ఆగస్టు 3, 2022
సామాన్య కాలపు పద్దెనిమిదవ వారంలోని బుధవారం
నేటి పఠనాలు

ఆంగ్లంలో వినండి
కానీ ఆ స్త్రీ వచ్చి ఆయనకు ప్రణామం చేసి, “ప్రభువా, నాకు సహాయం చేయుము” అని అంది. ఆయన బదులిస్తూ, “పిల్లల ఆహారాన్ని తీసుకొని కుక్కలకు వేయడం సరికాదు” అని అన్నారు. ఆమె, “దయచేయుము ప్రభువా, కుక్కలు కూడా తమ యజమానుల బల్లమీదనుండి పడే ముక్కలను తింటాయి కదా” అని అంది. మత్తయి 15:25-27
ఈ స్త్రీకి సహాయం చేయడం కుక్కలకు ఆహారం వేయడం లాంటిదని యేసు నిజంగానే సూచించారా? మన అహంకారం కారణంగా, యేసు అన్న మాటలకు మనలో చాలామందికి ఎంతో అవమానంగా అనిపించి ఉండేది. కానీ ఆయన చెప్పింది నిజం; అది ఏ విధంగానూ అమర్యాదకరమైనది కాదు. యేసు అమర్యాదగా ప్రవర్తించడం అసాధ్యమని స్పష్టమే. అయినప్పటికీ, ఆయన మాట పైకి అమర్యాదకరంగా కనిపిస్తుంది.
మొదట, ఆయన మాట ఏ విధంగా నిజమో చూద్దాం. ఈ స్త్రీ తన కుమార్తెను స్వస్థపరచడానికి రమ్మని యేసును అడుగుతోంది. యేసు ఆమెతో చెప్పేది ప్రధానంగా ఇదే: ఈ కృపను పొందడానికి ఆమెకు ఏ విధమైన అర్హతా లేదు. అది నిజమే. బల్లమీది ఆహారాన్ని పొందడానికి కుక్కకు అర్హత లేనట్లే, దేవుని కృపను పొందడానికి మనకూ అర్హత లేదు. ఈ విధంగా చెప్పడం దిగ్భ్రాంతి కలిగించినా, మన పాపస్థితిని, అనర్హతను గురించిన సత్యాన్ని ముందుగా స్పష్టం చేయడానికే యేసు ఇలా చెబుతున్నారు. ఆ స్త్రీ దానిని అంగీకరిస్తుంది.
రెండవది, యేసు మాట ఈ స్త్రీకి అత్యంత వినయంతోను విశ్వాసంతోను స్పందించే అవకాశాన్ని ఇస్తుంది. బల్లమీది ఆహారాన్ని తినే కుక్కతో తనను పోల్చడాన్ని ఆమె నిరాకరించకపోవడంలో ఆమె వినయం కనిపిస్తుంది. దానికి బదులుగా, కుక్కలు కూడా పడిన ముక్కలను తింటాయని ఆమె వినయంగా గుర్తుచేస్తుంది. ఆహా, ఎంతటి వినయం! నిజానికి, యేసు ఆమెతో కొంత అవమానకరంగా అనిపించే ఈ విధంగా మాట్లాడటానికి కారణం ఆమె ఎంత వినయంతో ఉందో ఆయనకు తెలియడమేనని మనం నిశ్చయంగా చెప్పవచ్చు. తన విశ్వాసం వెల్లడయ్యేలా ఆమె తన వినయాన్ని ప్రకాశింపజేస్తూ స్పందిస్తుందని కూడా ఆయనకు తెలుసు. తన అనర్హతను వినయంగా అంగీకరింపజేసే ఆ సత్యానికి ఆమె నొచ్చుకోలేదు; బదులుగా, దానిని స్వీకరించింది. తనకు అర్హత లేకపోయినా, దేవుని అపార కారుణ్యాన్ని కూడా వేడుకుంది.
వినయానికి విశ్వాసాన్ని వెలికితీసే శక్తి ఉంది; విశ్వాసం దేవుని కారుణ్యాన్ని, శక్తిని ప్రవహింపజేస్తుంది. చివరికి యేసు అందరికీ వినిపించేలా, “ఓ స్త్రీ, నీ విశ్వాసం గొప్పది!” అని అంటారు. ఆమె విశ్వాసం వెల్లడైంది. ఆ వినయపూర్వకమైన విశ్వాసాన్నిబట్టి ఆమెను గౌరవించడానికి యేసు ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు.
దేవుని ఎదుట మీకున్న వినయం గురించి ఈ రోజు ధ్యానించండి. యేసు మీతో ఈ విధంగా మాట్లాడి ఉంటే మీరు ఎలా స్పందించి ఉండేవారు? మీ అనర్హతను అంగీకరించేంత వినయం మీకు ఉండేదా? అలా ఉంటే, మీకు అర్హత లేకపోయినా దేవుని కారుణ్యం కోసం మొరపెట్టుకునేంత విశ్వాసం కూడా మీకు ఉండేదా? ఈ అద్భుతమైన గుణాలు—వినయం, విశ్వాసం—ఒకదానితో ఒకటి కలిసి సాగుతూ దేవుని కారుణ్యాన్ని ప్రవహింపజేస్తాయి!
నా పరమ దయామయ ప్రభువా, నాకు అర్హత లేదు. దీనిని గ్రహించేందుకు నాకు సహాయపడుము. నా జీవితంలో నీ కృపను పొందే అర్హత నాకు లేదని గ్రహించేందుకు నాకు సహాయపడుము. అయినా, ఆ వినమ్ర సత్యంలో నీ అపార కరుణను కూడా గుర్తించి, కరుణ కోసం నిన్ను వేడుకోవడానికి ఎన్నడూ భయపడకుండా ఉండేలా చేయుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
సామాన్యకాలం: 18-34 వారాలు





