తెలుగు

మరొకరితో సఖ్యపడటం

సెప్టెంబరు 10, 2023
సామాన్య కాలపు ఇరవై మూడవ ఆదివారం, ‘ఎ’ సంవత్సరం
నేటి పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

యేసు తన శిష్యులతో ఇలా అన్నారు: “నీ సోదరుడు నీకు వ్యతిరేకంగా పాపం చేస్తే, నీవు వెళ్లి, మీరిద్దరే ఉన్నప్పుడు అతని తప్పును అతనికి తెలియజేయి. అతడు నీ మాట వింటే, నీవు నీ సోదరుణ్ణి తిరిగి గెలుచుకున్నట్లే.” మత్తయి 18:15

మరొకరు తమ పాపాన్ని గురించి మనం చెప్పేది విని పశ్చాత్తాపపడే విధంగా వారికి దానిని తెలియజేయాలంటే ఎంతో వినయం, నిర్మలమైన హృదయం అవసరం. సాధారణంగా, మరొకరి పాపాన్ని ఎత్తిచూపడం ప్రేమతో కంటే కోపంతోనే ఎక్కువగా జరుగుతుంది. మన మనసు గాయపడిందనే కారణంతోనో, ప్రతీకారంగా వారిలో అపరాధభావాన్ని కలిగించాలనే కోరికతోనో వారి పాపాన్ని ఎత్తిచూపకూడదు. వారిని అవమానించడానికో, వారికి హాని చేయడానికో వారి తప్పును ఎత్తిచూపకూడదు. వారిని ప్రేమిస్తున్నందున, వారిని ఇప్పటికే క్షమించినందున, ఇప్పుడు వారి మేలు కోరి వారు తమ పాపం నుండి విముక్తి పొందాలని ఆశిస్తున్నందున మాత్రమే వారి పాపాన్ని ప్రస్తావించాలి. ఇలా జరిగినప్పుడు, ఇదొక్కటే మన ఉద్దేశంగా ఉన్నప్పుడు, అవతలి వ్యక్తి దిద్దుబాటును మరింత సులభంగా స్వీకరించవచ్చు.

అయితే, ఈ బోధను మనం ఇతరులకు వారి పాపాలను తెలియజేసే దృష్టికోణం నుండి మాత్రమే చూడకూడదు. ఇతరులు మన పాపాలను మనకు తెలియజేసే దృష్టికోణం నుండి కూడా చూడాలి. మనం ప్రతిరోజూ పాపం చేస్తాము. మనం ప్రేమించేవారికి వ్యతిరేకంగా ప్రతిరోజూ పాపం చేస్తాము. కాబట్టి, మీకు సన్నిహితులైన ఎవరైనా మీ పాపాన్ని మీ దృష్టికి తీసుకురావడం గురించి ఆలోచించండి. అలా జరిగినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? బహుశా వారు ఎంతో నిర్మలమైన ఉద్దేశంతో, కనికరంతో అలా చేస్తే మీరు వింటారు. కానీ వారు కోపంతో అలా చేస్తే? ఎవరైనా మీ తప్పును మీకు తెలియజేయడానికి ఇది ఆదర్శమైన పద్ధతి కాకపోయినా, వారు చెప్పేదాన్ని తిరస్కరించే హక్కు అది మీకు ఇవ్వదు. కాబట్టి, మీ పాపం గురించి ఎవరైనా తమ ఆందోళనను ఏ విధంగా మీ ముందుకు తెచ్చినా, దానిని వినడం మంచి ఆధ్యాత్మిక అభ్యాసం. వారి ఆందోళనను విని, వినయంతో పరిశీలించిన తర్వాత, వారు చెప్పేది కొంతవరకైనా నిజమేనని మీరు గ్రహిస్తే, విచారాన్ని వ్యక్తపరచడం, క్షమాపణ అడగడం, మారడానికి నిబద్ధతతో నిర్ణయించుకోవడం ప్రేమపూర్వకమైన స్పందన అవుతుంది. అయితే, వారి ఆందోళనను వినయంతో పరిశీలించిన తర్వాత, మీరు పాపం చేశారని మీకు అనిపించకపోతే, వారు తొందరపడి చేసిన తప్పుడు తీర్పును వారికి సౌమ్యంగా, కనికరంతో తెలియజేయడానికి ప్రయత్నించాల్సిన సమయం అది.

