయన శరీరరక్తాల, ఆత్మదైవత్వాల వరం. ఆ పవిత్ర భోజన సమయంలోనే యేసుకు అత్యంత సన్నిహితులలో ఒకడు ఆయన ఎదుటే అబద్ధమాడి, ముప్పై వెండి నాణేల కోసం ఆయనకు ద్రోహం చేయాలని నిశ్చయించుకున్నాడు.
తోరా ధర్మశాస్త్రం ప్రకారం, ఒక ఎద్దు బానిసను చంపితే, ఆ ఎద్దు యజమాని బానిస యజమానికి ముప్పై వెండి నాణేలు చెల్లించాలి. ఇక్కడ పవిత్రమైన వైరుధ్యం ఏమిటంటే, ప్రజలందరినీ పాపబానిసత్వం నుండి విముక్తులను చేయడానికి యేసు వచ్చినప్పటికీ, యూదా ఒక బానిస ధరకు ఆయనను అప్పగించాడు.
పన్నెండుమందిలో ఒకరు తనకు ద్రోహం చేస్తారని యేసు వారికి తెలియజేసినప్పుడు, ఆయనలో కోపంగానీ తనపై తాను జాలిపడటంగానీ లేవు. ఆయన మాటలు అంగీకారభావం, స్పష్టత, సౌమ్యతలతో కూడిన పవిత్రమైన దుఃఖాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ దుఃఖం త్వరలో తాను అనుభవించబోయే బాధలను గురించిన విచారం మాత్రమే కాదు; తనకు ద్రోహం చేయబోయే వ్యక్తి దారితప్పిన ఆత్మ పట్ల ప్రేమతో కలిగిన దుఃఖం. ఎంతో కలతచెందిన శిష్యులు ఒకరి తరువాత ఒకరు, “ప్రభూ, అది నేను కాదు కదా?” అని అడిగారు.
ఇక్కడ “ప్రభువు” అనే అర్థంలో వాడిన గ్రీకు పదం కిరియోస్, అధికారాన్ని, ఆధిపత్యాన్ని, దైవిక ప్రభుత్త్వాన్ని సూచిస్తుంది. ఈ పదం నూతన నిబంధనలో తరచుగా, ప్రధానంగా యేసును సూచిస్తూ కనిపిస్తుంది. గ్రీకు పాత నిబంధనలో (సెప్తువజింట్), దేవుని పవిత్రమైన, ఉచ్చరించని నామమైన యాహ్వే స్థానంలో కిరియోస్ అనే పదం సుమారు 7,000 సార్లు కనిపిస్తుంది. యేసును కిరియోస్ అని సంబోధించడం ద్వారా, ఆ పదకొండుమంది ఆయనను తమ బోధకునిగా మాత్రమే కాక, మెస్సీయగా, దేవుని కుమారునిగా గుర్తిస్తున్నారు. ఈ బిరుదు యేసు దైవిక అధికారాన్ని అంగీకరిస్తూ, నమ్మకంతోనూ భక్తిగౌరవంతోనూ కూడిన సంబంధాన్ని వ్యక్తపరుస్తుంది.
యూదా మాట్లాడినప్పుడు, కిరియోస్ బదులుగా రబ్బీ అనే పదాన్ని వాడాడు—“రబ్బీ, అది నేను కాదు కదా?”—ఇది “బోధకుడు” అనే అర్థమున్న హీబ్రూ, అరమేయ పదానికి లిప్యంతరీకరణ. ఈ సంబోధనలో గౌరవం ఉన్నప్పటికీ, యేసును కిరియోస్గా గుర్తించే స్థాయికి అది చేరదు. ఆయనను ప్రభువుగా, మెస్సీయగా, దేవునిగా కాక, మానవ బోధకునిగా మాత్రమే చూస్తుంది. ఈ తేడా సూక్ష్మమైనదే అయినా ముఖ్యమైనది. ఈ సంభాషణ చివరి భోజనంలో—అంటే మొదటి దివ్యబలిపూజలో—జరిగింది కాబట్టి, దివ్యబలిపూజలో మనం యేసును ఎలా సమీపిస్తున్నామో ఆలోచించమని ఇది మనల్ని ఆహ్వానిస్తుంది. మనం యూదా మనోభావంతో, ఆయనను కేవలం లౌకిక దృష్టితోనే గుర్తిస్తూ సమీపిస్తున్నామా? లేక ఇతర శిష్యుల విశ్వాసంతో, ఆయనను ప్రభువుగా చూస్తూ సమీపిస్తున్నామా?
