తెలుగు

ఉపవాసం చేయాలా వద్దా

జనవరి 18, 2021
సామాన్య కాలపు రెండవ వారంలోని సోమవారం
నేటి పఠనాలు

ఆంగ్లంలో వినండి

“పెండ్లికుమారుడు తమతో ఉన్నంతవరకు పెండ్లి అతిథులు ఉపవాసం చేయగలరా? పెండ్లికుమారుడు తమతో ఉన్నంతవరకు వారు ఉపవాసం చేయలేరు. అయితే పెండ్లికుమారుడు వారి నుండి తీసికొనిపోబడే రోజులు వస్తాయి; అప్పుడు ఆ రోజున వారు ఉపవాసం చేస్తారు. మార్కు 2:19–20

ఉపవాసం గురించి యేసును ప్రశ్నించిన స్నాపక యోహాను శిష్యులకు, కొందరు పరిసయ్యులకు ఆయన ఇచ్చిన సమాధానాన్ని పై వాక్యభాగం వెల్లడిస్తుంది. యోహాను శిష్యులు, పరిసయ్యులు ఉపవాసానికి సంబంధించిన యూదుల నియమాలను పాటిస్తున్నారని, కానీ యేసు శిష్యులు పాటించడం లేదని వారు ఎత్తిచూపుతారు. యేసు సమాధానం ఉపవాసానికి సంబంధించిన నూతన నియమపు మౌలిక భావాన్ని తెలియజేస్తుంది.

ఉపవాసం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన. అది క్రమరహితమైన శారీరక శోధనలను ఎదిరించడానికి సంకల్పాన్ని బలపరుస్తుంది; ఆత్మను పవిత్రపరచడానికి తోడ్పడుతుంది. అయితే ఉపవాసం శాశ్వతంగా ఉండేది కాదని గుర్తించాలి. ఒకరోజు పరలోకంలో మనం దేవుణ్ణి ముఖాముఖిగా దర్శించేటప్పుడు, ఉపవాసం చేయాల్సిన అవసరంగానీ, ఏ విధమైన ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరంగానీ ఇక ఉండదు. కానీ భూమిపై ఉన్నంతకాలం మనం పోరాడతాం, పడిపోతాం, దారి తప్పుతాం. క్రీస్తు వద్దకు తిరిగి రావడానికి మనకు తోడ్పడే అత్యుత్తమ ఆధ్యాత్మిక సాధనల్లో ప్రార్థనతో కూడిన ఉపవాసం ఒకటి.

“పెండ్లికుమారుడు తీసికొనిపోబడినప్పుడు” ఉపవాసం అవసరమవుతుంది. మరో మాటలో చెప్పాలంటే, మనం పాపం చేసి, క్రీస్తుతో మన ఐక్యత సన్నగిల్లడం మొదలైనప్పుడు ఉపవాసం అవసరం. అటువంటి సమయంలో ఉపవాసం అనే వ్యక్తిగత త్యాగం మన హృదయాలను మరోసారి మన ప్రభువుకు తెరవడానికి తోడ్పడుతుంది. పాపపు అలవాట్లు ఏర్పడి లోతుగా పాతుకుపోయినప్పుడు ఇది మరింత నిజం. ఉపవాసం మన ప్రార్థనకు ఎంతో శక్తిని చేకూరుస్తుంది. దేవుని కృప అనే “నూతన ద్రాక్షారసం” మనకు అత్యంత అవసరమైన చోట దాన్ని స్వీకరించగలిగేలా మన ఆత్మలను విశాలపరుస్తుంది.

ఉపవాసం, ఇతర ప్రాయశ్చిత్త సాధనల పట్ల మీ వైఖరి గురించి ఈరోజు ధ్యానించండి. మీరు ఉపవాసం చేస్తారా? మీ సంకల్పాన్ని బలపరచుకోవడానికి, మరింత సంపూర్ణంగా క్రీస్తువైపు తిరగడానికి క్రమం తప్పకుండా త్యాగాలు చేస్తారా? లేక ఆధ్యాత్మిక మేలు చేకూర్చే ఈ సాధనను మీ జీవితంలో కొంతవరకు నిర్లక్ష్యం చేశారా? ఈ పవిత్ర ప్రయత్నం పట్ల మీ నిబద్ధతను ఈరోజు పునరుద్ధరించుకోండి; అప్పుడు దేవుడు మీ జీవితంలో శక్తివంతంగా కార్యం చేస్తాడు.

ప్రభువా, నీవు నాపై కుమ్మరించాలనుకుంటున్న కృప అనే నూతన ద్రాక్షారసానికి నా హృదయాన్ని తెరుస్తున్నాను. ఈ కృపను స్వీకరించడానికి తగిన అంతరంగ సిద్ధత కలిగివుండేలా, నీకు మరింతగా నా హృదయాన్ని తెరవడానికి అవసరమైన ప్రతి సాధనాన్ని ఉపయోగించుకునేలా నాకు సహాయం చేయి. ముఖ్యంగా, ఉపవాసమనే అద్భుతమైన ఆధ్యాత్మిక సాధనకు కట్టుబడి ఉండటానికి నాకు సహాయం చేయి. నా జీవితంలో ఈ ఇంద్రియ నిగ్రహ కార్యం నీ రాజ్యం కొరకు సమృద్ధిగా ఫలించుగాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ప్రదర్శించిన చిత్రం: గలిలయ సముద్రంపై యేసు, ఆయన శిష్యులు — కార్ల్ ఓస్టర్లీ చిత్రణ