ఒక వ్యక్తికి వారి తప్పును తెలియజేయడంలో వరుసగా అనుసరించవలసిన మూడు దశలను ఈ వాక్యభాగం సూచిస్తుంది. మొదట, మీరిద్దరే ఉన్నప్పుడు అది జరగాలి. రెండవది, మరో ఇద్దరు లేదా ముగ్గురితో కలిసి అది చేయాలి. మూడవది, కతోలిక సభ సమక్షంలో అది చేయాలి. మొదటగా, రెండవ, మూడవ పద్ధతులను పక్కనపెట్టి, మొదటిదాన్ని మాత్రమే పరిశీలించడానికి ప్రయత్నించండి. ఇలా వ్యక్తిగతంగా తప్పును తెలియజేయడంలోని లక్ష్యం సఖ్యత. ఇలాంటి పరిస్థితిని మీరు ఎంత బాగా ఎదుర్కొంటున్నారో లోతుగా ఆలోచించడానికి ఎంతో శ్రద్ధ పెట్టడం మంచిది. ఎందుకంటే మీరు దానిని చక్కగా చేయగలిగితే, తప్పును తెలియజేసే రెండవ లేదా మూడవ పద్ధతి అవసరం ఉండదు.

సఖ్యతకు ప్రధాన శత్రువు అహంకారం. అన్నిటికంటే ముందుగా మన గురించే ఆలోచించేలా చేసే అలవాటే అహంకారం; అది మరీ తీవ్రమైనప్పుడు మన గురించి తప్ప మరెవరి గురించీ ఆలోచించము. అహంకారం ఆత్మపరిశీలనను అసాధ్యం చేస్తుంది. మన పాపం మనకు కనిపించదు; దానిని ఎవరైనా గుర్తించినా, అది సమస్యలకు దారితీసినా వెంటనే కలవరపడతాము. అహంకారానికి వ్యతిరేకమైనది వినయం. మనల్ని మనం మరచిపోయి, ఇతరుల మేలు గురించి మాత్రమే శ్రద్ధ వహించేలా చేసే సుగుణం ఇది. ఒక వ్యక్తి వినయంలో ఎదుగుతున్నప్పుడు, దుష్టుడు ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలతో శోధిస్తాడు: మరి నీ సంగతేమిటి? నీదే ఒప్పు, వారిదే తప్పు! ఇది అన్యాయం! నిన్ను ఇలా చూడకూడదు! శోధనకు గురిచేసే ఈ ఆలోచనలను ఎల్లప్పుడూ తిరస్కరించాలి. మనం వినయంతో ఉన్నప్పుడే వినయంలోని అర్థం మనకు తెలుస్తుంది. అహంకారం ఉన్న వ్యక్తికి వినయం మూర్ఖత్వంగా కనిపిస్తుంది. కానీ వినయమే నిజమైన జ్ఞానం.

మీ పాపం గురించి ఎవరైనా తమ ఆందోళనను మీకు తెలియజేసినప్పుడు మీరు ఎంత వినయంతో ఉంటారో ఈ రోజు ధ్యానించండి. మీరు ఎలా స్పందిస్తారు? ఇలా జరిగినప్పుడు మీకు కోపం వచ్చి, మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అలా అయితే, నిజాయితీతో ఇది అహంకారమని, ఇది మీ పాపమని మీలో మీరు అంగీకరించండి. మరొకరు మీ తప్పును మీకు తెలియజేసినప్పుడు మీరు స్పందించవలసిన ఆదర్శమైన, వినయపూర్వకమైన విధానం గురించి ఆలోచించడానికి సమయం కేటాయించండి. మనసులు గాయపడిన ఏ బంధంలోనైనా సఖ్యతకే మీరు మొదటి ప్రాధాన్యం ఇస్తే, ఆ పవిత్రమైన, వినయపూర్వకమైన కోరిక మీ జీవితంలోని ప్రతి ఒక్కరితో సఖ్యపడగలిగేలా మీకు మార్గదర్శకమవుతుంది.

అత్యంత కరుణామయుడవైన ప్రభువా, మమ్మల్ని నీతోను, ఒకరితో ఒకరినీ సఖ్యపరచడానికి నీవు భూమిపైకి వచ్చావు. దయచేసి నా పాపాన్ని నాకు చూపించి, దానిని గుర్తించడానికి అవసరమైన వినయాన్ని నాకు దయచేయి. తద్వారా నేను పశ్చాత్తాపపడి నీ వైపు తిరిగి రాగలను. నీవు నా పాపాన్ని నాకు తెలియజేసే అనేక మార్గాలను, ముఖ్యంగా నా జీవితంలోని ఇతరుల ద్వారా తెలియజేసే వాటిని, స్వీకరించడానికి సిద్ధంగా ఉండేలా నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

వ్యాకులమాతకు నవదిన ప్రార్థన
సంప్రదాయంగా సెప్టెంబరు 7–15 తేదీలలో ప్రార్థిస్తారు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ప్రదర్శించిన చిత్రాలు: ఆర్సేన్ రాబేర్ చిత్రించిన కొండమీది ప్రసంగం , వికీమీడియా కామన్స్ ద్వారా