తెలుగు

ఇతరులలో క్రీస్తుకు సేవ చేయడం

మార్చి 2, 2020
తపస్సుకాలం మొదటి వారంలోని సోమవారం
నేటి పఠనాలు

ఆంగ్లంలో వినండి

“నిశ్చయంగా నేను మీతో చెబుతున్నాను, అల్పులైన ఈ నా సోదరులలో ఒకరికి మీరు ఏది చేసినా, అది నాకు చేసినట్లే.”  మత్తయి 25:40

ఆ “అల్పుడైన సోదరుడు” ఎవరు?  యేసు ప్రజలందరినీ చేర్చే సాధారణ ప్రకటన చేయకుండా, అల్పునిగా పరిగణించబడే వ్యక్తిని ప్రత్యేకంగా సూచించడం ఆసక్తికరం.  “మీరు ఇతరులకు ఏది చేసినా…” అని ఎందుకు అనలేదు?  అలా అంటే మనం సేవ చేసే వారందరూ అందులో ఉంటారు.  కానీ యేసు అలా కాకుండా అల్పుడైన సోదరుణ్ణి సూచించారు.  బహుశా దీనిని ప్రత్యేకించి అత్యంత పాపాత్ములుగా ఉన్నవారు, అత్యంత బలహీనులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, అశక్తులు, ఆకలితో ఉన్నవారు, నిరాశ్రయులు, ఈ జీవితంలో తీవ్రమైన అవసరాలు ఉన్నవారందరినీ సూచించేదిగా అర్థం చేసుకోవాలి.

ఈ వాక్యంలో అత్యంత సుందరంగా, హృదయాన్ని హత్తుకునే అంశం ఏమిటంటే, యేసు అవసరంలో ఉన్న వ్యక్తితో, అందరిలోకెల్లా “అల్పుడైన” వ్యక్తితో తనను తాను ఏకం చేసుకుంటారు.  ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి సేవ చేయడం ద్వారా మనం యేసుకు సేవ చేస్తున్నాం.  అయితే ఆయన అలా చెప్పగలగాలంటే, ఈ ప్రజలతో ఆయనకు గాఢమైన ఐక్యత ఉండాలి.  వారితో తనకున్న అంతటి గాఢమైన అనుబంధాన్ని చూపడం ద్వారా, వ్యక్తులుగా వారికున్న అనంతమైన గౌరవాన్ని యేసు వెల్లడిస్తున్నారు.

ఇది గ్రహించవలసిన ఎంతో ముఖ్యమైన విషయం!  నిజానికి, పునీత రెండవ జాన్ పాల్ పాపుగారు, పదహారవ బెనెడిక్ట్ పాపుగారు, ముఖ్యంగా ఫ్రాన్సిస్ పాపుగారు నిరంతరం అందించిన బోధనలలో ఇది ఒక ప్రధాన అంశంగా ఉంది.  వ్యక్తి గౌరవం, విలువలపై నిరంతరం దృష్టి నిలపాలనే ఆహ్వానమే ఈ వచనభాగం నుండి మనం స్వీకరించే ప్రధాన సందేశంగా ఉండాలి.  

ఈ రోజు ప్రతి ఒక్క వ్యక్తి గౌరవాన్ని గురించి ధ్యానించండి.  మీరు సంపూర్ణ గౌరవంతో చూడలేకపోతున్న వారెవరైనా ఉంటే, వారిని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి.  మీరు ఎవరిని చిన్నచూపు చూస్తూ, వారి పట్ల విసుగ్గా కళ్లను తిప్పుతారు?  మీరు ఎవరికి తీర్పు తీరుస్తారు లేదా ఎవరిని తృణీకరిస్తారు?  ఇతరులందరికంటే ఎక్కువగా, ఈ వ్యక్తిలోనే యేసు మీ కోసం వేచి ఉన్నారు.  బలహీనులలోను, పాపులలోను మిమ్మల్ని కలుసుకోవాలని, వారిలో మీరు తనను ప్రేమించాలని ఆయన వేచి ఉన్నారు.  వారి గౌరవాన్ని గురించి ధ్యానించండి.  మీ జీవితంలో ఈ వర్ణనకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తిని గుర్తించి, వారిని ప్రేమించడానికి, వారికి సేవ చేయడానికి నిబద్ధులవండి.  ఎందుకంటే వారిలో మీరు మన ప్రభువును ప్రేమించి, ఆయనకు సేవ చేస్తారు.

ప్రియ ప్రభువా, బలహీనులలో అత్యంత బలహీనులలోను, పేదలలో నిరుపేదలలోను, మా మధ్య ఉన్న పాపులలోను నీవు మరుగైన రూపంలో ఉన్నావని నేను నిజంగా గ్రహించి విశ్వసిస్తున్నాను.  నేను కలుసుకునే ప్రతి ఒక్కరిలోను, ముఖ్యంగా అత్యంత అవసరంలో ఉన్నవారిలో నిన్ను శ్రద్ధగా వెదకడానికి నాకు సహాయం చేయుము.  నేను నిన్ను కనుగొన్నప్పుడు, నా పూర్ణహృదయంతో నిన్ను ప్రేమించి, నీకు సేవ చేయుదును గాక.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

సిలువ పాదాల చెంత 40 రోజులు – ఐదవ ధ్యానం – సంపూర్ణ సమర్పణ

తపస్సుకాలం కోసం వనరులు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు


తపస్సుకాలం కోసం మూడు గొప్ప పుస్తకాలు
ఆన్‌లైన్‌లో ఉచితంగా చదవవచ్చు. ఈ-పుస్తక రూపంలోనూ & కాగితపు అట్టతో ముద్రిత రూపంలోనూ లభిస్తాయి.

తపస్సుకాల, పాస్కా ధ్యానాలు
దైనందిన కతోలిక ధ్యానాలు ధారావాహిక

సిలువ పాదాల చెంత 40 రోజులు
మన ధన్యమాత హృదయం నుండి ప్రేమపూర్వక దృష్టి

దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు
పవిత్ర ఫౌస్టీనాతో 365 రోజులు

తపస్సుకాలం కోసం మరిన్ని పుస్తకాలను చూడండి