యూదా యేసును ద్వేషించలేదు. ఆయన మరణాన్ని కోరుకున్న పరిసయ్యులలా కాకుండా, యూదా తన ద్రోహానికి విచారించాడు, ముప్పై వెండి నాణేలను తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించాడు, విషాదకరంగా “వెళ్లి ఉరి వేసుకున్నాడు” (మత్తయి 27:3–5). యేసు మానవత్వాన్ని దాటి ఆయన దైవత్వాన్ని గుర్తించలేకపోవడమే అతని అతి పెద్ద వైఫల్యం. అతని దృష్టి తనపైనే—ముఖ్యంగా తన దురాశపైనా స్వార్థపూరిత కోరికలపైనా—నిలిచిపోయింది. అదేవిధంగా, విశ్వాసం, ఆత్మసమర్పణ, ఆరాధన లేకుండా మనం దివ్యసత్ప్రసాదాన్ని సమీపించినప్పుడు, క్రీస్తుకంటే మనపైనే ఎక్కువ దృష్టి పెట్టే యూదా పొరపాటులో పడే ప్రమాదం ఉంది.
దివ్యబలిపూజలో మనం “ప్రభూ, కనికరించు” అంటామే గానీ, “రబ్బీ, కనికరించు” అనము. మనకు కారుణ్యం అవసరమనీ, దానికి మూలం దేవుడేననీ గుర్తిస్తూ, ఈ ప్రార్థన మన హృదయాంతరాళం నుండి రావాలి. ప్రతిష్ఠాపన సమయంలో మనం మోకరిల్లినప్పుడు, మన హృదయాలు “నా ప్రభువా, నా దేవా!” అని ఎలుగెత్తాలి. అయినా, దివ్యబలిపూజ తరువాత మనం చేయబోయే పనుల గురించి ఆలోచిస్తూ ఎన్నిసార్లు పరధ్యానంలో పడిపోతున్నాం? విశ్వాసంతోనూ భక్తిగౌరవంతోనూ యేసును సమీపించడాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు, ఆయన నిజంగా ఎవరై ఉన్నారో—మన ప్రభువూ మన దేవుడూ—అలా ఆయనను కలుసుకునే అవకాశాన్ని కోల్పోతాం.
మీరు దివ్యబలిపూజలో ఎలా పాల్గొంటున్నారో ఈ రోజు ధ్యానించండి. మీరు పాల్గొనే ప్రతి దివ్యబలిపూజను చివరి భోజన క్షణంతో అనుసంధానిస్తూ, ఆ భోజనంలో మీరు కూడా ఉన్నట్లు భావించండి. రొట్టె, ద్రాక్షారసాల బాహ్యరూపాలను దాటి మీ ప్రభువును కలుసుకుంటూ, ప్రేమతో, భక్తితో, గౌరవంతో యేసును స్వీకరించగలిగేలా ప్రార్థించండి.
నా ప్రభువా, నా దేవా, నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నీ కారుణ్యంపై ఆశ ఉంచుతున్నాను, నా పూర్ణహృదయంతో నిన్ను ప్రేమిస్తున్నాను. ముఖ్యంగా నేను దివ్యబలిపూజలో పాల్గొనే ప్రతిసారీ, నీ సన్నిధిపై గాఢమైన విశ్వాసంతో నన్ను నింపు. నాకు నీవు అవసరమని గుర్తించి, నీ కారుణ్యానికీ ప్రేమకూ నన్ను నేను పూర్తిగా సమర్పించుకునేలా అనుగ్రహించు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
ముప్పై ఏడవ రోజు ధ్యానాలు:
ఎడారిలో 40 రోజులు & సిలువ చెంత 40 రోజులు
తపస్సు కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు




