తెలుగు

సంపూర్ణ సత్యాన్ని అన్వేషించడం

మార్చి 10, 2024
తపస్సుకాలపు నాలుగవ ఆదివారం (సంవత్సరం B)
నేటి పఠనాలు

గమనిక: దివ్యబలిపూజలో విశ్వాస పరిశీలన కర్మలు నిర్వహించినప్పుడు, దీనికి బదులుగా సంవత్సరం Aకు సంబంధించిన ధ్యానాన్ని, పఠనాలను ఉపయోగించవచ్చు.

వీడియో

ఆంగ్లంలో వినండి

యేసు నికోదేముతో ఇలా అన్నారు: “మోషే ఎడారిలో సర్పాన్ని పైకెత్తినట్లే, మనుష్యకుమారుడు కూడా పైకెత్తబడాలి. తద్వారా ఆయనను విశ్వసించే ప్రతిఒక్కరూ నిత్యజీవాన్ని పొందుతారు.”  యోహాను 3:14–15

పైన ఉటంకించిన వాక్యంతో, పరిసయ్యుడు, మహాసభ సభ్యుడు అయిన నికోదేముతో యేసు జరిపిన సంభాషణ ముగుస్తుంది. యోహాను సువార్తలో నికోదేము ప్రస్తావన వచ్చే మూడు సందర్భాల్లో ఇది మొదటిది. ఒక మనిషిని దోషిగా తీర్పు తీర్చే ముందు అతని మాట వినాలని మహాసభలోని ఇతర సభ్యులకు గుర్తుచేసే సందర్భంలో అతను రెండవసారి కనిపిస్తాడు. యేసు చంపబడిన తరువాత, ఆయన దేహాన్ని భూస్థాపనకు సిద్ధం చేయడానికి నికోదేము బోళం, అగరు కలిపిన మిశ్రమాన్ని తీసుకువచ్చినది మూడవ సందర్భం.

పరిసయ్యులలో చాలామంది, మహాసభలోనివారు యేసును అంగీకరించలేదు. అందువల్ల, నికోదేము రాత్రివేళ ఆయనతో మాట్లాడటానికి వెళ్లడం సాహసంతో కూడిన పని. అయితే, నికోదేము హృదయంలోని విశ్వాసాన్ని యేసు స్పష్టంగా గుర్తించారు. అందుకే నికోదేము యేసును ఆయన బోధ గురించి అడిగినప్పుడు, యేసు అతనికి సమాధానమిచ్చారు. ఇతర పరిసయ్యులవలె నికోదేము మన ప్రభువును మాటల్లో చిక్కించడానికి ప్రయత్నించలేదు; అతను నిజాయితీగా అర్థం చేసుకోవాలని కోరుకున్నాడు.

యేసుకు, నికోదేముకు మధ్య జరిగిన ఈ సంభాషణ ప్రారంభంలో, నికోదేము ఇలా అంటూ యేసుపట్ల తనలో మొలకెత్తుతున్న విశ్వాసాన్ని ప్రకటిస్తాడు: “రబ్బీ, నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడవని మాకు తెలుసు. ఎందుకంటే దేవుడు తోడుగా ఉంటే తప్ప, నీవు చేస్తున్న ఈ సూచక క్రియలను ఎవరూ చేయలేరు” (యోహాను 3:2). ఆసక్తికరంగా, ఆ తరువాత యేసు నికోదేముతో అలంకారిక భాషలో మాట్లాడుతూ, “పైనుండి జన్మిస్తే”, “నీటి నుండి, ఆత్మ నుండి జన్మిస్తే” మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించగలరని చెబుతారు. నికోదేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ అర్థం చేసుకోలేడు. అప్పుడు యేసు, “నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి కూడా ఇది అర్థం చేసుకోలేవా?” అని అతనిని సున్నితంగా మందలిస్తారు (యోహాను 3:10). ఆ తరువాత యేసు ప్రతీకలు, అలంకారాలతో మరింతగా మాట్లాడుతారు. రాబోయే తన సిలువ మరణం గురించి నిగూఢంగా చెబుతూ, పైన ఉటంకించిన నేటి సువార్త ప్రారంభ వాక్యాలతో ఆ మాటలను ముగిస్తారు.

యేసుకు, నికోదేముకు మధ్య జరిగిన ఈ సంభాషణ నుండి అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది. నికోదేము సరైన మార్గంలో ఉన్నప్పటికీ, సువార్త సంపూర్ణ ప్రకటనను స్వీకరించడానికి ఇంకా సిద్ధంగా లేనందున యేసు ప్రతీకలతో కూడిన నిగూఢ భాషలో మాట్లాడారు. మన ప్రభువు వెల్లడించడానికి వచ్చిన విషయాలన్నిటినీ అతను ఇంకా పూర్తిగా గ్రహించలేకపోయాడు. అందుకే యేసు నిగూఢ భాషలో మాట్లాడుతూ, అందులో దాగి ఉన్న అర్థాన్ని అన్వేషిస్తూనే ఉండమని నికోదేమును ఆహ్వానించారు.

మన జీవితాల్లో కూడా, మనం దేవుని వద్దకు వచ్చి, మన జీవితాల పట్ల తన పరిపూర్ణ చిత్తాన్ని వెల్లడిస్తూ ఆయన మనతో స్పష్టంగా, నిశ్చయంగా మాట్లాడాలని కోరుకోవచ్చు. కానీ తరచూ ఆయన అలా చేయరు. ఎందుకు? ఎందుకంటే సంపూర్ణ సత్యాన్ని స్వీకరించడానికి మనం ఇంకా సిద్ధంగా లేమని దేవునికి తెలుసు. ఆయన మనతో మాట్లాడినప్పుడు, ఏదో ఒక విధంగా మనకు అవగాహన కలిగినప్పుడు, అది మంచిదే; మనం సరైన మార్గంలో ఉన్నామని అది తెలియజేస్తుంది. అయితే సువార్త తన సంపూర్ణతలో మన జీవితాలను మూలాల నుండి మార్చాలని కోరుతుంది, మన నుండి ఎంతో ఆశిస్తుంది. అందువల్ల చాలామంది ఇంకా సంపూర్ణ సత్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి దేవుడు తన కనికరంతో, ఆ సమయంలో మనం స్వీకరించగలిగినంత మాత్రమే మనకు ఇస్తారు. అయితే, మన పరిమితిని తెలియజేసే ఈ సత్యం నికోదేమును ప్రోత్సహించినట్లే మనలనూ ప్రోత్సహించాలి. మనం ప్రయత్నాన్ని విడిచిపెట్టకుండా, దేవుని వాక్కు సంపూర్ణతకు మన హృదయాలను తెరుస్తూనే ఉండాలి.

దేవుని వాక్కు సంపూర్ణతకు మీ హృదయం ఎంతగా తెరచి ఉందో ఈ రోజు ధ్యానించండి. దేవుడు తన పవిత్ర మనస్సులో ఉన్నదంతా, దైవజ్ఞానాన్ని నేరుగా మీకు వ్యక్తిగతంగా వెల్లడించడం ద్వారా తెలియజేస్తే ఏమవుతుంది? దానిని స్వీకరించడం మీ శక్తికి మించినదిగా ఉంటుందా? అవును, అలాగే ఉంటుంది. అయితే, వినయంతో దానిని అంగీకరించడం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక ముఖ్యమైన అడుగు. ఈ రోజు, నిగూఢమైన దేవుని వాక్కు ఎదుట మరింత సంపూర్ణంగా మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. దేవుని సత్యపు స్పష్టత మీ ఆత్మలోకి మరింత సంపూర్ణంగా చొచ్చుకుపోయేలా, మీరు మారుతూనే ఉండాలని, మీ హృదయాన్ని తెరచి ఉంచాలని ప్రార్థించండి.

నాకు బోధించే నా ప్రభువా, నీ పవిత్ర సత్యం ఎంతో లోతైనది, ఎంతో గంభీరమైనది, ఎంతో పరివర్తన కలిగించేది. అందువల్ల దానిని పూర్తిగా గ్రహించి స్వీకరించడం ఇప్పటికీ నా శక్తికి మించినదిగానే ఉంది. ఈ కారణంగా, నీ పట్ల నాకున్న విశ్వాసంలోనూ, నిన్ను గురించిన జ్ఞానంలోనూ నన్ను నిరంతరం మరింత లోతుకు నడిపించడానికి నీవు నాతో నిగూఢమైన విధంగా మాట్లాడుతున్న నీ కరుణకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒకనాడు నీ సత్యాన్ని అత్యంత సంపూర్ణంగా అర్థం చేసుకునేలా, దయచేసి నా మనస్సును, హృదయాన్ని నీకు తెరుస్తూ ఉండు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

తపస్సుకాలపు నాలుగవ ఆదివారానికి ధ్యానం:
ఎడారిలో 40 రోజులు

పునీత యోసేపునకు నవదిన ప్రార్థన. మార్చి 10-18 వరకు ప్రార్థిస్తారు.

తపస్సుకాలం కోసం వనరులు

కార్డినల్ బర్క్‌తో తొమ్మిది నెలల జపమాల నవదిన ప్రార్థన

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

తపస్సు కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ప్రదర్శించిన చిత్రాలు: అలెగ్జాండర్ ఆండ్రేయెవిచ్ ఇవానోవ్ చిత్రించిన యేసు మరియు నికోదేము, వికీపీడియా ద్వారా